సర్ ప్రక్రియపై అప్రమత్తంగా ఉండాలి.
• జీహెచ్‌ఎంసీ ఎన్నికలే లక్ష్యం.
• కాంగ్రెస్‌పై మాజీ మంత్రి హరీశ్‌రావు విమర్శలు
సంగారెడ్డి, మహా.
ప్రత్యేక ఓటరు సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియ విషయంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అత్యంత అప్రమత్తంగా వ్యవహరించాలని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు పిలుపునిచ్చారు. పశ్చిమ బెంగాల్, అస్సాం, తమిళనాడు రాష్ట్రాల్లో ఎస్‌ఐఆర్ ప్రక్రియ కారణంగా ఓటర్ల జాబితాలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలు ఉన్నాయని, ఎన్నికల ఫలితాలపై కూడా ఆ ప్రభావం పడిందనే అనుమానాలు వ్యక్తమయ్యాయని పేర్కొన్నారు. రాబోయే జీహెచ్‌ఎంసీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పార్టీ శ్రేణులంతా ఓటరు జాబితాలపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.
పఠాన్‌చెరులోని జీఎంఆర్ కన్వెన్షన్ హాల్‌లో సోమవారం నిర్వహించిన బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు, ఎస్‌ఐఆర్ అవగాహన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి, బీఆర్ఎస్ నాయకుడు ఎర్రోళ్ల శ్రీనివాస్‌తో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
తెలంగాణ ప్రజల అభిప్రాయంలో స్పష్టమైన మార్పు కనిపిస్తోందని, రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమనే విశ్వాసాన్ని హరీశ్‌రావు వ్యక్తం చేశారు. స్కామ్‌ల ప్రభుత్వానికి ప్రజలు విసిగిపోయారని, సంక్షేమ పాలనను తిరిగి కోరుకుంటున్నారని అన్నారు. పఠాన్‌చెరు బీఆర్ఎస్‌కు బలమైన కోట అని పేర్కొంటూ, గత మున్సిపల్ ఎన్నికల్లో ఐదు మున్సిపాలిటీల్లో ఐదు ఛైర్మన్ పదవులను పార్టీ గెలుచుకున్న విషయాన్ని గుర్తు చేశారు. ఈసారి కూడా పఠాన్‌చెరు ఫలితాలపైనే రాష్ట్రవ్యాప్తంగా అందరి దృష్టి ఉంటుందని వ్యాఖ్యానించారు.
రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేసిన హరీశ్‌రావు, వేల కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూములను కాంగ్రెస్ ప్రభుత్వం విక్రయించిందని ఆరోపించారు. బీఆర్ఎస్ హయాంలో అమలైన సంక్షేమ పథకాలను ప్రస్తుత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని, ముఖ్యంగా కల్యాణలక్ష్మి వంటి పథకాల అమలులో తీవ్ర జాప్యం నెలకొన్నదని అన్నారు. పేదల సంక్షేమానికి నిధులు లేవని చెబుతున్న ప్రభుత్వం, మూసీ సుందరీకరణ, ఇతర ప్రాజెక్టులు, అందాల పోటీలు, బోధి భవన్ వంటి కార్యక్రమాలకు మాత్రం భారీగా నిధులు వెచ్చిస్తోందని విమర్శించారు.
సిగాచి పరిశ్రమ ప్రమాదంలో మరణించిన కార్మికుల కుటుంబాలకు ప్రభుత్వం ఎలాంటి పరిహారం అందించలేదని, సంస్థ యాజమాన్యమే బాధితులకు ఆర్థిక సాయం చేసిందని ఆరోపించారు. పఠాన్‌చెరులో ఐటీ పార్కు కోసం గతంలో కేటాయించిన భూములను కాంగ్రెస్ ప్రభుత్వం విక్రయించిందని, బీఆర్ఎస్ హయాంలో నిరంతరాయంగా ఉన్న విద్యుత్ సరఫరా ప్రస్తుతం దెబ్బతిందని అన్నారు. కేసీఆర్ ప్రభుత్వం నిర్మించిన ఆస్పత్రిని ఇప్పటికీ ప్రారంభించకపోవడం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని విమర్శించారు.
రాబోయే ఎన్నికల్లో ఉమ్మడి మెదక్ జిల్లాలోని అన్ని అసెంబ్లీ స్థానాలను బీఆర్ఎస్ గెలుచుకుంటుందని హరీశ్‌రావు ధీమా వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కాంగ్రెస్ 117 స్థానాలు గెలుస్తుందని చెబుతున్నప్పటికీ, వాస్తవానికి ఆ పార్టీ తొమ్మిది స్థానాలకు మించి గెలవదని జోస్యం చెప్పారు. అదే సమయంలో పార్టీ బలోపేతానికి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేయడంతో పాటు ఓటరు జాబితాల సవరణ ప్రక్రియను ప్రతి నాయకుడు బాధ్యతగా తీసుకోవాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.








