కోర్టు వీడియోలపై సుప్రీం ఆంక్షలు.
• అనుమతి లేకుండా పోస్టు చేస్తే ధిక్కార చర్యలు.
ఢిల్లీ, మహా.
కోర్టు విచారణలకు సంబంధించిన ఆడియో, వీడియో రికార్డింగ్‌ల వినియోగంపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. కోర్టు విచారణల వీడియోలను అనుమతి లేకుండా సోషల్ మీడియాలో పోస్టు చేయడాన్ని నిషేధించిన ధర్మాసనం, వాటిని ఉపయోగించాలంటే సుప్రీంకోర్టు సెక్రటరీ జనరల్ లేదా సంబంధిత హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ నుంచి ముందస్తు అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని స్పష్టం చేసింది. నిబంధనలు ఉల్లంఘిస్తే కోర్టు ధిక్కార చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించింది.
కోర్టు విచారణల ప్రత్యక్ష ప్రసారాలు, వీడియోలను సామాజిక మాధ్యమాల్లో దుర్వినియోగం చేస్తున్నారంటూ దాఖలైన పిటిషన్‌పై విచారణ సందర్భంగా ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. విచారణలకు సంబంధించిన దృశ్యాలను మీమ్స్, రీల్స్, షార్ట్స్ రూపంలో వైరల్ చేయడంపై తీవ్ర అసహనం వ్యక్తం చేసింది.
వ్యూస్, లైక్‌ల కోసం కోర్టు వ్యాఖ్యలను సంచలనాత్మకంగా మార్చి ప్రచారం చేయడం వల్ల న్యాయమూర్తులు, న్యాయవాదుల గౌరవానికి భంగం కలుగుతోందని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. న్యాయవ్యవస్థ ప్రతిష్ఠకు భంగం కలిగించేలా కోర్టు విచారణల వీడియోలను వాడుకోవడం సహించబోమని స్పష్టం చేసింది.
అనుమతి లేకుండా కోర్టు విచారణల వీడియోలను సోషల్ మీడియా వేదికల్లో అప్‌లోడ్ చేసిన వారిపై కోర్టు ధిక్కార చర్యలు తీసుకునే అవకాశం ఉందని ధర్మాసనం హెచ్చరించింది. ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వం తన వైఖరిని తెలియజేయాలని కోరుతూ నోటీసులు జారీ చేసి, తదుపరి విచారణకు కేసును వాయిదా వేసింది.







