Mahaa Daily Exclusive

  మణిపుర్ కేసులకు ప్రత్యేక కోర్టులు…..

Share

మణిపుర్ కేసులకు ప్రత్యేక కోర్టులు.
* విచారణ వేగవంతం చేయాలని సుప్రీం ఆదేశం.
ఢిల్లీ , మహా.
2023లో మణిపుర్‌లో జరిగిన జాతి ఘర్షణలకు సంబంధించిన క్రిమినల్ కేసుల విచారణను వేగవంతం చేసేందుకు సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసుల రోజువారీ విచారణ కోసం ప్రత్యేక కోర్టులను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించిన ధర్మాసనం, పెండింగ్‌లో ఉన్న దర్యాప్తులను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని సీబీఐ, రాష్ట్ర ప్రత్యేక దర్యాప్తు బృందం (ఎస్‌ఐటీ)ని ఆదేశించింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్‌మల్యా బాగ్చీ, జస్టిస్ వీ. మోహన్‌లతో కూడిన ధర్మాసనం మణిపుర్ హింసకు సంబంధించిన పిటిషన్ల విచారణ సందర్భంగా ఈ ఆదేశాలు జారీ చేసింది.

మణిపుర్ హింస కేసుల్లో పలువురు బాధితులు, వారి కుటుంబ సభ్యులకు ఇప్పటికీ చార్జ్‌షీట్ల ప్రతులు అందలేదన్న అంశాన్ని సుప్రీంకోర్టు తీవ్రంగా పరిగణించింది. బాధితుల తరఫున ఉచిత న్యాయసహాయం అందిస్తున్న న్యాయవాదులు సంబంధిత హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తుల కార్యాలయాలను సంప్రదిస్తే, వారంలోగా చార్జ్‌షీట్ల ప్రతులు అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. గతంలో కోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ ఇద్దరు మృతుల కుటుంబాలకు ఇప్పటికీ చార్జ్‌షీట్లు అందలేదని సీనియర్ న్యాయవాది వృందా గ్రోవర్ ధర్మాసనం దృష్టికి తీసుకురాగా, దీనిపై కేంద్రం స్పందిస్తూ చార్జ్‌షీట్లు సున్నితమైన క్రిమినల్ పత్రాలని, బాధితులు లేదా వారి న్యాయవాదులకు మాత్రమే అందజేస్తామని వివరించింది.

దర్యాప్తు సంస్థలకు మణిపుర్ ప్రభుత్వం పూర్తి స్థాయిలో సహకరించాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. సీబీఐ, రాష్ట్ర ఎస్‌ఐటీతో పాటు మాజీ మహారాష్ట్ర డీజీపీ దత్తాత్రేయ పడ్సల్గికర్ నేతృత్వంలోని కోర్టు నియమించిన పర్యవేక్షణ కమిటీ తాజా స్థితిగతుల నివేదికలను సమర్పించాలని ఆదేశించింది. పెండింగ్‌లో ఉన్న ఎఫ్‌ఐఆర్‌లు, చార్జ్‌షీట్లు దాఖలైన కేసుల పూర్తి వివరాలను సేకరించాలని అదనపు సొలిసిటర్ జనరల్ ఐశ్వర్య భాటికి సూచించింది. మొత్తం కేసుల సంఖ్య ఆధారంగా అవసరమైన ప్రత్యేక కోర్టుల సంఖ్యను నిర్ణయించనున్నట్లు ధర్మాసనం తెలిపింది. జాతి ఘర్షణల సమయంలో అదృశ్యమైన 30 మందికి సంబంధించిన కేసులను మణిపుర్ హైకోర్టు ప్రత్యేకంగా పరిశీలించాలని కూడా ఆదేశించింది.

సీబీఐ సమర్పించిన నివేదిక ప్రకారం ఇప్పటివరకు 21 కేసుల్లో చార్జ్‌షీట్లు దాఖలు చేయగా, మరో 11 కేసుల్లో దర్యాప్తు కొనసాగుతోంది. మూడు కేసుల్లో క్లోజర్ రిపోర్టులకు కోర్టు ఆమోదం లభించగా, మరో నాలుగు కేసులు ఇంకా దర్యాప్తులో ఉన్నాయి. రాష్ట్ర ఎస్‌ఐటీ ఎనిమిది జిల్లాల్లో నమోదైన 3,020 కేసులను విచారిస్తోంది. వీటిలో 301 కేసుల్లో చార్జ్‌షీట్లు దాఖలు కాగా, 10 కేసుల్లో విచారణ ప్రారంభమైంది. ఈ కేసుల్లో సుమారు 2,924 మంది సాక్షులను గుర్తించినట్లు ధర్మాసనం వెల్లడించింది.

హింస కారణంగా అనేక మంది సాక్షులు నిరాశ్రయులవడం, పరస్పర అవిశ్వాసం వల్ల సహకారం తగ్గడం, భాషాపరమైన ఇబ్బందులు, ఇంటర్నెట్ సేవలు దీర్ఘకాలం నిలిచిపోవడంతో డిజిటల్ ఆధారాల సేకరణ కష్టంగా మారిందని సీబీఐ కోర్టుకు వివరించింది. అయినప్పటికీ ఈ సవాళ్లను అధిగమించి పెండింగ్‌లో ఉన్న అన్ని దర్యాప్తులను సహేతుకమైన గడువులో పూర్తి చేయాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

2023 మే 3న మైతేయి వర్గానికి షెడ్యూల్డ్ ట్రైబ్ హోదా కల్పించాలన్న డిమాండ్‌కు వ్యతిరేకంగా నిర్వహించిన ‘ట్రైబల్ సాలిడారిటీ మార్చ్’ అనంతరం మణిపుర్‌లో జాతి ఘర్షణలు చెలరేగాయి. ఆ హింసలో 200 మందికిపైగా ప్రాణాలు కోల్పోగా, వందలాది మంది గాయపడ్డారు. వేలాది మంది నిరాశ్రయులయ్యారు. ఈ ఘటనలకు సంబంధించిన కేసుల విచారణను వేగవంతం చేసి బాధితులకు న్యాయం అందించేందుకు ప్రత్యేక కోర్టుల ఏర్పాటుతో పాటు దర్యాప్తును వేగవంతం చేయాలని సుప్రీంకోర్టు తాజా ఆదేశాలు జారీ చేసింది.