‘వీబీజీ రామ్‌జీ’ చట్టాన్ని వెంటనే ఉపసంహరించాలి.
• ఉపాధి హామీని యథాతథంగా కొనసాగించాలి.
• కేంద్రానికి మూడు నిరసన లేఖలు రాసిన రాష్ట్ర మంత్రి సీతక్క.
హైదరాబాద్, మహా.
కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకువచ్చిన ‘వీబీజీ రామ్‌జీ’ చట్టాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ రాష్ట్ర మంత్రి సీతక్క కేంద్ర ప్రభుత్వానికి నిరసన లేఖలు రాశారు. ఈ నూతన చట్టాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని, మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని (ఎంజీఎన్‌ఆర్‌ఈజీఎస్) గతంలో మాదిరిగానే యథాతథంగా కొనసాగించి గ్రామీణ పేదల ఉపాధి హక్కును కాపాడాలని ఆమె డిమాండ్ చేశారు. కొత్త చట్టంపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ కేంద్ర ప్రభుత్వానికి మూడు వేర్వేరు లేఖలు పంపినట్లు శనివారం హైదరాబాద్‌లోని సచివాలయంలో మీడియాతో మాట్లాడుతూ మంత్రి వెల్లడించారు. గ్రామ పంచాయతీల అధికారాలను నిర్వీర్యం చేసేలా ఉన్న నిబంధనలను తక్షణమే సవరించాలని ఆమె ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు.
వీబీజీ రామ్‌జీ నిధుల కేటాయింపు విధానం గ్రామీణ పేదలు, దళితులు, గిరిజనులకు తీవ్ర అన్యాయం చేసేలా ఉందని మంత్రి సీతక్క ఆందోళన వ్యక్తం చేశారు. నిధుల పంపిణీ విషయంలో కేంద్రం ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోరాదని హితవు పలికారు. రాష్ట్రాన్ని మొత్తం ఒకే యూనిట్‌గా పరిగణించకుండా.. గ్రామ స్థాయిలో ఉన్న వాస్తవ ఉపాధి అవసరాలను బట్టి నిధులు కేటాయించాలని స్పష్టం చేశారు. ముఖ్యంగా ఆదిలాబాద్, ములుగు, కుమురంభీం ఆసిఫాబాద్ వంటి అత్యంత వెనుకబడిన ప్రాంతాల అవసరాలను కేంద్రం విస్మరించకూడదని, గ్రామ పంచాయతీల్లో నమోదైన వాస్తవ పనిదినాల ఆధారంగానే నిధుల పంపిణీ జరగాలని ఆమె సూచించారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాన్ని సైతం వీబీజీ రామ్‌జీ చట్టం పరిధిలోకి తీసుకువచ్చి అనుమతులు మంజూరు చేయాలని కేంద్రానికి మంత్రి విజ్ఞప్తి చేశారు. గృహ నిర్మాణ లబ్ధిదారులకు గతంలో మాదిరిగానే 90 రోజుల పాటు ఉపాధి కల్పించాలని కోరారు. ఉపాధి హామీ పథకం నుంచి వ్యక్తిగత భూ అభివృద్ధి పనులను తొలగిస్తే చిన్న, సన్నకారు రైతులు తీవ్రంగా నష్టపోతారని, ఎస్సీ, ఎస్టీ రైతులకు ప్రయోజనం చేకూర్చే జీవనోపాధి పనులను నిరంతరాయంగా కొనసాగించాలని డిమాండ్ చేశారు. వరదలతో దెబ్బతిన్న భూముల పునరుద్ధరణ పనులకు, న్యూట్రి గార్డెన్లు, వెదురు తోటల పెంపకానికి సత్వరమే అనుమతి ఇవ్వాలని ఆమె కోరారు.
కొత్త చట్టంలో పొందుపరిచిన 60 రోజుల తప్పనిసరి ఉపాధి విరామం నిబంధన.. గ్రామీణ పేదల ఆర్థిక పరిస్థితిపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతుందని మంత్రి సీతక్క హెచ్చరించారు. ఆదివాసీ, గిరిజన ప్రాంతాలతో పాటు తీవ్ర నీటి ఎద్దడి ఎదుర్కొనే ప్రాంతాలకు ఈ 60 రోజుల ఉపాధి నిషేధం నుంచి పూర్తిస్థాయి మినహాయింపు ఇవ్వాలని సూచించారు. వ్యవసాయ అనుబంధ పనులకు ఏడాది పొడవునా ఉపాధి అవకాశాలు కల్పించాల్సిన అవసరం ఉందని, మొక్కల పెంపకం, అటవీకరణ కార్యక్రమాలకు ఈ ఉపాధి విరామాన్ని వర్తింపజేయవద్దని స్పష్టం చేశారు. పేదలు, దళితులు, గిరిజనులు, వ్యవసాయ భూమి లేని నిరుపేద కుటుంబాల ప్రయోజనాలను ప్రధానంగా దృష్టిలో ఉంచుకుని ఈ చట్టంలో తక్షణమే తగిన మార్పులు, చేర్పులు చేయాలని మంత్రి సీతక్క కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.







