స్టాక్ మార్కెట్లలో భారీ పతనం….యుద్ధం.. సుంకాల ఎఫెక్ట్
ముంబై, మహా .
అంతర్జాతీయ ఉద్రిక్తతలు, ముడిచమురు ధరల పెరుగుదల, అమెరికా ప్రకటించిన కొత్త దిగుమతి సుంకాల ప్రభావంతో దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. అమెరికా–ఇరాన్ ఉద్రిక్తతలతో పాటు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పలు దేశాలపై కొత్త సుంకాలు ప్రకటించడం ఇన్వెస్టర్లలో ఆందోళనను పెంచింది. దీంతో ఉదయం ట్రేడింగ్ ప్రారంభం నుంచే సెన్సెక్స్, నిఫ్టీ భారీ నష్టాల్లో కొనసాగాయి.
ఉదయం 10.03 గంటల సమయానికి బీఎస్‌ఈ సెన్సెక్స్ 833 పాయింట్లు, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ నిఫ్టీ 243 పాయింట్లు, నిఫ్టీ బ్యాంక్ 480 పాయింట్లు, నిఫ్టీ మిడ్‌క్యాప్ సూచీ 688 పాయింట్ల మేర నష్టాల్లో ట్రేడవుతున్నాయి. వారాంత ట్రేడింగ్‌లో బ్యాంకింగ్, ఐటీ, ఆటో, మెటల్ సహా దాదాపు అన్ని రంగాల షేర్లు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి.
అమెరికా 60 దేశాలపై 10 నుంచి 12.5 శాతం వరకు కొత్త దిగుమతి సుంకాలను ప్రకటించగా, భారత్‌పై 10 శాతం సుంకం విధించడం కూడా మార్కెట్ సెంటిమెంట్‌ను దెబ్బతీసింది. అంతర్జాతీయ వాణిజ్యంపై ఈ నిర్ణయం ప్రభావం చూపే అవకాశముందన్న అంచనాలతో పెట్టుబడిదారులు అప్రమత్తంగా వ్యవహరించారు.
మరోవైపు, అమెరికా–ఇరాన్ ఉద్రిక్తతల నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు బ్యారెల్‌కు 100 డాలర్లను దాటాయి. పరిస్థితులు మరింత దిగజారితే ధరలు 120 డాలర్ల వరకు చేరే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. హార్ముజ్ జలసంధితో పాటు ఎర్ర సముద్ర ప్రాంతంలోనూ ఉద్రిక్తతలు పెరగడం, హౌతీ తిరుగుబాటుదారులు నౌకలపై దాడులు చేయడం వల్ల ముడిచమురు సరఫరాపై ఆందోళనలు మరింత పెరిగాయి.
ఈ పరిణామాల నేపథ్యంలో ఇన్వెస్టర్లు భారీగా లాభాల స్వీకరణ, అమ్మకాల బాట పట్టడంతో మార్కెట్ అస్థిరతను సూచించే ఇండియా విక్స్ సూచీ 14 పాయింట్లకు పైగా చేరింది. యుద్ధ భయాలు, పెరుగుతున్న చమురు ధరలు, కొత్త సుంకాల ప్రభావం కలిసి ప్రపంచ మార్కెట్లతో పాటు భారత మార్కెట్లపై కూడా తీవ్ర ఒత్తిడి తెస్తున్నాయని మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు. సమీప కాలంలో అంతర్జాతీయ పరిణామాలే మార్కెట్ దిశను నిర్ణయించే అవకాశముందని వారు అభిప్రాయపడుతున్నారు.







