- యధేచ్ఛగా అక్రమ నిర్మాణం
- చోద్యం చూస్తున్న మునిసిపల్ అధికారులు
- ఫిర్యాదు చేసిన పట్టించుకోని వైనం
- ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సొసైటీ సభ్యులు
హైదరాబాద్, మహా : అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం మోపాల్సిన మునిసిపల్ అధికారులు భవన అక్రమ నిర్మాణంపై ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదు. మునిసిపల్ అధికారులపై తీరుపై బంజారాహిల్స్ లోని శ్రీ వేంకటేశ్వర కో ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ సభ్యులు అగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిత్యం వీఐపీలు, ఉన్నతాధికారులు తిరిగే కాలనీలో భవన నిర్మాణ పనులు నిరంతరం సాగుతున్నా అటు వైపు కన్నెత్తి చూడకపోవడంపై కాలనీ వాసులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. బంజారాహిల్స్ రోడ్ నంబర్ 12 లోని ఎమ్మెల్యే కాలనీలో ఫ్లాట్ నంబర్ 55 ఏ కు సంబంధించిన యజమాని భవన నిర్మాణం కోసం మునిసిపల్ అధికారుల నుంచి అనుమతులు తీసుకున్నారు. అయితే అధికారులు అనుమతించిన సిల్ట్ ప్లస్ 4 అంతస్థుల అనుమతికి బదులు ఆరంతస్థుల భవనాన్ని నిర్మిస్తున్నారు. ఈ విషయంపై కాలనీ వాసులు, సొసైటీ సభ్యులు స్థానిక టౌన్ ప్లానింగ్ అధికారులతో పాటు సర్కిల్ 36 డిప్యూటీ కమిషనర్ కు ఫిర్యాదులు చేశారు. అయినప్పటికీ భవన నిర్మాణ పనులను కనీసం పరిశీలించని అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. అధికారుల నిర్లక్ష్య వైఖరిపై సొసైటీ అధ్యక్షులు నారాయణరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్రమ నిర్మాణాలను ఆపాల్సిన అధికారులు మౌనం వహించడం వెనుక ఏదో మతలబు ఉందని ఆయన ఆరోపించారు. అక్రమ నిర్మాణాన్ని ఆపాలాని కోరుతూ అధికారులను పలు పర్యాయాలు కలవడం జరిగిందని, అయినా ఫలితం లేదని ఆయన వాపోయారు. ఇప్పటికైనా జీహెచ్ఎంసీ, హైడ్రా అధికారులు స్పందించి అక్రమంగా నిర్మిస్తున్న భవనాన్ని ఆపాలాని కోరారు. కఆరంతస్థుల భవన నిర్మాణం వల్ల కార్ల పార్కింగ్ తో పాటు అనేక రకాల ఇబ్బందులను కాలనీ వాసులు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆయన పేర్కొన్నారు.








