ఢిల్లీ, మహా.
నీట్ పేపర్ లీక్ వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించాలని డిమాండ్ చేస్తూ ఆందోళనలు కొనసాగిస్తున్న కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) ప్రతినిధులు శుక్రవారం కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, జితేందర్ సింగ్‌లతో సమావేశమయ్యారు. దాదాపు గంటన్నరపాటు సాగిన ఈ సమావేశంలో నీట్ పరీక్ష నిర్వహణ, విద్యా వ్యవస్థలో పారదర్శకత, విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించిన అంశాలపై విస్తృతంగా చర్చించారు. తమ డిమాండ్లను సీజేపీ ప్రతినిధులు కేంద్ర ప్రభుత్వానికి లిఖితపూర్వకంగా సమర్పించారు.
సమావేశంలో నీట్ పేపర్ లీక్‌కు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని సీజేపీ ప్రతినిధులు పట్టుబట్టారు. పేపర్ లీక్ ఘటనల నేపథ్యంలో ఆత్మహత్యలకు పాల్పడిన విద్యార్థుల కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి రూ.కోటి చొప్పున పరిహారం ప్రకటించాలని కోరారు. అలాగే పార్లమెంట్‌కు ర్యాలీగా వెళ్లిన విద్యార్థులపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌లను తక్షణమే ఉపసంహరించాలని డిమాండ్ చేశారు.
ఈ డిమాండ్లపై స్పందించిన కేంద్ర మంత్రులు నిర్ణయం తీసుకునేందుకు ఒక రోజు సమయం ఇవ్వాలని సీజేపీ ప్రతినిధులను కోరినట్లు సమాచారం. దీంతో శనివారం మరోసారి సమావేశమై తుది నిర్ణయంపై చర్చించాలని ఇరు వర్గాలు అంగీకరించాయి.
సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన సీజేపీ ప్రతినిధి సౌరభ్ దాస్, కేంద్ర ప్రభుత్వం ముందు మూడు ప్రధాన డిమాండ్లను ఉంచామని తెలిపారు. వాటిలో రెండు అంశాలపై కేంద్రం సానుకూలంగా స్పందించిందని చెప్పారు. విద్యార్థులపై నమోదైన కేసులను ఉపసంహరించేందుకు కేంద్రం అంగీకరించిందని పేర్కొన్నారు. పేపర్ లీక్ ఘటనలతో ప్రాణాలు కోల్పోయిన విద్యార్థుల కుటుంబాలకు రూ.కోటి చొప్పున పరిహారం ఇవ్వాలని మరోసారి కోరినట్లు వెల్లడించారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అంశంపై తుది నిర్ణయం వెల్లడించేందుకు కేంద్రం రేపటి వరకు గడువు కోరిందని సౌరభ్ దాస్ తెలిపారు. సమావేశం అనంతరం జరిగే తదుపరి చర్చలపై విద్యార్థి సంఘాలు, రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.








