Mahaa Daily Exclusive

  సాయికృష్ణ అదృశ్యం కేసు దర్యాప్తు వేగం….

Share

సాయికృష్ణ అదృశ్యం కేసు దర్యాప్తు వేగం.
• తల్లి విజయలక్ష్మి స్టేట్‌మెంట్ నమోదు చేసిన సిట్.
* ఆరోపణలపై కీలక వివరాల సేకరణ
విజయవాడ, మహా.
గాదె సాయికృష్ణ అదృశ్యం కేసు దర్యాప్తును ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) మరింత వేగవంతం చేసింది. కేసులో కీలక ఆధారాల సేకరణపై దృష్టి సారించిన సిట్ అధికారులు సోమవారం విజయవాడలోని సాయికృష్ణ నివాసానికి వెళ్లి ఆయన తల్లి విజయలక్ష్మి వాంగ్మూలాన్ని నమోదు చేశారు. కేసు పరిణామాలు, అదృశ్యానికి దారితీసిన పరిస్థితులు, ఆమె చేసిన ఆరోపణలపై సుదీర్ఘంగా వివరాలు సేకరించినట్లు సమాచారం.
దర్యాప్తులో భాగంగా సాయికృష్ణ అదృశ్యం, అనంతరం వెలుగులోకి వచ్చిన లాకప్ డెత్ ఆరోపణలకు సంబంధించిన అంశాలపై అధికారులు విజయలక్ష్మిని ప్రశ్నించారు. ఈ ఘటనకు దారితీసిన పరిస్థితులు, కుటుంబానికి తెలిసిన వివరాలు, ఇప్పటివరకు జరిగిన పరిణామాల గురించి ఆమె నుంచి సమాచారం తీసుకున్నారు.
ఇటీవల ఈ వ్యవహారంపై హైకోర్టును ఆశ్రయిస్తూ విజయలక్ష్మి దాఖలు చేసిన పిటిషన్‌లో ప్రస్తావించిన అంశాలపై కూడా సిట్ అధికారులు ఆరా తీశారు. కోర్టులో చేసిన ఆరోపణలు, వాటికి సంబంధించిన ఆధారాలు, కేసు దర్యాప్తుకు ఉపయోగపడే ఇతర వివరాలను సమగ్రంగా నమోదు చేసినట్లు తెలిసింది.
ఈ సందర్భంగా కృష్ణలంక పోలీస్ స్టేషన్‌కు చెందిన సీఐ నాగరాజుతో పాటు కృష్ణలంక పోలీసులపై విజయలక్ష్మి చేసిన ఆరోపణలపై కూడా అధికారులు వివరణ కోరారు. ఆ ఆరోపణలకు సంబంధించి తన వద్ద ఉన్న ఆధారాలు, సమాచారం అందించాలని సిట్ అధికారులు ఆమెను కోరినట్లు సమాచారం.
అదేవిధంగా ఈ కేసులో కృష్ణలంక పోలీసులతో పాటు టాస్క్‌ఫోర్స్ పోలీసుల ప్రమేయం ఉందని విజయలక్ష్మి చేసిన ఆరోపణలపైనా సిట్ ప్రత్యేకంగా వివరాలు సేకరించింది. తనకు తెలిసిన అన్ని విషయాలను అధికారుల ముందు వెల్లడించినట్లు సమాచారం.
సాక్ష్యాధారాల సేకరణ, వాంగ్మూలాల నమోదు ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో కేసులో భాగమైన ప్రతి అంశాన్ని క్షుణ్నంగా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. అవసరమైతే మరికొంతమందిని కూడా విచారించి, సేకరించిన ఆధారాల ఆధారంగా తదుపరి చర్యలు చేపట్టే దిశగా సిట్ దర్యాప్తును కొనసాగిస్తోంది.