(పి.వి.బాబ్జి, జియో పొలిటికల్ అనలిస్ట్)
ప్రస్తుతం దేశ రాజధానిలోనూ, పార్లమెంట్ వీధుల్లోనూ విద్యార్థుల పేరిట జరుగుతున్న ఆందోళనలను చూసి, ఇది కేవలం పరీక్షా పత్రాల లీకేజీ వల్ల విద్యార్థుల్లో రగిలిన సహజమైన ఆగ్రహం అని మీరు అనుకుంటే… ఆ భ్రమల్లోంచి ముందుగా బయటకు రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే, పైకి కనిపిస్తున్న ఈ నిరసనల ముసుగు వెనుక అంతర్జాతీయ శక్తులు, దేశీయ రాజకీయ నాయకుల స్వార్థం కలగలిసిన ఒక పక్కా ఆర్గనైజ్డ్ కుట్ర దాగి ఉంది. ఈ కథను కేవలం ఢిల్లీ వీధుల్లో వెతికితే దొరకదు, భౌగోళిక రాజకీయాల చదరంగంలో వెతకాలి. ప్రపంచ దేశాల మధ్య మారుతున్న సమీకరణాలు, ముఖ్యంగా అమెరికా, చైనాలకు భారత ఎదుగుదల కంటగింపుగా మారిన వైనం అర్థం చేసుకుంటేనే ఈ నాటకంలోని సూత్రధారులెవరో మనకు స్పష్టమవుతుంది. ఈరోజు ప్రపంచం ‘చైనా ప్లస్ వన్’ అనే విధానం వైపు వేగంగా అడుగులు వేస్తోంది. ఒకప్పుడు చైనాపైనే ఆధారపడిన యూరోపియన్ దేశాలు ఇప్పుడు ప్రత్యామ్నాయంగా భారత్ వైపు చూస్తూ ఒప్పందాలు చేసుకుంటున్నాయి. మరోవైపు అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ అనుసరిస్తున్న ఆధిపత్య ధోరణి వల్ల, ఒకప్పటి వారి మిత్ర దేశాలైన ‘ఫైవ్ ఐస్’ (అమెరికా, యూకే, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, కెనడా) దేశాల నాయకులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఈ ఆంగ్లో-సాక్సన్ దేశాలు సైతం అమెరికాకు దూరంగా జరుగుతూ భారత్ తో మైత్రికి ఉవ్విళ్లూరుతున్నాయి. మొన్నటికి మొన్న ప్రధాని నరేంద్ర మోదీ ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ పర్యటనలు విజయవంతంగా ముగించుకురావడం దీనికి ప్రత్యక్ష నిదర్శనం. భారత్ కు పెరుగుతున్న ఈ ఆదరణ ఒక ఎత్తైతే, సముద్ర మార్గాలపై భారత్ సాధిస్తున్న పట్టు చైనాకు ముచ్చెమటలు పట్టిస్తోంది. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో, సౌత్ చైనా సీ లో ఆధిపత్యం చెలాయించాలనుకుంటున్న చైనాకు భారత్ ఒక సింహస్వప్నంలా మారింది. ఫిలిప్పీన్స్, వియత్నాం వంటి దేశాలకు ఆయుధాలు సరఫరా చేయడం, ఇండోనేషియాతో ఒప్పందం కుదుర్చుకుని సబాంగ్ పోర్టును మన చేతుల్లోకి తీసుకోవడం మోదీజీ ప్రభుత్వ వ్యూహాత్మక విజయాలు. అయితే చైనాను అత్యంత కలవరపెడుతున్న అసలు బ్రహ్మాస్త్రం ఏంటంటే, 81 వేల కోట్ల రూపాయలతో భారత ప్రభుత్వం చేపట్టిన ‘గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్’. ఈ ప్రాజెక్టు కింద అంతర్జాతీయ స్థాయిలో ఒక కంటైనర్ ట్రాన్స్ షిప్మెంట్ టెర్మినల్ రాబోతోంది. ఏషియాన్, పసిఫిక్ దేశాలకు వెళ్లే నౌకలు ఇకపై సింగపూర్ లో కాకుండా మన నికోబార్ లోనే ఆగేలా, తద్వారా భారీ రెవెన్యూను మన దేశానికి రప్పించేలా ఈ ప్రాజెక్టును డిజైన్ చేశారు. దీనికి తోడు ఒక గ్రీన్ ఫీల్డ్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్, కీలకమైన డిఫెన్స్ ప్రాజెక్టులు కూడా ఇక్కడ ఏర్పాటు కాబోతున్నాయి. వ్యూహాత్మకంగా చూస్తే, మన చేతిలో ఉన్న ఇందిరా పాయింట్, మరియు సబాంగ్ పోర్ట్ రెండూ కలిస్తే… చైనా వాణిజ్యానికి అత్యంత కీలకమైన మలక్కా జలసంధిని ఏ క్షణంలోనైనా దిగ్బంధించే (చోక్ చేసే) సత్తా భారత్ కు సొంతం అవుతుంది. ఇది చైనాకు ఒక డైరెక్ట్ వార్నింగ్, తీవ్రమైన ముప్పు. అందుకే ఈ నికోబార్ ప్రాజెక్టును ఎలాగైనా అడ్డుకోవాలని చైనా, అమెరికా డీప్ స్టేట్ శక్తులు బలంగా నిర్ణయించుకున్నాయి.
సరిగ్గా ఇక్కడే విదేశీ శక్తులతో మన దేశీయ ప్రతిపక్షాలు ఎలా చేతులు కలిపాయో డాట్స్ కనెక్ట్ చేస్తే మనకు ఒక స్పష్టమైన చిత్రం కనిపిస్తుంది. 2025 సెప్టెంబర్ నెలలో కాంగ్రెస్ అగ్రనాయకురాలు సోనియా గాంధీ గారు ‘ది హిందూ’ పత్రికలో ఒక ఆర్టికల్ రాశారు. ఆ ఆర్టికల్ సారాంశం ఏంటంటే, నికోబార్ ప్రాజెక్ట్ వల్ల పర్యావరణానికి తీవ్ర విఘాతం కలుగుతోందని, అదొక ఎకలాజికల్ డిజాస్టర్ అని ఆమె పేర్కొన్నారు. చైనా ప్రకటనలతో తరచుగా నిధులు పొందే పత్రికలో ఆమె ఈ వ్యాసం రాయడం యాదృచ్ఛికం కానేకాదు. సరిగ్గా అదే సెప్టెంబర్ నెలలో కమ్యూనిస్ట్ పార్టీ (సీపీఎం) కి చెందిన ఒక భారీ బృందం వారం రోజుల పాటు చైనాలో పర్యటించింది. సీపీఎం జనరల్ సెక్రటరీ ఎం.ఏ బేబీ, పొలిట్ బ్యూరో సభ్యులు మహమ్మద్ సలీం, జితేంద్ర చౌదరి, ఆర్. అరుణ్ కుమార్, సెంట్రల్ కమిటీ సభ్యులు కె.హేమలత, సీజే సుజాత తదితరులు ఈ బృందంలో ఉన్నారు. వాళ్ళు అక్కడికి వెళ్లి చైనా అభివృద్ధిని కొనియాడి, బహుశా నిధులు సమీకరించుకుని, ఇక్కడికొచ్చి భారత ప్రభుత్వ ప్రాజెక్టులను ఆపడానికి పావులు కదపడం మొదలుపెట్టారు. ఆ తర్వాత 2026 మే 18వ తేదీన రాహుల్ గాంధీ నేరుగా నికోబార్ వెళ్లి స్కూబా డైవింగ్ చేస్తూ, నికోబార్ ప్రాజెక్టును ఒక ‘అత్యంత ఘోరమైన నేరం’ (గ్రేవెస్ట్ క్రైమ్) గా అభివర్ణిస్తూ పీఆర్ స్టంట్లు చేయడం ఈ కుట్రలో మరో అంకం.
ఇక నీట్ పరీక్షల చుట్టూ అల్లిన ఆందోళనల కథకు వస్తే, మే 3వ తేదీన పేపర్ లీక్ అయితే జూన్ 21న ప్రభుత్వం రీ-టెస్ట్ నిర్వహించింది. కానీ దీన్ని వాడుకుని దేశంలో అశాంతి సృష్టించాలని భావించిన రాహుల్ గాంధీ, జూన్ 17న రాజస్థాన్ లో ‘ఛాత్రోం కీ గూంజ్’ అనే పేరుతో విద్యార్థుల ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. ఆ తర్వాత జూలై 10న ప్రయాగరాజ్, 11న పాట్నా, 14న ఢిల్లీలో భారీ సభలు జరగాల్సి ఉంది. కానీ ‘ది ప్రింట్’ కథనం ప్రకారం రాహుల్ గాంధీ అనుకోకుండా సడన్ గా ఒక విదేశీ పర్యటనకు వెళ్ళిపోయి, ఆ టూర్ ను పొడిగించుకోవడంతో ఈ కార్యక్రమాలన్నీ అర్ధాంతరంగా ఆగిపోయాయి. మళ్ళీ కరెక్ట్ గా జూలై 21న పార్లమెంట్ సమావేశాలు మొదలయ్యే రెండు రోజుల ముందు విదేశాల నుంచి ల్యాండ్ అయ్యి, సమావేశాల మొదటి రోజే ప్రధానమంత్రి నివాసం ముందు ధర్నా పేరిట పెద్ద డ్రామా రక్తి కట్టించారు. ప్రధాని జవాబుదారీతనం వహించాలని, విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని గగ్గోలు పెట్టారు. ఎవరికీ చెప్పకుండా విదేశాలకు వెళ్లడం, ఇష్టం వచ్చినప్పుడు వచ్చి ఉద్యమాలు చేయడం, బాధ్యత లేకుండా వ్యవహరించడం ఆయనకు మాత్రమే చెల్లిన విద్య.
రాహుల్ గాంధీ వ్యవహారం ఇలా ఉంటే, కమ్యూనిస్టులు ఇంకో అడుగు ముందుకేశారు. పార్లమెంట్ సమావేశాలు జరగడానికి సరిగ్గా పది రోజుల ముందు అంటే జూలై 10వ తేదీన సీపీఎం నేత ఎం.ఏ బేబీ, సీపీఐ నేత డి. రాజా, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ జనరల్ సెక్రటరీ జి. దేవరాజన్, సీపీఐ(ఎంఎల్) సెంట్రల్ కమిటీ మెంబర్ రాజీవ్ దిమ్రి… వీరంతా ఢిల్లీలోని చైనా అంబాసిడర్ షూ ఫెయ్ హాంగ్ తో రహస్యంగా సమావేశమయ్యారు. వాళ్ళు అలా కలిసి వచ్చిన వెంటనే సీన్ కట్ చేస్తే, పార్లమెంట్ లోపల ఒకవైపు బిల్లులను అడ్డుకుంటూనే, బయట జంతర్ మంతర్ వద్ద డి. రాజా, ఎం.ఏ బేబీ లాంటి వాళ్ళు విద్యార్థి సంఘాలైన ఏఐఎస్ఏ, ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్ లను ఉసిగొల్పి భారీ నిరసనలకు దిగారు. చైనా రాయబారిని కలవడం, చైనా పర్యటనలు చేయడం, తిరిగి వచ్చి దేశంలో విధ్వంసకర ఉద్యమాలు లేవనెత్తడం చూస్తుంటే ఇదంతా ఒకే స్క్రిప్ట్ లో భాగమని ఇట్టే అర్థమవుతుంది. చైనా ప్రయోజనాల కోసం స్వదేశీ ప్రాజెక్టులను అడ్డుకునే వీళ్ళకేమో రాజ్యాంగం, ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉన్నట్టు కనిపిస్తుండటం విడ్డూరం. ఇదంతా కేవలం మోదీ ప్రభుత్వం చేపడుతున్న గ్రేట్ నికోబార్ ప్రాజెక్టును నిలవరించడానికి, అంతర్జాతీయంగా భారత్ ఎదుగుదలను అడ్డుకోవడానికి చైనా, అమెరికా డీప్ స్టేట్ శక్తులు ప్రతిపక్షాలతో కలిసి ఆడుతున్న ఒక ఆర్గనైజ్డ్ డ్రామా. అమాయకులైన విద్యార్థులు వారి న్యాయమైన ఆందోళనలను ఈ రాజకీయ రాబందులు ఎలా తమ స్వార్థం కోసం వాడుకుంటున్నారో గ్రహించి, ఈ దేశ అభివృద్ధిని అడ్డుకునే ఇటువంటి కుట్రల పట్ల తస్మాత్ జాగ్రత్తగా ఉండాల్సిన సమయం ఆసన్నమైంది.








