• మొదటి విడతలో 7,680 ఫ్లాట్లు.
• ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి.
హైదరాబాద్, మహా.
నగరంలోని నిరుపేదలకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలకు చేరువలోనే సొంతింటి కలను సాకారం చేసే దిశగా ప్రభుత్వం చర్యలు వేగవంతం చేసింది. క్యూర్ పరిధిలో చేపట్టనున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై శుక్రవారం ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించి, జనావాసాల్లోనే గృహ నిర్మాణం చేపట్టాలని అధికారులను ఆదేశించారు. నిరుపయోగంగా ఉన్న ప్రభుత్వ భూములను వెంటనే గుర్తించి గృహ నిర్మాణానికి వినియోగించాలని స్పష్టం చేశారు.
సమీక్ష సమావేశంలో మాట్లాడిన ముఖ్యమంత్రి, ఔటర్ రింగ్ రోడ్ (ఓఆర్ఆర్) పరిధిలోని ఖాళీ ప్రభుత్వ భూములపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. పోలీస్, రెవెన్యూ, రవాణా శాఖల ఆధీనంలో ఖాళీగా ఉన్న స్థలాలను ఇందిరమ్మ గృహాల నిర్మాణానికి వినియోగించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. నగరానికి దూరంగా కాకుండా ఉపాధి అవకాశాలు అందుబాటులో ఉండే ప్రాంతాల్లోనే గృహాలు నిర్మిస్తే లబ్ధిదారులకు మరింత ఉపయోగకరంగా ఉంటుందని సూచించారు.
మొదటి విడతలో రాష్ట్రంలోని 17 నియోజకవర్గాల్లో మొత్తం 7,680 ఇందిరమ్మ ఫ్లాట్ల నిర్మాణాన్ని చేపట్టనున్నట్లు ముఖ్యమంత్రి వెల్లడించారు. ఒక్కో ఫ్లాట్‌ను 528 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించనున్నట్లు తెలిపారు. ఒక్కో ఫ్లాట్ నిర్మాణానికి సుమారు రూ.11 లక్షల వ్యయం అవుతుందని, ఇందులో ప్రభుత్వం రూ.5 లక్షల సబ్సిడీ అందించనుందని చెప్పారు. భూమి విలువ మొత్తాన్ని పూర్తిగా ప్రభుత్వమే భరిస్తుందని స్పష్టం చేశారు.
ఖాళీ ప్రభుత్వ భూముల గుర్తింపు ప్రక్రియను వేగవంతం చేసి నిర్మాణ పనులు త్వరగా ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు ముఖ్యమంత్రి ఆదేశించారు. నగర పరిసర ప్రాంతాలకు పరిమితం కాకుండా ప్రజలు నివసిస్తున్న ప్రాంతాల్లోనే గృహాలను నిర్మించడం ద్వారా నిరుపేదలకు మెరుగైన జీవన వాతావరణం, ఉపాధి అవకాశాలు, మౌలిక సదుపాయాలు అందుబాటులోకి తీసుకురావడమే ప్రభుత్వ లక్ష్యమని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.








