రిజిస్ట్రేషన్ సేవల సులభతకే ఆర్‌ఎస్‌కేలు.
• ప్రైవేటీకరణ కాదని స్పష్టీకరణ.
• మధ్యవర్తుల ప్రమేయం తగ్గుతుందని వెల్లడి.
• సీఎం చంద్రబాబు
అమరావతి, మహా.
రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ సేవలను ప్రజలకు మరింత సులభంగా, పారదర్శకంగా అందించేందుకు ప్రభుత్వం రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాల (ఆర్‌ఎస్‌కే) ఏర్పాటుకు శ్రీకారం చుట్టిందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలను ప్రైవేటీకరిస్తున్నారంటూ జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని, ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.
సోమవారం ఆర్టీజీఎస్ కేంద్రంలో వివిధ శాఖల పనితీరుపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాల అంశంపై ముఖ్యమంత్రి ప్రత్యేకంగా చర్చించారు. ఈ సందర్భంగా ఆర్‌ఎస్‌కేల ఏర్పాటుపై కొందరు ఉద్దేశపూర్వకంగా తప్పుడు ప్రచారం చేస్తున్నారని, దీనిని అధికారులు ప్రజలకు స్పష్టంగా వివరించాలని ఆదేశించారు.
పాస్‌పోర్ట్ సేవా కేంద్రాల మాదిరిగానే రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలు పనిచేస్తాయని చంద్రబాబు తెలిపారు. పాస్‌పోర్ట్ సేవా కేంద్రాల ద్వారా సేవల ప్రక్రియ వేగవంతం అయినట్లే, ఆర్‌ఎస్‌కేల ద్వారా కూడా ప్రజలు రిజిస్ట్రేషన్ సేవలను మరింత సులభంగా పొందగలరని చెప్పారు. సేవల నాణ్యత పెరగడంతో పాటు ప్రజలు కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం తగ్గుతుందని, ప్రక్రియ మరింత పారదర్శకంగా మారుతుందని వివరించారు.
ఆర్‌ఎస్‌కేల ఏర్పాటుతో మధ్యవర్తుల ప్రమేయం గణనీయంగా తగ్గుతుందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ప్రజలకు నేరుగా, వేగవంతంగా సేవలు అందించడమే ఈ విధానం ప్రధాన ఉద్దేశమని చెప్పారు. దీనిని ప్రైవేటీకరణగా చిత్రీకరించడం సరికాదని, ప్రజల్లో అపోహలు కలిగించే ప్రయత్నాలను అధికారులు వాస్తవాలతో తిప్పికొట్టాలని సూచించారు.
రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాల వల్ల ప్రజలకు కలిగే ప్రయోజనాలను విస్తృతంగా వివరించాలని అధికారులను ఆదేశించిన ముఖ్యమంత్రి, డాక్యుమెంట్ రైటర్లు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు. వారి ఉపాధికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యామ్నాయ ఆదాయ అవకాశాలను ప్రభుత్వం కల్పిస్తుందని స్పష్టం చేశారు.
ప్రజలకు సులభమైన, పారదర్శకమైన, సాంకేతిక ఆధారిత సేవలను అందించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, ఆ దిశగా అన్ని శాఖల్లో సంస్కరణలు కొనసాగుతాయని సీఎం చంద్రబాబు నాయుడు వెల్లడించారు.








