• మత్తు పదార్థాల మోతాదే ప్రాణాంతకం.
లండన్,మహా.
గతేడాది లండన్‌లోని విలాసవంతమైన హోటల్‌లో అనుమానాస్పద పరిస్థితుల్లో మృతిచెందిన సౌదీ రాజ కుటుంబానికి చెందిన యువరాజు అబ్దుల్లా బిన్ ఫహద్ బిన్ అబ్దుల్లా బిన్ అబ్దులజీజ్ బిన్ జలావీ అల్ సౌద్ మరణానికి సంబంధించి బ్రిటన్ దర్యాప్తు అధికారులు కీలక వివరాలను వెల్లడించారు. మద్యం, మత్తు పదార్థాలు, ప్రిస్క్రిప్షన్ ఔషధాలను ఒకేసారి అధిక మోతాదులో తీసుకోవడంతో గుండె ఆగిపోయి మరణించినట్లు దర్యాప్తులో తేలిందని వెల్లడించారు. ఈ మరణంలో ఇతరుల ప్రమేయం లేదా ఆత్మహత్యకు సంబంధించిన ఎలాంటి ఆధారాలు లభించలేదని కోర్టు స్పష్టం చేసింది.
సౌదీ రాజ కుటుంబానికి చెందిన 29 ఏళ్ల యువరాజు 2025 నవంబర్ 19న లండన్‌లోని కెన్సింగ్టన్ ప్రాంతంలోని మారియట్ హోటల్‌లో బస చేశారు. నవంబర్ 25 ఉదయం హోటల్ సిబ్బంది ఆయనను గదిలోని బాత్రూమ్ నేలపై అపస్మారక స్థితిలో గుర్తించి వెంటనే అత్యవసర వైద్య సేవలకు సమాచారం అందించారు. అయితే వైద్య బృందం అక్కడికి చేరుకునేలోపే ఆయన మృతిచెందినట్లు నిర్ధారించింది.
దర్యాప్తులో భాగంగా నిర్వహించిన పోస్ట్‌మార్టమ్‌లో యువరాజు రక్తంలో ప్రతి 100 మిల్లీలీటర్లకు 222 మిల్లీగ్రాముల ఆల్కహాల్ ఉన్నట్లు వెల్లడైంది. అదేవిధంగా పార్టీ డ్రగ్‌గా పిలిచే గామా-హైడ్రాక్సీబ్యూటిరేట్ (జీహెచ్‌బీ) ప్రాణాంతక స్థాయిలో ఉన్నట్లు గుర్తించారు. అలాగే గంజాయి, జానాక్స్‌తో పాటు ఆందోళన నివారణకు ఉపయోగించే కొన్ని ప్రిస్క్రిప్షన్ మందుల ఆనవాళ్లను కూడా వైద్య నిపుణులు గుర్తించారు.
ఈ మత్తు పదార్థాలు, మద్యం, మందుల కలయిక వల్ల గుండె పనితీరు ఒక్కసారిగా దెబ్బతిని ప్రాణాలు కోల్పోయినట్లు వైద్య నిపుణులు నిర్ధారించారు. అందుబాటులో ఉన్న అన్ని ఆధారాలను పరిశీలించిన కోర్టు, ఈ ఘటనను “అనుకోకుండా ప్రమాదకర చర్యల వల్ల సంభవించిన మరణం”గా నమోదు చేసింది. ఈ కేసులో నేరపూరిత కుట్ర, హత్య లేదా ఆత్మహత్యకు సంబంధించిన ఎలాంటి ఆధారాలు లభించలేదని దర్యాప్తు అధికారులు స్పష్టం చేశారు.








