ఢిల్లీ, మహా.
డిజిటల్ వేదికల్లో అశ్లీల, అభ్యంతరకర కంటెంట్ ప్రసారాన్ని అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం మరోసారి కఠిన చర్యలు చేపట్టింది. సమాజానికి హానికరంగా భావించిన 50 ఓటీటీ యాప్‌లను దేశవ్యాప్తంగా బ్లాక్ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. గతేడాది 25, ఈ ఏడాది ఫిబ్రవరిలో మరో ఐదు యాప్‌లపై చర్యలు తీసుకున్న కేంద్రం, తాజాగా మరిన్ని వేదికలపై నిషేధం విధించడం ప్రాధాన్యం సంతరించుకుంది.
లోక్‌సభలో లిఖితపూర్వక సమాధానం ఇచ్చిన కేంద్ర సమాచార, ప్రసార శాఖ సహాయ మంత్రి డాక్టర్ ఎల్. మురుగన్, డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లలో ప్రసారమవుతున్న కంటెంట్‌ను ప్రభుత్వం నిరంతరం పర్యవేక్షిస్తోందని తెలిపారు. చట్టాలను ఉల్లంఘిస్తూ అసభ్యకర కంటెంట్‌ను ప్రసారం చేసే యాప్‌లపై ఎలాంటి రాజీ లేకుండా కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
సమాచార సాంకేతిక (డిజిటల్ మీడియా ఎథిక్స్ కోడ్) నిబంధనలు–2021 ప్రకారం ఈ యాప్‌లపై చర్యలు తీసుకున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఈ ప్లాట్‌ఫారమ్‌లలోని కంటెంట్ భారతీయ శిక్షాస్మృతి సెక్షన్ 294తో పాటు మహిళల అసభ్య ప్రాతినిధ్య (నిషేధ) చట్టంలోని నిబంధనలను ఉల్లంఘించినట్లు గుర్తించినట్లు పేర్కొంది. వీక్షణలు, సబ్‌స్క్రిప్షన్ల ద్వారా ఆదాయం పెంచుకోవడానికే అసభ్యకర దృశ్యాలను ప్రోత్సహిస్తున్నట్లు తేలడంతో వాటి సేవలను పూర్తిగా నిలిపివేసినట్లు వివరించింది.
నిషేధిత యాప్‌ల పేర్లను ప్రస్తుతం వెల్లడించకపోయినా, వాటిని వెంటనే గూగుల్ ప్లే స్టోర్, యాపిల్ యాప్ స్టోర్‌ల నుంచి తొలగించాలని కేంద్రం ఆదేశించింది. అలాగే ఇంటర్నెట్ సేవల సంస్థలు (ఐఎస్‌పీలు) కూడా ఆయా యాప్‌ల యాక్సెస్‌ను పూర్తిగా నిలిపివేయాలని సూచించింది.
కొత్త ఐటీ నిబంధనల ప్రకారం కోర్టు లేదా ప్రభుత్వ ఆదేశాలు జారీ అయిన మూడు గంటల్లోపే చట్టవిరుద్ధమైన కంటెంట్‌ను సోషల్ మీడియా, డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లు తొలగించాలని కేంద్రం మరోసారి స్పష్టం చేసింది. డిజిటల్ వేదికల్లో చట్టవ్యతిరేక, అసభ్యకర కంటెంట్‌పై పర్యవేక్షణను మరింత కట్టుదిట్టం చేస్తామని ప్రభుత్వం తెలిపింది.







