ఆర్టీసీలో నవశకం..
* ఇక ప్రయాణికుల రద్దీ ఆధారంగానే బస్సులు.
* పాత పద్ధతులకు స్వస్తి.. ‘స్మార్ట్ షెడ్యూలింగ్’తో భారీ సంస్కరణలకు నాంది.
* ఆగస్టు నాటికి కొత్త విధానం.. ట్రాఫిక్ అంచనాలపై ముమ్మర అధ్యయనం.
హైదరాబాద్, మహా.
తెలంగాణ రాష్ట్ర ప్రజా రవాణా వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తున్న ఆర్టీసీ సరికొత్త సంస్కరణల దిశగా చారిత్రక అడుగులు వేస్తోంది. ప్రయాణికులకు మరింత చేరువయ్యే క్రమంలో బస్సుల రాకపోకల విధానంలో సమూల మార్పులకు శ్రీకారం చుట్టింది. ఇకపై అధికారుల అంచనాలు కాకుండా.. కేవలం ప్రయాణికుల రద్దీ, వారి రాకపోకల అవసరాలే బస్సుల షెడ్యూళ్లను శాసించబోతున్నాయి. దశాబ్దాలుగా వస్తున్న సంప్రదాయ నిర్వహణ విధానాలకు, పాత ట్రాఫిక్ అంచనాలకు శాశ్వతంగా చెక్ పెడుతూ.. స్మార్ట్ షెడ్యూలింగ్’ పేరుతో టీజీఎస్ ఆర్టీసీ ఒక బృహత్తర కార్యక్రమాన్ని భుజానికెత్తుకుంది. ఈ మేరకు సంస్థ ఉన్నతాధికారులు అన్ని జోన్ల ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు (ఈడీలు), రీజియన్ల ఆర్ఎంలకు అత్యంత కీలకమైన సర్క్యులర్ జారీ చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన మహాలక్ష్మి'(మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం) పథకం అమలు తర్వాత ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణ ధోరణులు అనూహ్యంగా మారిపోయాయి. మెరుగైన వైద్యం కోసం సుదూర ప్రాంతాల నుంచి హైదరాబాద్ నగరానికి, అలాగే జిల్లా కేంద్రాలకు ప్రయాణించే వారి సంఖ్య భారీగా పెరిగింది. మరోవైపు ఆధ్యాత్మిక చింతనతో యాదగిరిగుట్ట, వేములవాడ తదితర ప్రముఖ పుణ్యక్షేత్రాలకు వెళ్లే భక్తుల రద్దీ అనూహ్యంగా పుంజుకుంది. వీటికి తోడు నగరాలు, పట్టణాల విస్తరణ, పారిశ్రామిక అభివృద్ధి, విద్యా కేంద్రాల పెరుగుదల తదితర అంశాలు ప్రజల ప్రయాణ అవసరాల్లో గణనీయమైన మార్పులు తీసుకువచ్చాయి. ఈ కీలక పరిణామాలను నిశితంగా గమనించిన ఆర్టీసీ యాజమాన్యం.. ప్రతి రూట్‌పై అత్యంత శాస్త్రీయంగా ట్రాఫిక్ అధ్యయనాలను నిర్వహించి, మారుతున్న అవసరాలకు అనుగుణంగా బస్సు షెడ్యూళ్లను పూర్తిస్థాయిలో పునర్వ్యవస్థీకరించాలని దృఢ నిశ్చయానికి వచ్చింది.
ఈ సరికొత్త ప్రణాళికలో భాగంగా రైట్ బస్ రైట్ రూట్ రైట్ టైమ్’ (సరైన బస్సు, సరైన మార్గం, సరైన సమయం) అనే ప్రతిష్ఠాత్మక లక్ష్యంతో సంస్థ ముందుకు సాగనుంది. కొన్ని రూట్లలో బస్సులు ప్రయాణికులతో కిక్కిరిసిపోతుంటే, మరికొన్ని మార్గాల్లో రద్దీ నామమాత్రంగా ఉంటోంది. ఉదయం, సాయంత్రం పీక్ అవర్స్‌లో రద్దీగా ఉండే మార్గాలు సైతం మధ్యాహ్న సమయాల్లో దాదాపు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. ఈ అసమానతలను తొలగించేందుకు డిపో మేనేజర్ల ఆధ్వర్యంలో సమగ్ర సర్వే జరగనుంది. ప్రతి రూట్‌లో ట్రాఫిక్ ప్రారంభ సమయం, రద్దీ గంటలు, ఖాళీ సమయాలు, ప్రయాణికులు అత్యధికంగా ఎక్కే, దిగే ప్రాంతాల సాంద్రత తదితర కీలక అంశాలపై అత్యంత శాస్త్రీయ అధ్యయనాన్ని నిర్వహించనున్నారు. తద్వారా ఏ సమయానికి ఏ రూట్‌లో బస్సు అవసరమో కచ్చితంగా అంచనా వేసి షెడ్యూళ్లను రూపొందిస్తారు.
ప్రయాణికుల సౌకర్యంతో పాటు సంస్థ సిబ్బంది సంక్షేమం, భద్రత పైనా ఆర్టీసీ ప్రత్యేక దృష్టి సారించింది. తీవ్రమైన సిబ్బంది కొరత కారణంగా హైదరాబాద్, కరీంనగర్ జోన్లలో ఏకంగా 2,126 షెడ్యూళ్లలో సిబ్బంది ఓవర్ టైం (ఓటీ) చేయాల్సి వస్తోంది. ఇందులో 1,354 షెడ్యూళ్లు ఏకంగా రెండు గంటలకు మించిన ఓటీతో నడుస్తున్నాయి. దీనివల్ల నిర్వహణ వ్యయం పెరగడమే కాకుండా.. డ్రైవర్లు, కండక్టర్లు తీవ్ర అలసటకు గురై భద్రతాపరమైన ముప్పు పొంచి ఉందని యాజమాన్యం గ్రహించింది. అందుకే రెండు గంటలకు మించిన ఓవర్ టైం షెడ్యూళ్లను వెంటనే సమీక్షించి, వాటిని కుదించాలని కఠిన నిర్ణయం తీసుకుంది. సిబ్బంది అప్రమత్తతను పెంచి, ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చడమే ధ్యేయంగా ఈ అడుగు వేసింది.
వీటితో పాటు అంతర్ జిల్లాల ప్రయాణాలను మరింత సులభతరం చేసేందుకు నగరాల మధ్య మరిన్ని బస్సులను అందుబాటులోకి తేనుంది. హైదరాబాద్-వరంగల్, హైదరాబాద్-కరీంనగర్, హైదరాబాద్-ఖమ్మం, ఖమ్మం-భద్రాచలం వంటి రద్దీ రూట్లలో ‘సింగిల్ షిఫ్ట్’ విధానాన్ని ప్రోత్సహించాలని అధికారులకు సూచించింది. అలాగే బస్సులను రాత్రి వేళల్లో ఆయా ప్రాంతాల్లోనే నిలిపివేసే ‘నైట్ అవుట్’ విధానాన్ని పకడ్బందీగా అమలు చేయనున్నారు. దీనివల్ల బస్సులు ప్రయాణికులు లేకుండా తిరిగే నాన్-రెవెన్యూ కిలోమీటర్లు భారీగా తగ్గిపోయి, అపారమైన ఇంధన పొదుపు సాధ్యమవుతుంది. సిబ్బందికి తగిన విశ్రాంతి లభించడంతో పాటు సంస్థ నిర్వహణ సామర్థ్యం గణనీయంగా పెరుగుతుంది. జులై 31వ తేదీ కల్లా ఈ సమగ్ర అధ్యయన ప్రక్రియను పూర్తి చేసి, ఆగస్టు నెల నుంచి ఈ ‘స్మార్ట్’ విధానాన్ని రాష్ట్రవ్యాప్తంగా పకడ్బందీగా అమలు చేసేలా ఆర్టీసీ యాజమాన్యం ప్రణాళికలు సిద్ధం చేసింది.








