Mahaa Daily Exclusive

  మేం సోదరులం మాత్రమే, ఒకే కుటుంబం కాదు..

Share

  • మేం సోదరులం మాత్రమే, ఒకే కుటుంబం కాదు
  • కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై రాజగోపాల్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
  • మరోసారి మంత్రి పదవిపై తన అసంతృప్తిని వ్యక్తం చేిన రాజగోపాల్ రెడ్డి

హైదరాబాద్, మహా : కాంగ్రెస్ సీనియర్ నేత, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవిపై మరోసారి బహిరంగంగా తీవ్ర వ్యాఖ్యలు వ్యక్తం చేశారు. మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డితో తన సంబంధంపై వస్తున్న ప్రచారానికి స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. తాము ఇద్దరం సోదరులమే కానీ ఒకే కుటుంబానికి చెందినవాళ్లం కాదని తేల్చి చెప్పారు. మంత్రి పదవి విషయంలో తనను కోమటిరెడ్డి వెంకట్ రెడ్డితో ముడిపెట్టడం ఎందుకని ప్రశ్నించిన రాజగోపాల్ రెడ్డి.. తాము అన్నదమ్ములం మాత్రమేనని.. తమ కుటుంబాలు వేరు అని స్పష్టం చేశారు. మంత్రి పదవి విషయంలో వెంకట్ రెడ్డితో తనకేం సంబంధం లేదని వ్యాఖ్యానించారు.

తనకు పదవులు అడుక్కోవడం తెలియదని పేర్కొన్న రాజగోపాల్ రెడ్డి.. తనకు పోరాడటమే తెలుసని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గతంలో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఉప ఎన్నికలకు వెళ్లినప్పుడు తన నియోజకవర్గానికి వందలాది మంది నేతలు ప్రచారానికి వచ్చారని గుర్తు చేశారు. తన రాజకీయ బలం అందరికీ తెలుసని పేర్కొన్నారు. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీలో చేరితే మంత్రి పదవి ఇస్తామని కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం హామీ ఇచ్చిందని, అయితే రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆ హామీ అమలు కాలేదని మరోసారి ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ హైకమాండ్ హామీ ఇచ్చిన పలువురికి కేబినెట్‌లో మంత్రి పదవులు దక్కాయని, కానీ తనకు మాత్రం అవకాశం రాలేదని రాజగోపాల్ రెడ్డి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఇక గతంలో కూడా మంత్రి పదవి విషయంలో పలుమార్లు అసంతృప్తి వ్యక్తం చేసిన రాజగోపాల్ రెడ్డి.. ఈ అంశంపై పార్టీ అధిష్ఠానాన్ని కూడా సంప్రదించిన విషయం తెలిసిందే. ఒకే కుటుంబంలో ఇద్దరికి మంత్రి పదవులు ఇవ్వకూడదనే కారణంతో తనకు అవకాశం దక్కలేదనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో.. తాజాగా తమ కుటుంబాలు వేర్వేరు అంటూ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీ రాజకీయాల్లో కొత్త చర్చకు దారి తీశాయి. ఇటీవల కూడా పార్టీ నిర్ణయాలు, మంత్రి పదవుల కేటాయింపుపై తన అభిప్రాయాన్ని బహిరంగంగానే వ్యక్తం చేస్తున్న రాజగోపాల్ రెడ్డి తాజా వ్యాఖ్యలు తెలంగాణ కాంగ్రెస్‌లో మరోసారి చర్చనీయాంశంగా మారాయి.