Mahaa Daily Exclusive

  యువత కోసమే మోదీ సంస్కరణలు  భోగాపురానికి ఘన స్వాగతం –  పీవీఎన్ మాధవ్

Share

విశాఖపట్నం, మహా.
దేశ యువత భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ప్రధాని నరేంద్ర మోదీ విద్యా రంగంలో విప్లవాత్మక సంస్కరణలు అమలు చేస్తున్నారని బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ అన్నారు. శుక్రవారం విశాఖపట్నంలో మీడియాతో మాట్లాడిన ఆయన, గత ప్రభుత్వాలతో పోలిస్తే విద్యా వ్యవస్థలో పారదర్శకత పెరిగిందని, విద్యార్థులకు మరిన్ని అవకాశాలు కల్పించే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుందని పేర్కొన్నారు.

ప్రధాని మోదీ నాయకత్వంలో దేశవ్యాప్తంగా ఐఐటీలు, ఐఐఎంలు, గిరిజన విశ్వవిద్యాలయాల సంఖ్య పెరిగిందని, వైద్య విద్యను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు మెడికల్ సీట్లను గణనీయంగా పెంచినట్లు తెలిపారు. గత ప్రభుత్వాల కాలంతో పోలిస్తే ప్రశ్నాపత్రాల లీకుల ఘటనలు గణనీయంగా తగ్గాయని, ఎక్కడైనా అవకతవకలు వెలుగులోకి వస్తే వెంటనే కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోందని చెప్పారు.

నీట్ పరీక్షను సాకుగా చేసుకుని కొందరు రాజకీయ ప్రయోజనాల కోసం విద్యార్థులను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని పీవీఎన్ మాధవ్ ఆరోపించారు. ఢిల్లీలో మత విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా ఆందోళనలు నిర్వహిస్తున్నారని విమర్శించారు. నీట్ అంశాన్ని ఆధారంగా చేసుకుని ప్రధాని నరేంద్ర మోదీతో పాటు సుప్రీంకోర్టుపై అనుచిత వ్యాఖ్యలు చేయడం బాధాకరమని అన్నారు. నటుడు ప్రకాశ్ రాజ్ సహా కొందరు దేశ ప్రయోజనాలకు విరుద్ధంగా వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. విద్యార్థుల భవిష్యత్తును దెబ్బతీసేలా కొన్ని విద్యా సంఘాలు వ్యవహరిస్తున్నాయని ఆరోపించారు.

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై కూడా పీవీఎన్ మాధవ్ విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ పాలనలో జరిగిన ప్రశ్నాపత్రాల లీకులపై పార్లమెంట్‌లో మాట్లాడే ధైర్యం రాహుల్ గాంధీకి ఉంటే మాట్లాడాలని సవాల్ విసిరారు. చర్చల్లో పాల్గొనే ధైర్యం లేకపోవడంతోనే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని వ్యాఖ్యానించారు.

ఆగస్టు 1న ప్రధాని నరేంద్ర మోదీ భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ ప్రారంభోత్సవానికి హాజరుకానున్నట్లు పీవీఎన్ మాధవ్ వెల్లడించారు. ప్రధానికి ఘన స్వాగతం పలికేందుకు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో 13 వేల మంది కళాకారులతో థింసా నృత్య ప్రదర్శన, బొబ్బిలి వీణ నాదంతో సంప్రదాయ స్వాగతం పలకనున్నట్లు చెప్పారు. అనంతరం నిర్వహించే బహిరంగ సభకు సుమారు మూడు లక్షల మంది హాజరయ్యేలా ఏర్పాట్లు చేస్తున్నామని వెల్లడించారు.

భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ఉత్తరాంధ్ర అభివృద్ధికి కొత్త దిశను చూపుతుందని పీవీఎన్ మాధవ్ పేర్కొన్నారు. విమానాశ్రయం ప్రారంభం అనంతరం ఉత్తరాంధ్రలో వెనుకబడిన ప్రాంతాలు అభివృద్ధి బాట పట్టేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించిందన్నారు. స్వాతంత్ర్య సమరయోధుడు అల్లూరి సీతారామరాజు పేరును విమానాశ్రయానికి పెట్టడం ద్వారా ఆయన సేవలను చిరస్థాయిగా నిలబెట్టినట్లు తెలిపారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ఆధునిక సదుపాయాలతో దేశంలోనే ప్రత్యేక గుర్తింపు పొందనున్న ప్రాజెక్టుగా నిలుస్తుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.