Mahaa Daily Exclusive

  బాలింతల ఇన్ఫెక్షన్ ఘటనపై ఉన్నతస్థాయి విచారణ జరపాలి….

Share

బాలింతల ఇన్ఫెక్షన్ ఘటనపై ఉన్నతస్థాయి విచారణ జరపాలి.
* ఖమ్మం మైనర్ బాలికకు రూ.25 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలి.
* మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ టి. హరీశ్‌రావు.
హైదరాబాద్, మహా.
నిజామాబాద్ జిల్లా బాన్సువాడ మాతా–శిశు ఆసుపత్రిలో సిజేరియన్ అనంతరం పలువురు బాలింతలు తీవ్ర ఇన్ఫెక్షన్ బారినపడిన ఘటనపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ టి. హరీశ్‌రావు రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఘటన జరిగి పది రోజులు గడిచినా ప్రభుత్వం, వైద్య ఆరోగ్యశాఖ స్పందించకపోవడం నేరపూరిత నిర్లక్ష్యమని ఆరోపించారు. ఈ ఘటనపై తక్షణమే ఉన్నతస్థాయి విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు బాధిత కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలని డిమాండ్ చేశారు.

సోమవారం హైదరాబాద్‌లోని నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాన్సువాడకు చెందిన బాలింతలను, వారి కుటుంబ సభ్యులను హరీశ్‌రావు పరామర్శించారు. వైద్యులతో మాట్లాడి వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అలాగే ఖమ్మంలో అత్యాచారానికి గురై తీవ్ర గాయాలతో నిమ్స్‌లో చికిత్స పొందుతున్న మైనర్ బాలికను కూడా పరామర్శించి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.

అనంతరం మీడియాతో మాట్లాడిన హరీశ్‌రావు, ఈ నెల 13న బాన్సువాడ ఆసుపత్రిలో సిజేరియన్ చేయించుకున్న పది మంది మహిళలకు తీవ్ర ఇన్ఫెక్షన్ సోకిందని తెలిపారు. వారిలో ఐదుగురు ప్రస్తుతం నిమ్స్‌లో చికిత్స పొందుతున్నారని, ఫాతిమా, రుక్సానా, జ్యోతి, లక్ష్మీప్రియ, సునీత అనే బాలింతల్లో ముగ్గురి పరిస్థితి అత్యంత విషమంగా ఉందన్నారు. తెల్ల రక్తకణాలు తగ్గిపోవడం, కిడ్నీలు, ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ వ్యాపించడంతో ఐసీయూలో డయాలసిస్‌పై చికిత్స అందిస్తున్నారని వివరించారు.

ఇంతటి దుర్ఘటన జరిగినప్పటికీ ప్రభుత్వం నుంచి కనీస స్పందన కూడా రాకపోవడం బాధాకరమని హరీశ్‌రావు విమర్శించారు. ఏ మంత్రి, ఎమ్మెల్యే, ఉన్నతాధికారి బాధితులను పరామర్శించలేదని, ఘటనకు గల కారణాలపై సమగ్ర విచారణకు కూడా ఆదేశాలు ఇవ్వలేదని ఆరోపించారు. ఇది ప్రభుత్వ వైద్య వ్యవస్థ వైఫల్యానికి నిదర్శనమని అన్నారు.

ఆపరేషన్ థియేటర్ నిర్వహణలో నిర్లక్ష్యం, పరిశుభ్రత లోపాలు, కాలం చెల్లిన మందుల వినియోగం వంటి కారణాల వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని బాధిత కుటుంబాలు చెబుతున్నాయని హరీశ్‌రావు పేర్కొన్నారు. ఆరుగురికి సిజేరియన్ చేసిన తర్వాత ఇన్ఫెక్షన్ సోకిందని తెలిసినా, మరుసటి రోజే అదే ఆపరేషన్ థియేటర్‌లో మరో నలుగురికి శస్త్రచికిత్సలు నిర్వహించడం తీవ్ర నిర్లక్ష్యమని విమర్శించారు. రాత్రి నుంచే వాంతులు, విరేచనాలు, జ్వరంతో బాధపడుతున్న రోగులను చూసినప్పటికీ అవసరమైన జాగ్రత్తలు తీసుకోలేదని ఆరోపించారు.

ఈ ఘటనను ప్రభుత్వం ఎందుకు గోప్యంగా ఉంచేందుకు ప్రయత్నిస్తోందని ప్రశ్నించిన హరీశ్‌రావు, పూర్తి స్థాయి విచారణ జరిపి సంబంధిత వైద్యులు, సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బాధిత కుటుంబాలు ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స కోసం లక్షల రూపాయలు ఖర్చు చేస్తున్నాయని, కొందరు బంగారం అమ్ముకొని, అధిక వడ్డీకి అప్పులు తెచ్చి వైద్యం చేయిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

తల్లులకు సోకిన ఇన్ఫెక్షన్ పాల ద్వారా నవజాత శిశువులకు కూడా వ్యాపించిందని, ఆ శిశువులు ప్రస్తుతం నీలోఫర్ ఆసుపత్రిలో జాండిస్ తదితర సమస్యలతో చికిత్స పొందుతున్నారని హరీశ్‌రావు పేర్కొన్నారు. ఈ పరిస్థితి అత్యంత హృదయవిదారకమని, ప్రభుత్వ ఆసుపత్రులపై ప్రజల విశ్వాసం దెబ్బతింటోందని అన్నారు.

బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో గర్భిణులకు న్యూట్రిషన్ కిట్, ప్రసవానంతరం కేసీఆర్ కిట్, ఆరోగ్యలక్ష్మి పథకం ద్వారా పౌష్టికాహారం అందించామని గుర్తుచేశారు. తమ హయాంలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాల శాతం 72 శాతానికి పెరిగిందని, ప్రస్తుతం అది మళ్లీ 50 శాతానికి పడిపోయిందని పేర్కొన్నారు. సిజేరియన్ ప్రసవాలు విపరీతంగా పెరిగాయని, ఆసుపత్రుల పర్యవేక్షణలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు.

మాతృ మరణాల రేటును తమ ప్రభుత్వ హయాంలో గణనీయంగా తగ్గించి దేశంలో తెలంగాణను ముందంజలో నిలిపామని హరీశ్‌రావు తెలిపారు. ప్రస్తుతం ప్రభుత్వ ఆసుపత్రుల్లో మందుల కొరత, పర్యవేక్షణ లేకపోవడం వల్ల ప్రజల విశ్వాసం సన్నగిల్లుతోందన్నారు. బాన్సువాడ ఘటనపై ఇప్పటికే విచారణ ఆదేశించి ఉంటే ఆ నివేదికను ప్రజల ముందుంచాలని, బాధ్యుల పేర్లు వెల్లడించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ఖమ్మంలో మైనర్ బాలికపై జరిగిన అత్యాచార ఘటనపైనా హరీశ్‌రావు స్పందించారు. బీఆర్ఎస్ స్పందించిన తర్వాతే మంత్రులు బాధితురాలిని పరామర్శించారని ఆరోపించారు. ప్రస్తుతం ఆ బాలిక నడుము కింది భాగం పనిచేయని పరిస్థితిలో ఉందని, జీవితాంతం వీల్‌చైర్‌కే పరిమితం కావాల్సి వస్తుందని వైద్యులు చెబుతున్నారని పేర్కొన్నారు. ఎనిమిదో తరగతి చదువుతున్న ఆ చిన్నారి భవిష్యత్తు దృష్ట్యా ప్రభుత్వం కనీసం రూ.25 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించి కుటుంబానికి అండగా నిలవాలని డిమాండ్ చేశారు.

ఏదైనా దుర్ఘటన జరిగినప్పుడు ప్రభుత్వం వెంటనే స్పందించి, విచారణ జరిపి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటేనే ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉంటాయని హరీశ్‌రావు అన్నారు. బాధిత బాలింతలకు, మైనర్ బాలికకు పూర్తి స్థాయి వైద్యం అందించి, తగిన ఆర్థిక సాయం అందించడం ప్రభుత్వ బాధ్యత అని స్పష్టం చేశారు.