Mahaa Daily Exclusive

  ఏఐ–కాపీరైట్ కేసులో భారీ సెటిల్‌మెంట్. రూ.14,400 కోట్ల ఒప్పందానికి కోర్టు ఆమోదం.

Share

లండన్, మహా.
కృత్రిమ మేధస్సు (ఏఐ) శిక్షణ కోసం కాపీరైట్ పుస్తకాలను అనుమతి లేకుండా వినియోగించారన్న ఆరోపణలతో ప్రముఖ ఏఐ సంస్థ యాంత్రోపిక్‌పై నమోదైన క్లాస్-యాక్షన్ దావా చారిత్రాత్మక పరిణామానికి దారితీసింది. అమెరికా కాపీరైట్ చరిత్రలోనే అత్యంత భారీగా భావిస్తున్న 1.5 బిలియన్ డాలర్ల (సుమారు రూ.14,400 కోట్ల) సెటిల్‌మెంట్‌కు కోర్టు ఆమోదం తెలిపింది. ఈ ఒప్పందంలో ప్రముఖ ప్రచురణ సంస్థ బ్లూమ్స్‌బరీతో పాటు దాని రచయితలకు భారీ మొత్తంలో పరిహారం అందనుంది.

అమెరికా కోర్టు గుర్తించిన వివరాల ప్రకారం, బ్లూమ్స్‌బరీ ప్రచురించిన మొత్తం 14,087 పుస్తకాలు ఈ సెటిల్‌మెంట్ పరిధిలోకి వచ్చాయి. ప్రపంచవ్యాప్తంగా విశేష ఆదరణ పొందిన జేకే రౌలింగ్ రాసిన ‘హ్యారీ పోటర్’ సిరీస్‌తో పాటు సారా జే మాస్, సుసన్నా క్లార్క్ తదితర ప్రముఖ రచయితల రచనలు కూడా ఇందులో ఉన్నాయి. అర్హత పొందిన ప్రతి పుస్తకానికి సగటున 3,000 డాలర్ల చొప్పున పరిహారం చెల్లించనున్నట్లు వెల్లడించారు.

న్యాయవాదుల ఫీజులు, కోర్టు ఖర్చుల కోసం సుమారు 10 శాతం మినహాయించిన తర్వాత మిగిలిన మొత్తాన్ని ప్రచురణ సంస్థలు, రచయితలు సమానంగా పంచుకోనున్నారు. ఈ ప్రక్రియలో బ్లూమ్స్‌బరీతో పాటు దాని రచయితల సమూహానికి సుమారు 19 మిలియన్ డాలర్లు (దాదాపు రూ.160 కోట్లు) అందనున్నాయి. ఈ చెల్లింపులు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ద్వితీయార్థం నుంచి విడతల వారీగా ప్రారంభమవుతాయని వెల్లడించారు.

ఈ కేసు 2024లో ప్రముఖ రచయిత్రి ఆండ్రియా బార్ట్జ్‌తో పాటు పలువురు రచయితలు దాఖలు చేసిన పిటిషన్‌తో ప్రారంభమైంది. యాంత్రోపిక్ అభివృద్ధి చేసిన ‘క్లాడ్’ ఏఐ చాట్‌బాట్‌కు శిక్షణ ఇచ్చేందుకు పైరేటెడ్ డిజిటల్ లైబ్రరీల నుంచి లక్షలాది కాపీరైట్ పుస్తకాలను అక్రమంగా డౌన్‌లోడ్ చేసి వినియోగించారని వారు ఆరోపించారు.

కేసును విచారించిన యూఎస్ డిస్ట్రిక్ట్ జడ్జి అరసెలి మార్టినెజ్-ఓల్గిన్, ఈ సెటిల్‌మెంట్ ద్వారా రచయితలు, ప్రచురణకర్తలకు తగిన న్యాయం జరిగిందని వ్యాఖ్యానించారు. మొత్తం 4.82 లక్షల పుస్తకాల పరిధిలో ఉన్న రచయితలు, ప్రచురణకర్తల్లో 91 శాతానికి పైగా ఇప్పటికే పరిహారం కోసం దరఖాస్తు చేసుకున్నట్లు యాంత్రోపిక్ ప్రతినిధులు కోర్టుకు తెలిపారు.

ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారాన్ని ఏఐ శిక్షణ కోసం వినియోగించడం ‘ఫెయిర్ యూజ్’ పరిధిలోకి వస్తుందని ఏఐ సంస్థలు వాదిస్తున్నప్పటికీ, కాపీరైట్ రక్షణ ఉన్న పుస్తకాలను అనుమతి లేకుండా ఉపయోగిస్తే చట్టపరమైన పరిణామాలు తప్పవని ఈ సెటిల్‌మెంట్ స్పష్టం చేసింది. ఇప్పటికే ఓపెన్‌ఏఐ, మెటా వంటి ఇతర ప్రముఖ ఏఐ సంస్థలపై కూడా ఇలాంటి కాపీరైట్ కేసులు వివిధ కోర్టుల్లో విచారణలో ఉండటంతో, ఈ పరిణామం ప్రపంచవ్యాప్తంగా ఏఐ పరిశ్రమ, ప్రచురణ రంగం, కాపీరైట్ చట్టాల అమలుపై కీలక ప్రభావం చూపే అవకాశం ఉందని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.