ఢిల్లీ, మహా.
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్-యూజీ పేపర్ లీక్ వ్యవహారం అనంతరం పరీక్షల నిర్వహణలో చేపట్టిన సంస్కరణల అమలుపై సుప్రీంకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. తాత్కాలిక చర్యలతో సరిపెట్టకుండా, పరీక్షల వ్యవస్థలో శాశ్వత మార్పులు తీసుకురావడానికి చేపట్టిన చర్యలపై సమగ్ర అఫిడవిట్ దాఖలు చేయాలని కేంద్ర ప్రభుత్వం, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ)లను ధర్మాసనం ఆదేశించింది. పరీక్షల భద్రత, పారదర్శకత, పరిపాలనా సంస్కరణలపై పూర్తి వివరాలతో నివేదిక సమర్పించాలని స్పష్టం చేసింది.
జస్టిస్ పి.ఎస్. నరసింహ నేతృత్వంలోని ధర్మాసనం, పరీక్షల నిర్వహణలో చేపట్టిన సంస్కరణలను పది కీలక రంగాల వారీగా వివరించాలని కేంద్రాన్ని ఆదేశించింది. డిజిటల్ మౌలిక వసతులు, భద్రతా ప్రమాణాలు, పరిపాలనా వ్యవస్థ, పరిశోధన, మానవ వనరులు, పారదర్శకత తదితర అంశాలపై అమలు చేస్తున్న చర్యలను వివరించాలని సూచించింది. అలాగే పరీక్షకు ముందు, పరీక్ష జరుగుతున్న సమయంలో, పరీక్ష అనంతరం చేపట్టిన సంస్కరణలపై విడివిడిగా స్టేటస్ రిపోర్ట్ సమర్పించాలని ఆదేశించింది.
పరీక్షా పత్రాల రవాణా కోసం భారత వైమానిక దళం సేవలను వినియోగించడం శాశ్వత పరిష్కారం కాదని ధర్మాసనం స్పష్టం చేసింది. ఇది తాత్కాలిక భద్రతా చర్య మాత్రమేనని, భవిష్యత్తులో మరింత బలోపేతమైన వ్యవస్థను రూపొందించాల్సిన అవసరం ఉందని జస్టిస్ పి.ఎస్. నరసింహ వ్యాఖ్యానించారు. కంప్యూటర్ ఆధారిత పరీక్ష (సీబీటీ) విధానం అమలులో పురోగతి ఎంతవరకు వచ్చిందో వివరించాలని, అభ్యర్థుల వ్యక్తిగత సమాచార రక్షణ కోసం తీసుకుంటున్న చర్యలను వెల్లడించాలని కేంద్రాన్ని కోరారు. అభ్యర్థుల ధృవీకరణ కోసం డిజీయాత్ర వంటి ఆధునిక సాంకేతిక వ్యవస్థలను వినియోగించే ప్రతిపాదనలపై కూడా స్పష్టత ఇవ్వాలని సూచించారు.
పరీక్షల పర్యవేక్షణకు ప్రతిపాదించిన గవర్నింగ్ బోర్డు, నిపుణుల కమిటీలు, వివిధ వర్గాల ప్రతినిధుల నియామక ప్రక్రియ ఎంతవరకు పూర్తయిందో కూడా నివేదికలో పొందుపరచాలని ధర్మాసనం ఆదేశించింది. దీనిపై స్పందించిన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా, కోర్టు సూచించిన అన్ని అంశాలతో కూడిన సమగ్ర తాజా అఫిడవిట్‌ను త్వరలోనే సమర్పిస్తామని హామీ ఇచ్చారు. దీనిని ధర్మాసనం నమోదు చేసుకుంది.
నీట్ వంటి అత్యంత కీలకమైన జాతీయ స్థాయి పరీక్షల్లో సంస్కరణల అమలును న్యాయస్థానం నిరంతరం పర్యవేక్షిస్తుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. పరీక్షల విశ్వసనీయత, పారదర్శకతకు ఎలాంటి భంగం కలగకుండా వ్యవస్థాగత మార్పులు అమలు కావాల్సిన అవసరం ఉందని పేర్కొంటూ, కేసు తదుపరి విచారణను వచ్చే సోమవారానికి వాయిదా వేసింది.








