Mahaa Daily Exclusive

  క్యూర్‌ పరిధిలో ఇందిరమ్మ ఇండ్లకు నేటి నుంచి దరఖాస్తులు….

Share

క్యూర్‌ పరిధిలో ఇందిరమ్మ ఇండ్లకు నేటి నుంచి దరఖాస్తులు.
* రూ.10 వేల టోకెన్‌తో నమోదు.. ఆగస్టు 10 వరకు అవకాశం.

హైదరాబాద్, మహా
హైదరాబాద్‌ కోర్ అర్బన్ రీజియన్ పరిధిలో సొంత స్థలం లేని పేద కుటుంబాలకు బహుళ అంతస్తుల ఇందిరమ్మ ఇండ్ల కేటాయింపు ప్రక్రియకు తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇందుకు సంబంధించిన వాట్సాప్ దరఖాస్తుల వ్యవస్థ, ఎల్‌ఐజీ గృహాల బ్రోచర్‌ను సోమవారం మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. జూలై 21 నుంచి ఆగస్టు 10 వరకు దరఖాస్తులు స్వీకరిస్తామని, మీ సేవ కేంద్రాలు, ప్రత్యేక వెబ్‌సైట్, వాట్సాప్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు.

దరఖాస్తు చేసుకునే ప్రతి కుటుంబం రూ.10 వేల టోకెన్ మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుందని మంత్రి తెలిపారు. లబ్ధిదారుల ఎంపిక పూర్తిగా డ్రా పద్ధతిలో పారదర్శకంగా జరుగుతుందని, డ్రాలో ఎంపిక కాకపోయిన వారి టోకెన్ మొత్తాన్ని పూర్తి స్థాయిలో తిరిగి చెల్లిస్తామని స్పష్టం చేశారు. ప్రతి కుటుంబం నుంచి ఒక్కరికి మాత్రమే దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుందని చెప్పారు.

క్యూర్ పరిధిలో ఇల్లు, స్థలం రెండూ లేని నిరుపేద కుటుంబాలకు తొలి విడతలో ప్రాధాన్యం ఇస్తామని మంత్రి వెల్లడించారు. లబ్ధిదారుల పేరునే స్థలాన్ని రిజిస్ట్రేషన్ చేయడంతో పాటు ప్రతి ఇంటికి రూ.5 లక్షల ప్రభుత్వ సబ్సిడీ అందజేస్తామని తెలిపారు. మిగిలిన మొత్తానికి బ్యాంకుల ద్వారా రుణ సౌకర్యం కల్పించే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు పేర్కొన్నారు.

ప్రతి ఫ్లాట్ 528 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించబడుతుందని, ఆధునిక సౌకర్యాలతో కూడిన జీ ప్లస్ బహుళ అంతస్తుల భవనాలను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. తొలి దశలో హైదరాబాద్‌లోని 16 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మొత్తం 7,680 ఫ్లాట్ల నిర్మాణం చేపడుతున్నామని, అనంతరం మిగిలిన నియోజకవర్గాలకు కూడా పథకాన్ని విస్తరిస్తామని వెల్లడించారు.

ప్రభుత్వ సబ్సిడీతో పొందిన ఫ్లాట్లను పదేళ్ల పాటు విక్రయించడానికి లేదా అద్దెకు ఇవ్వడానికి వీల్లేదని మంత్రి పొంగులేటి స్పష్టం చేశారు. ఈ నిబంధనలను ఉల్లంఘిస్తే కేటాయింపును రద్దు చేసి, ఫ్లాట్‌ను ప్రభుత్వం తిరిగి స్వాధీనం చేసుకుంటుందని హెచ్చరించారు. ఈ చర్యలతో పథకం దుర్వినియోగాన్ని పూర్తిగా అరికట్టాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు.

రాష్ట్రంలో ఇప్పటికే రెండు విడతల్లో ఏడు లక్షల ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేశామని, వాటిలో రెండు లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తయ్యే దశలో ఉందని మంత్రి వెల్లడించారు. ఇప్పటి వరకు సొంత స్థలాలు ఉన్న పేదలకు ఇళ్లు మంజూరు చేశామని, ఇకపై స్థలం లేని పేదల ఇంటి కలను కూడా నెరవేర్చేందుకు క్యూర్ ప్రత్యేక గృహ పథకాన్ని ప్రారంభించామని చెప్పారు.

గత ప్రభుత్వ హయాంలో నగరానికి దూరంగా నిర్మించిన గృహ సముదాయాలు ప్రజలకు ఉపయోగపడలేదని విమర్శించిన మంత్రి, ఈసారి నగర కోర్ ప్రాంతాల్లోనే విలువైన ప్రభుత్వ భూములపై టవర్లు నిర్మించి పేదలకు ఇళ్లు అందజేస్తామని స్పష్టం చేశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు సవాళ్లతో ఉన్నప్పటికీ పేదల గృహ హక్కు విషయంలో ప్రభుత్వం రాజీపడబోదని పేర్కొన్నారు.

మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడుతూ గుడిసెలు లేని తెలంగాణ నిర్మాణమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. ఇళ్ల కేటాయింపులో పూర్తిస్థాయి పారదర్శకత పాటించడంతో పాటు రిజర్వేషన్ విధానాన్ని కూడా అమలు చేస్తామని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో నిర్మించిన హౌసింగ్ బోర్డు కాలనీల తరహాలోనే, మరింత ఆధునిక సౌకర్యాలతో ఈ గృహ సముదాయాలు రూపుదిద్దుకుంటాయని వెల్లడించారు.

మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ గత ప్రభుత్వం హౌసింగ్ విభాగాన్ని నిర్వీర్యం చేసిందని, తమ ప్రభుత్వం దానిని పునరుద్ధరించి పేదల గృహ నిర్మాణానికి కొత్త ఊపు తీసుకొచ్చిందని అన్నారు. బల్కంపేట ఎల్లమ్మ బోనాల సందర్భంగా ఈ పథకాన్ని ప్రారంభించడం శుభపరిణామమని పేర్కొంటూ, వచ్చే బోనాల నాటికి తొలి దశ ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేయడమే ప్రభుత్వ లక్ష్యమని వెల్లడించారు.