కాంగ్రెస్, బీఆర్ఎస్ పాలనంతా పేపర్ లీకేజీల మయం.
* జెన్ జీ తరం ఆ రెండు పార్టీలను నిలదీయాలి.
* కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్.
హైదరాబాద్, మహా.
నీట్ వ్యవహారంపై విపక్షాలు చేస్తున్న రాద్దాంతాన్ని తిప్పికొడుతూ, గతంలో పేపర్ లీకేజీలతో విద్యార్థుల భవిష్యత్తును నాశనం చేసిన కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల నైతికతను కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తీవ్రస్థాయిలో ప్రశ్నించారు. శుక్రవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సమావేశంలో బీజేపీ ఎమ్మెల్యేలు పైడి రాకేశ్ రెడ్డి, పాల్వాయి హరీష్, ఎమ్మెల్సీలు అంజిరెడ్డి, మల్క కొమరయ్య, బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేముల అశోక్, ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి ఎస్.కుమార్, ముఖ్య అధికార ప్రతినిధి ఎన్వీ సుభాష్, అధికార ప్రతినిధులు సీహెచ్.విఠల్, జె.సంగప్ప తదితరులు పాల్గొన్నారు.
**జెన్ జీ తరం ఆలోచించాలి – కేసీఆర్, రేవంత్ రెడ్డిల రాజీనామా ఏది?*
బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో ఎంసెట్, టీఎస్పీఎస్సీ గ్రూప్-1, ఎస్సెస్సీ పేపర్లు లీక్ అయ్యాయని, కాంగ్రెస్ రెండున్నరేళ్ల పాలనలోనూ పదో తరగతి తెలుగు, హిందీ పేపర్లు లీక్ అయ్యాయని బండి సంజయ్ ఆరోపించారు. మరి నాడు ప్రశ్నాపత్రాలను అమ్ముకుని విద్యార్థుల భవిష్యత్తును నాశనం చేసిన కేసీఆర్, కేటీఆర్ గానీ, నేడు గ్రూప్-1 అక్రమాలతో 4 లక్షల మంది నిరుద్యోగులను వంచించిన రేవంత్ రెడ్డి గానీ ఎందుకు రాజీనామా చేయలేదని నిలదీశారు. “జెన్ జీ” తరం పిల్లలు మేల్కొని, విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించిన ఈ రెండు పార్టీలను గట్టిగా నిలదీయాలని పిలుపునిచ్చారు.
గతంలో నిరసనలపై నిషేధం విధిస్తూ నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఎత్తేసిన ధర్నా చౌక్ వద్దకే ఈరోజు బీఆర్ఎస్ నేతలు వచ్చి సిగ్గులేకుండా ధర్నా చేస్తుంటే పక్కనే ఉన్న ఇందిరాపార్క్, ఎన్టీఆర్ స్టేడియం పగలబడి నవ్వుతున్నాయని ఎద్దేవా చేశారు.
**నీట్ వివాదం – విద్యార్థుల ముసుగులో కమ్యూనల్, కమ్యూనిస్టు అరాచకం**
నీట్ పేపర్ లీక్ వ్యవహారం లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తు, తల్లిదండ్రుల భావోద్వేగాలతో ముడిపడి ఉందని, ఈ ఘటనపై అందరికంటే ఎక్కువగా ప్రధాని నరేంద్ర మోదీ తీవ్రంగా బాధపడుతున్నారని తెలిపారు. బాధ్యులకు కఠిన శిక్ష పడేలా ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేయడమే కాకుండా, సీబీఐ ద్వారా 11 మంది ఫ్యాకల్టీ సహా 17 మందిని ఇప్పటికే అరెస్ట్ చేయించామని చెప్పారు. విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ స్వయంగా క్షమాపణలు చెప్పారని, విద్యార్థుల విద్యా సంవత్సరం నష్టపోకుండా కేవలం 40 రోజుల్లోనే తిరిగీ పరీక్షలు నిర్వహించి ఫలితాలు వెల్లడించామని వివరించారు.
ఢిల్లీలో కాక్రోచ్ పార్టీ పేరుతో జరిగిన ఆందోళనల్లో విద్యార్థుల ముసుగులో కమ్యూనిస్టు, కమ్యూనల్, అర్బన్ నక్సల్ శక్తులు చొరబడి పార్లమెంట్ పై దాడి చేసేందుకు, దేశ వ్యతిరేక నినాదాలు చేసేందుకు కుట్ర పన్నాయని మండిపడ్డారు. 118 మంది పోలీసులకు తీవ్ర గాయాలైనా, జర్నలిస్టులు, మహిళా జర్నలిస్టులపై దాడులు జరిగినా పోలీసులు నిగ్రహం పాటించారని, తప్పనిసరి పరిస్థితుల్లోనే లాఠీఛార్జ్ చేయాల్సి వచ్చిందన్నారు.
నీట్ పరీక్షకు ఆర్టికల్ 370 రద్దుకు, ఆజాద్ కాశ్మీర్ కు లేదా బంగ్లాదేశ్, పాకిస్తాన్, నేపాల్, శ్రీలంక వంటి దేశాలకు ఉన్న సంబంధమేమిటని ప్రశ్నించారు. రాముడు, సీతమ్మ, సనాతన ధర్మానికి నీట్ తో ఏం సంబంధమని నిలదీశారు. డాక్టర్ కావాలనుకునే నిజమైన విద్యార్థులెవరూ దేశద్రోహ నినాదాలు చేయరని, రాళ్లు విసరరని స్పష్టం చేశారు. ఈ ఉద్రిక్తతల వెనుక ఉన్న పాకిస్తాన్ కు చెందిన 480 సోషల్ మీడియా అకౌంట్లను కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే బ్లాక్ చేసిందని వెల్లడించారు.
**విపక్షాల నైతికతపై ప్రశ్నాస్త్రాలు**
విపక్షాలు పార్లమెంట్ లో నీట్ పై చర్చించేందుకు సిద్ధంగా లేవని, రభస సృష్టించి నరేంద్ర మోదీని దించి రాహుల్ గాంధీని ప్రధాని చేయడమే వారి ఏకైక లక్ష్యమని విమర్శించారు. యూపీఏ హయాంలో 72 సార్లు పేపర్లు లీక్ అయితే నాడు మన్మోహన్ సింగ్ ఎందుకు రాజీనామా చేయలేదని, రాజస్థాన్ లో అశోక్ గెహ్లాట్ పాలనలో 18 సార్లు లీక్ అయితే రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఎందుకు మాట్లాడలేదని నిలదీశారు. పంజాబ్ లో ఆప్ ప్రభుత్వం, కర్ణాటక, యూపీ, బెంగాల్, కేరళలోని పబ్లిక్ సర్వీస్ కమిషన్ అవకతవకలపై ఏ రోజైనా ఆయా ముఖ్యమంత్రుల రాజీనామాలు కోరారా అని ఆక్షేపించారు. కాంగ్రెస్ తన హయాంలో నీచమైన రీతిలో లాడ్జీల్లో మెడికల్ ఎంట్రన్స్ పరీక్షలు రాయించిన చరిత్ర కలిగి ఉందన్నారు.
** కేటీఆర్ నిర్వాకం, కాంగ్రెస్ – బీఆర్ఎస్ చీకటి ఒప్పందాలు**
గతంలో కేటీఆర్ బినామీ సంస్థ గ్లోబరీనా నిర్వాకం వల్ల 27 మంది ఇంటర్మీడియట్ విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటే, వారి తల్లిదండ్రులపై లాఠీఛార్జ్ చేయించిన ఘోరాన్ని ఎవరూ మర్చిపోలేరని గుర్తుచేశారు. నాడు గ్రూప్-1, టెన్త్ పేపర్ లీక్ పై తాను పోరాటం చేస్తే అర్ధరాత్రి వేళ కేసీఆర్ మద్యం తాగి పోలీస్ కమిషనర్ కు ఫోన్ చేసి జైలుకు పంపారని, కానీ కోర్టు కేసీఆర్ ప్రభుత్వానికి మొట్టికాయలు వేస్తూ తనను నిర్దోషిగా ప్రకటించిందని వివరించారు.
ఈరోజు కాంగ్రెస్, బీఆర్ఎస్ లు చీకటి ఒప్పందాలతో నాటకాలాడుతున్నాయని, రేవంత్ రెడ్డి కొట్టినట్లు చేస్తే కేటీఆర్ ఏడ్చినట్లు నటిస్తున్నారని, ఇది చంపినోడే సంతాప సభ పెట్టినట్లు ఉందని విమర్శించారు. అధికారంలోకి రాగానే కేసీఆర్ కుటుంబాన్ని జైల్లో వేస్తామన్న రేవంత్ రెడ్డి, రెండేళ్లయినా ఎందుకు చర్యలు తీసుకోలేదో, ఫోన్ ట్యాపింగ్ పై ఎందుకు ముందుకు వెళ్లడం లేదో ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. బీఆర్ఎస్ ఇచ్చే మూటలను కాంగ్రెస్ ఢిల్లీకి మోస్తోందని, బీఆర్ఎస్ స్కాములు కాంగ్రెస్ కు ఏటీఎంలా మారాయని ఆరోపించారు.
**బీజేపీ సంస్కరణలు – విద్యార్థులకు పిలుపు**
పేపర్ లీకేజీలను అరికట్టేందుకు 2024లోనే కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ లో “యాంటీ పేపర్ లీక్ బిల్లు” ప్రవేశపెడితే కాంగ్రెస్ సిగ్గులేకుండా వాకౌట్ చేసిందని గుర్తుచేశారు. భవిష్యత్తులో నీట్ పరీక్షలను జేఈఈ తరహాలోనే ఆన్ లైన్ లో నిర్వహిస్తామని తెలిపారు. 2014 కంటే ముందు దేశంలో కేవలం 51 వేల ఎంబీబీఎస్ సీట్లు, 385 మెడికల్ కాలేజీలు ఉంటే, నేడు వాటిని 1,36,000 సీట్లకు, 824 కాలేజీలకు పెంచిన ఘనత మోదీ ప్రభుత్వానిదేనని చాటిచెప్పారు. రాబోయే రోజుల్లో హైదరాబాద్ యూత్ డిక్లరేషన్ హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు.
కేటీఆర్ 50వ పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూనే, కేటీఆర్ బతుకంతా ఫిఫ్టీ-ఫిఫ్టీ అయిపోయిందని, సగం రోజులు గబ్బులు.. మరో సగం రోజులు పబ్బులతోనే గడుపుతున్నారని ఎద్దేవా చేశారు. వినాశకర శక్తులు, అర్బన్ నక్సల్స్ కుట్రల వలలో పడకుండా, విద్యార్థులంతా రాబోయే మెడికల్ కౌన్సిలింగ్ కు సిద్ధం కావాలని, భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని హితవు పలికారు.








