Mahaa Daily Exclusive

  ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కోరని బీఆర్‌ఎస్ ఎందుకు?.

Share

ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కోరని బీఆర్‌ఎస్ ఎందుకు?.
* కేటీఆర్ క్షమాపణ చెప్పాలి: సీఎం రేవంత్ రెడ్డి.
* గ్లోబరీనా, కాళేశ్వరం, ఇంటర్ విద్యార్థుల మరణాలపై బీఆర్‌ఎస్‌ను నిలదీసిన సీఎం.
* ఓటరు ప్రక్షాళన, ఉద్యోగాలు, ధర్నాచౌక్‌పై విస్తృత వ్యాఖ్యలు.

హైదరాబాద్, మహా.

బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతి, వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే ఆ పార్టీ నాయకులు నిరాధార ఆరోపణలు చేస్తున్నారని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శించారు. నీట్ పేపర్ లీకేజీ వ్యవహారంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాను బీఆర్‌ఎస్ ఎందుకు డిమాండ్ చేయడం లేదని ప్రశ్నించిన సీఎం, తమ హయాంలో ఇంటర్ మూల్యాంకన లోపాల కారణంగా 27 మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోయిన ఘటనపై కేటీఆర్ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. గురువారం మీడియాతో నిర్వహించిన ఇష్టాగోష్టిలో సీఎం బీఆర్‌ఎస్‌పై ఘాటు విమర్శలు గుప్పిస్తూ పలు రాజకీయ అంశాలపై స్పందించారు.

గ్లోబరీనా సంస్థ వ్యవహారాన్ని ప్రస్తావించిన రేవంత్ రెడ్డి, ఆ సంస్థ కేటీఆర్ బినామీ కంపెనీ కాదని నిరూపించుకోవాల్సిన బాధ్యత ఆయనపై ఉందన్నారు. పరువు ఉన్నవాడే పరువు నష్టం దావా వేస్తాడని వ్యాఖ్యానిస్తూ, గ్లోబరీనా వ్యవహారంలో నిజాలు ప్రజలకు చెప్పాలని సవాల్ విసిరారు. జన్వాడ ఫామ్‌హౌస్‌లో ఉన్న భూములు ఎవరివో కూడా కేటీఆర్ ప్రజలకు వివరించాలని అన్నారు.

కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో నాణ్యతను పూర్తిగా విస్మరించి వందల కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డారని బీఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని సీఎం ఆరోపించారు. ఈ కారణంగానే హరీశ్‌రావును కేసీఆర్ మంత్రివర్గం నుంచి పక్కన పెట్టారని వ్యాఖ్యానించారు. పదేళ్ల పాలనలో రాష్ట్రాన్ని దోచుకున్నవారే ఇప్పుడు త్యాగాల గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. రక్తదానం చేశామని చెప్పుకునే నాయకులు ఆ రక్తాన్ని ఎవరికి అమ్ముకున్నారో చెప్పాలని ఎద్దేవా చేశారు.

బీఆర్‌ఎస్ ప్రభుత్వం పేదలకు ఇవ్వాల్సిన ఇళ్లను దళారులకు అమ్ముకుందని ఆరోపించిన సీఎం, ఉద్యోగాల విషయంలో కూడా ఆ పార్టీ నిరాధార విమర్శలు చేస్తోందన్నారు. అసెంబ్లీలో ప్రభుత్వ నియామకాలపై ప్రశ్నించాలని, పేర్లతో సహా పూర్తి జాబితాను సభ ముందు ఉంచేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. రాష్ట్ర చరిత్రలోనే అత్యంత వేగంగా కేవలం 55 రోజుల్లో 11 వేల ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేశామని తెలిపారు. నోటిఫికేషన్లు ఇచ్చి పేపర్లు లీక్ చేసి దానిని ఆదాయ మార్గంగా మార్చుకోవడం గత ప్రభుత్వాల పని అని పరోక్షంగా బీఆర్‌ఎస్‌ను విమర్శించారు.

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజాస్వామ్య హక్కులను పునరుద్ధరిస్తూ ధర్నాచౌక్‌ను తిరిగి ప్రారంభించామని సీఎం గుర్తుచేశారు. గతంలో మూసివేసిన ధర్నాచౌక్‌ను తెరిచింది కాంగ్రెస్ ప్రభుత్వమేనని, ఇప్పుడు అదే ధర్నాచౌక్‌లో కేటీఆర్ ధర్నా చేస్తానని చెప్పడం రాజకీయ విరుద్ధతకు నిదర్శనమని ఎద్దేవా చేశారు. రాష్ట్ర బీజేపీలో కూడా అంతర్గత విభేదాలు తీవ్రస్థాయిలో ఉన్నాయని వ్యాఖ్యానించారు.

ఓటరు జాబితా ప్రత్యేక సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియపై స్పందించిన రేవంత్ రెడ్డి, రాష్ట్రంలో ప్రస్తుతం 70 శాతం ప్రక్రియ పూర్తయిందని, మిగిలిన 30 శాతం కూడా త్వరగా పూర్తి చేయాలని కాంగ్రెస్ నాయకులకు సూచించినట్లు తెలిపారు. ఓటు హక్కు ప్రజాస్వామ్యానికి మూలస్తంభమని, ఓట్లు లేకుంటే ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఎలా అందుతాయని ప్రశ్నించారు. చిన్న చిన్న సాంకేతిక లోపాలను ఓటరు తొలగింపుగా చిత్రీకరించడం సరికాదన్నారు. తనకు రెండు ఓట్లు ఉన్నాయని ఎవరైనా నిరూపిస్తే ఫిర్యాదు చేయాలని, తప్పుడు ఆరోపణలు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

గతంలో జీహెచ్‌ఎంసీ పరిధిలో వేలాది మంది ఆంధ్ర ప్రాంత ప్రజల ఓట్లు తొలగించారని, అప్పట్లో కాంగ్రెస్ కోర్టును ఆశ్రయించడంతో నాటి జీహెచ్‌ఎంసీ కమిషనర్‌పై న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసిందని గుర్తుచేశారు. తన ఓటును చట్టబద్ధంగా బదిలీ చేయించుకున్నానని, దాని కోసం కలెక్టర్‌కు దరఖాస్తు సమర్పించినట్లు చెప్పారు. ఒకప్పుడు కొడంగల్ కర్ణాటకలో భాగంగా ఉండేదని, భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుతో తెలంగాణలో కలిసిందని వివరించారు. బీఎల్‌వోలకు అనుసంధానంగా బీఎల్‌ఏలను నియమించి అర్హులైన ఓటర్ల పేర్లు తొలగిపోకుండా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.

రాష్ట్రంలో హైడ్రా సమర్థంగా పనిచేస్తోందని, అక్రమ నిర్మాణాలు, ఆక్రమిత ఆస్తుల స్వాధీన ప్రక్రియ కొనసాగుతోందన్నారు. తెలంగాణలో లక్ష కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టే సంస్థల పేర్లను రాష్ట్ర రహదారులకు పెట్టేందుకు కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. ఆహార కల్తీపై ప్రభుత్వం అత్యంత కఠినంగా వ్యవహరిస్తోందని పేర్కొన్నారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నికల సందర్భంగా కేటీఆర్ 50 వేల మెజార్టీతో గెలుస్తామని చెప్పగా, కాంగ్రెస్ 30 వేల మెజార్టీతో విజయం సాధిస్తుందని తాను అప్పుడే చెప్పిన విషయాన్ని గుర్తుచేశారు.

అంతకుముందు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చారిత్రక ప్రాధాన్యం కలిగిన తెలంగాణ శాసనసభ భవనంలో జరుగుతున్న మరమ్మతులు, పునరుద్ధరణ పనులను పరిశీలించారు. శాసనసభ ప్రాంగణాన్ని సందర్శించి పనుల పురోగతిపై అధికారుల నుంచి వివరాలు తెలుసుకుని పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మంత్రి అడ్లూరి లక్ష్మణ్, ప్రభుత్వ విప్‌లు ఆది శ్రీనివాస్, అద్దంకి దయాకర్, బల్మూర్ వెంకట్, ఎమ్మెల్యేలు కవ్వంపల్లి సత్యనారాయణ, జైవీర్ రెడ్డి, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.