Mahaa Daily Exclusive

  పేపర్ లీక్‌లపై కేంద్రం ఉక్కుపాదం…..

Share

పేపర్ లీక్‌లపై కేంద్రం ఉక్కుపాదం.
• కఠిన శిక్షలకు కేబినెట్ గ్రీన్‌సిగ్నల్.
ఢిల్లీ, మహా.
దేశవ్యాప్తంగా ప్రవేశ పరీక్షల ప్రశ్నపత్రాల లీకేజీలు తీవ్ర ఆందోళనకు దారితీస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం మరింత కఠిన చర్యలకు సిద్ధమైంది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన శుక్రవారం జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో పేపర్ లీక్‌లను అరికట్టేందుకు చట్టాన్ని మరింత బలోపేతం చేసే అంశాలపై కీలక చర్చ జరిగింది. ఇప్పటికే అమల్లో ఉన్న 2024 ప్రవేశ పరీక్షల (అక్రమ పద్ధతుల నివారణ) చట్టంలో సవరణలు చేసి, మరింత కఠిన శిక్షలు విధించే బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపినట్లు సమాచారం. ప్రశ్నపత్రాల లీకేజీలకు పాల్పడే వ్యక్తులు, వ్యవస్థీకృత ముఠాలపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు కేసుల విచారణను వేగవంతం చేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది.

ఇటీవల ప్రశ్నపత్రాల లీక్‌లపై స్పందించిన ప్రధాని మోదీ, ఇలాంటి నేరాలను ఏమాత్రం ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తును దెబ్బతీసే పేపర్ లీక్‌లకు పాల్పడిన వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవడమే కాకుండా, కేసుల విచారణను కూడా వేగంగా పూర్తి చేసే విధానాన్ని అమలు చేస్తామని ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే చట్ట సవరణల ప్రక్రియను కేంద్ర ప్రభుత్వం వేగవంతం చేసినట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం అమల్లో ఉన్న 2024 ప్రవేశ పరీక్షల (అక్రమ పద్ధతుల నివారణ) చట్టం ప్రకారం, వ్యక్తిగతంగా ప్రశ్నపత్రాల లీక్‌కు పాల్పడిన వారికి మూడు నుంచి ఐదు సంవత్సరాల వరకు జైలు శిక్షతో పాటు రూ.10 లక్షల వరకు జరిమానా విధించే అవకాశం ఉంది. అదే వ్యవస్థీకృత నేరాలకు పాల్పడిన ముఠాల విషయంలో ఐదు నుంచి పది సంవత్సరాల జైలు శిక్షతో పాటు రూ.1 కోటి వరకు జరిమానా విధించే నిబంధనలు అమల్లో ఉన్నాయి. అయితే ఇటీవల వెలుగుచూసిన పలు ప్రవేశ పరీక్షల లీక్ ఘటనల నేపథ్యంలో ఈ శిక్షలు సరిపోవడం లేదనే అభిప్రాయానికి కేంద్రం వచ్చినట్లు తెలుస్తోంది. దీంతో జైలు శిక్షల కాలాన్ని మరింత పెంచడం, జరిమానాల మొత్తాన్ని గణనీయంగా అధికం చేయడం వంటి అంశాలను పరిశీలిస్తోంది.

ముఖ్యంగా పరీక్షల నిర్వహణలో భాగమైన అధికారులు లేదా వ్యవస్థీకృత నేర ముఠాల ప్రమేయం ఉన్న కేసుల్లో మరింత కఠిన నిబంధనలు అమలు చేయాలని కేంద్రం యోచిస్తోంది. పరీక్షల విశ్వసనీయతను దెబ్బతీసే వారిపై రాజీ లేని చర్యలు తీసుకునేలా చట్టంలో మార్పులు తీసుకురానున్నట్లు సమాచారం.

పేపర్ లీక్ కేసుల విచారణను వేగవంతం చేయడంపైనా కేంద్రం ప్రత్యేక దృష్టి సారించింది. ఇందుకోసం ప్రత్యేక ఫాస్ట్‌ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఢిల్లీలో తొలి ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ఏర్పాటు కాగా, త్వరలో మరో నాలుగు ప్రత్యేక కోర్టులను ఏర్పాటు చేసే దిశగా చర్యలు కొనసాగుతున్నాయి. ఈ కోర్టుల్లో పేపర్ లీక్ కేసులను ఏడాది లోపే విచారించి తీర్పులు ఇవ్వాలనే లక్ష్యంతో చట్టంలో తగిన సవరణలు చేయనున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఇలాంటి కేసుల విచారణకు ఎక్కువ సమయం పట్టడం వల్ల నిందితులకు శిక్షలు ఆలస్యమవుతున్నాయన్న విమర్శల నేపథ్యంలో వేగవంతమైన న్యాయ ప్రక్రియకు ప్రాధాన్యం ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది.

పరీక్షల నిర్వహణలో పారదర్శకతను కాపాడటం, విద్యార్థుల్లో విశ్వాసాన్ని పెంపొందించడం, ప్రవేశ పరీక్షల వ్యవస్థను మరింత పటిష్ఠంగా తీర్చిదిద్దడమే ఈ చట్ట సవరణల ప్రధాన లక్ష్యమని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి.