Mahaa Daily Exclusive

  యోగా ఒక మతానికి పరిమితం కాదు…

Share

  • యోగా ఒక మతానికి పరిమితం కాదు
  • అలా చూడటం మూర్ఖత్వం
  • మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు
  • సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ వేదికగా యోగా ఉత్సవాలు
  • ప్రపంచానికి భారత్ అందించిన గొప్ప కానుక యోగా అన్న వెంకయ్య నాయుడు
  • మనిషిని సమగ్ర మనిషిగా మార్చే అద్భుత సాధనం యోగా అని వ్యాఖ్య

హైదరాబాద్, మహా : అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా సికింద్రాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్స్ వేదికగా భారీ యోగా ఉత్సవాలు జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు… యోగా విశిష్టతపై అత్యంత స్పష్టమైన, కీలకమైన వ్యాఖ్యలు చేశారు. యోగాను ఒక మత కోణంలో చూసే వారిపై ఆయన తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. యోగా అనేది ఏ ఒక్క మతానికో, వర్గానికో పరిమితమైంది కాదని… దానికి మతాన్ని ఆపాదించి చూడటం ముమ్మాటికీ మూర్ఖత్వమే అవుతుందని స్పష్టం చేశారు. “ప్రపంచానికి భారతదేశం అందించిన అత్యంత గొప్ప అమూల్యమైన కానుక యోగా. ఇది కేవలం వ్యాయామం కాదు.. మనిషిని సమగ్ర మనిషిగా మార్చే అద్భుత సాధనం. మానవ చైతన్యానికి, సర్వమానవ సౌభ్రాతృత్వానికి ఇదొక నిదర్శనం. మానసిక ఒత్తిడిని దూరం చేసి, గుండె నిబ్బరాన్ని, ఆధ్యాత్మిక స్థైర్యాన్ని ఇచ్చే ఈ జీవన విధానాన్ని మన పూర్వీకులు మనకు అందించారు. ప్రకృతి ఒడిలో జీవిస్తూ ఆరోగ్యమే మహాభాగ్యం అనే మాటను ప్రతి ఒక్కరూ నిజం చేయాలి” అని ఆయన పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, ఎంపీ డాక్టర్ కె. లక్ష్మణ్ మాట్లాడుతూ… విశ్వవ్యాప్తంగా యోగాకు వస్తున్న గుర్తింపు మన దేశానికి గర్వకారణమన్నారు. యోగా అనేది మన ప్రాచీన సంస్కృతిలో ఒక భాగమని, నేటి ఆధునిక కాలంలో ప్రతి ఒక్కరికీ శారీరక, ఆరోగ్య చింతన ఎంతో అవసరమని పేర్కొన్నారు. బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు మాట్లాడుతూ, ప్రధాని మోదీ చొరవతోనే 12 సంవత్సరాల క్రితం యోగాకు అంతర్జాతీయంగా గుర్తింపు లభించిందని, నేడు ప్రపంచ దేశాలన్నీ యోగాను అనుసరిస్తున్నాయని గుర్తు చేశారు. డిప్రెషన్ లాంటి సమస్యలను దూరం చేయడానికి యోగా అద్భుతంగా పనిచేస్తుందని, పిల్లల నుండి పెద్దల వరకు అందరూ దీనిని రోజువారీ జీవితంలో భాగం చేసుకోవాలని సూచించారు.

కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో సికింద్రాబాద్‌ ఫరేడ్ గ్రౌండ్ లో 1డే కౌంట్ డౌన్ ఈవేంట్ లో భాగంగా యోగ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్ల , మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడులతో పాటు పలువురు హాజరయ్యారు. ​ఈ యోగా మహోత్సవానికి నగర నలుమూలల నుండి యువతీ యువకులు, విద్యార్థులు, మహిళలు మరియు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. వేదిక ప్రాంగణమంతా యోగా సాధకులతో కిక్కిరిసిపోయింది.

కులమతాలకు అతీతంగా అందరూ భాగస్వాములు కావాలని హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ పిలుపు నిచ్చారు. యోగా సాధన ద్వారా మానసిక దృఢత్వానికి సామాజిక ఆవశ్యకతపై వివరించారు. భారత ప్రాచీన యోగాను ప్రపంచానికి పరిచయం చేసి అంతర్జాతీయ స్థాయిలో విశేషా ప్రచూర్యం కల్పించిన వ్యక్తి ప్రధాని మోదీ అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. యోగా దినోత్సవ నేపథ్యాన్ని, ప్రధాని నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో జరుగుతున్న యోగా ఉత్సవాల విశిష్టతను వివరించారు.

​మల్కాజ్‌గిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ మాట్లాడుతూ, ​దేశ యువత సంపూర్ణ ఆరోగ్యానికి యోగాసనాలు అత్యంత అవసరమన్నారు. భారతదేశ ప్రాచీన సంస్కృతి, సాంప్రదాయాలలో యోగా ఒక భాగమని, ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ బాధ్యతలు స్వీకరించిన తర్వాతే, మన దేశ సంపదైన యోగాను ప్రపంచ దేశాలన్నింటికీ పరిచయం చేశారన్నారు. నేడు ప్రపంచవ్యాప్తంగా యోగా వేడుకలను ఘనంగా జరుపుకోవడం ప్రతి భారతీయుడికి ఎంతో సంతోషాన్నిచ్చే విషయమన్నారు. ​యువతకు శారీరక, మానసిక దృఢత్వానికి యోగ అవసరం దేశ భవిష్యత్తు యువత చేతుల్లోనే ఉందని, నేటి యువత మానసికంగా ప్రశాంతంగా, శారీరకంగా దృఢంగా ఉండాలంటే నిత్యం యోగాసనాలు వేయడం ఎంతో అవసరమన్నారు. యువత ఒత్తిడిని అధిగమించి సంపూర్ణ ఆరోగ్యవంతులుగా మారేందుకు యోగా ఒక అద్భుత సాధనంగా ఉపయోగపడుతుంది. ప్రతి ఒక్కరూ యోగాను అలవాటు చేసుకొని ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మించాలని ఆయన పిలుపునిచ్చారు.