Mahaa Daily Exclusive

  విద్యార్థులే రాష్ట్ర భవిష్యత్తు. విద్యపై పెట్టుబడే నిజమైన సంపద. సీఎం చంద్రబాబు నాయుడు.

Share

రంపచోడవరం (పోలవరం జిల్లా), మహా.
పిల్లలు ఆనందంగా చదువుకునే వాతావరణాన్ని కల్పించడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని, విద్యార్థుల భవిష్యత్తు నిర్మాణంలో ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల పాత్ర అత్యంత కీలకమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. శుక్రవారం రంపచోడవరంలో నిర్వహించిన తల్లిదండ్రులు–ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న ఆయన, విద్యా రంగంలో ప్రభుత్వం చేపడుతున్న సంస్కరణలు, సంక్షేమ కార్యక్రమాలను వివరించారు.

రాష్ట్రంలో ఉపాధ్యాయుల కొరత లేదని, విద్యా వ్యవస్థకు ఉపాధ్యాయులే వెన్నెముక అని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. తల్లిదండ్రులతో సమన్వయం చేసుకుంటూ ప్రతి విద్యార్థిని ఉన్నత స్థాయికి తీసుకెళ్లే బాధ్యత ఉపాధ్యాయులపై ఉందన్నారు. విద్యార్థుల ఆరోగ్యం, చదువుపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతోందని, పాఠశాలల్లో పిల్లలందరికీ పౌష్టికాహారం అందిస్తున్నామని తెలిపారు.

పేద కుటుంబాల అభ్యున్నతే లక్ష్యంగా ‘పీ4’ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నామని చంద్రబాబు చెప్పారు. భవిష్యత్తులో పిల్లలే కుటుంబాలకు నిజమైన ఆస్తి అవుతారని పేర్కొన్నారు. పిల్లలు పుట్టడం భారంగా కాకుండా కుటుంబానికి బలంగా మారే విధంగా ప్రభుత్వ పథకాలను రూపొందించామని తెలిపారు. ‘తల్లికి వందనం’ పథకం కింద కుటుంబంలో ఎంతమంది పిల్లలున్నా వారికి ఆర్థిక సహాయం అందిస్తున్నామని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా 67 లక్షల మంది విద్యార్థులకు రూ.10,120 కోట్లను జమ చేస్తున్నామని, గిరిజన ప్రాంతాల్లోనే ఐదు లక్షల మంది విద్యార్థులకు రూ.664 కోట్ల ఆర్థిక సాయం అందిస్తున్నట్లు వెల్లడించారు.

గిరిజన విద్యార్థులకు ఉన్నత విద్యలో మరిన్ని అవకాశాలు కల్పించేందుకు ఐఐటీల్లో ప్రత్యేక ప్రాధాన్యం కల్పించే చర్యలు చేపడుతున్నామని ముఖ్యమంత్రి తెలిపారు. ఆగస్టు నుంచి ‘సంజీవని’ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు ప్రకటించారు. ప్రతి ఇంటికి ఉచితంగా సోలార్ విద్యుత్ అందించే కార్యక్రమాన్ని కూడా అమలు చేస్తామని చెప్పారు. ఆర్థిక అసమానతలను తగ్గించి ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు.

రాష్ట్రంపై భారీ అప్పుల భారం ఉన్నప్పటికీ సంక్షేమ పథకాల అమలులో వెనుకడుగు వేయడం లేదని చంద్రబాబు స్పష్టం చేశారు. విద్యా రంగానికే అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నామని, పాఠశాలల్లో పేరెంట్–టీచర్ మీటింగ్ (పీటీఎం) వ్యవస్థ ద్వారా తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల మధ్య సమన్వయాన్ని మరింత బలోపేతం చేస్తున్నామని తెలిపారు. విద్యార్థుల అభ్యున్నతికి ప్రభుత్వం, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు కలిసి పనిచేస్తేనే రాష్ట్ర భవిష్యత్తు మరింత బలపడుతుందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.