Mahaa Daily Exclusive

  సీఎం అయినా.. భార్య పర్మిషన్ తీసుకోవాల్సిందే!

Share

సీఎం అయినా.. భార్య పర్మిషన్ తీసుకోవాల్సిందే!
* పల్నాడు పర్యటనలో ఆసక్తికర ఘట్టం.
* కోల్డ్ ప్రెస్డ్ నూనె కొనుగోలుకు ముందు భువనేశ్వరికి చంద్రబాబు ఫోన్.
* ప్రకృతి వ్యవసాయంపై రైతుల కృషికి ముఖ్యమంత్రి అభినందనలు.
పల్నాడు,మహా.
ముఖ్యమంత్రి హోదాలో నిత్యం పాలనా వ్యవహారాలతో ఎంత బిజీగా ఉన్నా.. ఇంటి విషయానికొచ్చేసరికి ఇల్లాలు మాటే శాసనం! ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పల్నాడు జిల్లా పర్యటనలో సరిగ్గా ఇలాంటి ఆసక్తికర ఘటనే చోటుచేసుకుంది. ఒక రైతు వ్యవసాయ క్షేత్రంలో స్వచ్ఛమైన కోల్డ్‌ప్రెస్డ్ (గానుగ) వేరుశనగ నూనెను కొనుగోలు చేసే ముందు, చంద్రబాబు తన సతీమణి నారా భువనేశ్వరికి అక్కడికక్కడే ఫోన్ చేసి మాట్లాడటం అందరినీ ఆకర్షించింది. “ఇంట్లోకి ఏ వస్తువు కొనుగోలు చేయాలన్నా ఆమెను అడగాల్సిందే” అంటూ సీఎం నవ్వుతూ చేసిన సరదా వ్యాఖ్యలు అక్కడున్న వారిలో ఉత్సాహాన్ని నింపాయి. శనివారం చిలకలూరిపేట సమీపంలోని లింగంగుంట్లలో ఈ అరుదైన సన్నివేశం చోటుచేసుకుంది.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అన్నదాత సుఖీభవ’ కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు పల్నాడు జిల్లాలో విస్తృతంగా పర్యటించారు. ఈ క్రమంలో లింగంగుంట్లలో ప్రకృతి వ్యవసాయం చేస్తున్న ఆదర్శ రైతు గుడిపల్లి నాగభూషణం వ్యవసాయ క్షేత్రాన్ని ఆయన స్వయంగా పరిశీలించారు. గత నాలుగేళ్లుగా రసాయన ఎరువులు లేకుండా పూర్తిగా ప్రకృతి సిద్ధమైన పద్ధతుల్లో సాగు చేస్తున్న విధానాలను నాగభూషణం ముఖ్యమంత్రికి సవివరంగా తెలియజేశారు. ప్రకృతి వ్యవసాయంతో పెట్టుబడి ఖర్చు గణనీయంగా తగ్గడమే కాకుండా, భూసారం పెరిగి మంచి దిగుబడులతో వ్యవసాయం లాభసాటిగా మారిందని ఆయన తెలిపారు. దీనిపై హర్షం వ్యక్తం చేసిన చంద్రబాబు.. రాష్ట్రవ్యాప్తంగా ప్రకృతి వ్యవసాయాన్ని పెద్ద ఎత్తున ప్రోత్సహించడమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. నాగభూషణం లాంటి ఆదర్శ రైతులను చూసి మిగతా వారు స్ఫూర్తి పొందాలని ఆయన కొనియాడారు.
అనంతరం రైతు నాగభూషణానికి చెందిన ఆర్గానిక్ వేరుశనగ గానుగ కేంద్రాన్ని ముఖ్యమంత్రి ఆసక్తిగా పరిశీలించారు. వేరుశనగ, నువ్వులు, కొబ్బరి తదితర నూనె గింజల నుంచి అత్యంత సహజ పద్ధతిలో నూనెను ఎలా తీస్తున్నారో స్వయంగా అడిగి తెలుసుకున్నారు. ఈ స్వచ్ఛమైన నూనెను ఒకసారి వాడి చూడాలని రైతు కోరగా.. ముఖ్యమంత్రి వెంటనే తన సతీమణి భువనేశ్వరికి ఫోన్ చేసి కనుక్కుని మరీ కిలో నూనెను కొనుగోలు చేయడం విశేషం. ఇలాంటి సంప్రదాయ గానుగ పరిశ్రమల వల్ల గ్రామీణ ఆర్థిక వ్యవస్థ మరింత బలోపేతం అవుతుందని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. ఈ పర్యటనలో భాగంగా గో ఆధారిత ప్రకృతి వ్యవసాయ వనరుల కేంద్రాన్ని కూడా సందర్శించిన సీఎం.. అక్కడ జీవామృతం, ఘన జీవామృతం తయారీ విధానాలను తిలకించారు. రైతు సాగు చేస్తున్న బొప్పాయి తోటను పరిశీలించి, ఆయన ప్రేమగా అందించిన ఆర్గానిక్ బొప్పాయి పండును ముఖ్యమంత్రి రుచి చూశారు. అంతర పంటల సాగుతో జీవ వైవిధ్యం పెరిగి చీడపీడల బెడద ఎలా తగ్గుతుందో ఈ సందర్భంగా రైతు ముఖ్యమంత్రికి వివరించారు.