Mahaa Daily Exclusive

  కూటమి ధర్మమే జనసేన బలం.

Share

• కార్యకర్తలే పార్టీ అసలైన మీడియా.
• రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి, జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్.

విజయవాడ, మహా.
రాష్ట్ర ప్రయోజనాల కోసం కూటమి ధర్మానికి కట్టుబడి పనిచేయడం వల్లే ప్రజల విశ్వాసాన్ని సంపాదించగలిగామని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి, జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ అన్నారు. శుక్రవారం విజయవాడలోని తూర్పు, సెంట్రల్, పశ్చిమ నియోజకవర్గాల జనసేన నాయకులు, కార్యకర్తలతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన పాల్గొని పార్టీ బలోపేతం, భవిష్యత్ కార్యాచరణపై దిశానిర్దేశం చేశారు.

సాధారణ ఎన్నికల్లో రాష్ట్ర హితం కోసం కూటమి భాగస్వామ్య పక్షాలన్నీ సమన్వయంతో పనిచేశాయని నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. అందరూ కలిసి పనిచేయడం వల్లే ఈ రాజకీయ ప్రస్థానం విజయవంతంగా కొనసాగుతోందన్నారు. రాష్ట్ర విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్‌కు రావాల్సిన నిధులు పూర్తిస్థాయిలో అందక అన్యాయం జరిగిందని విమర్శించారు. పదవుల కోసం కాకుండా యువత, మహిళల్లో రాజకీయ చైతన్యం తీసుకురావాలనే లక్ష్యంతోనే పవన్ కల్యాణ్ జనసేన పార్టీని స్థాపించారని చెప్పారు.

విజయవాడ ఉద్యమాలకు, రాజకీయ చైతన్యానికి చిరునామా అని మంత్రి పేర్కొన్నారు. రాష్ట్ర, జాతీయ రాజకీయాల్లో విజయవాడ నాయకులకు ప్రత్యేక గుర్తింపు ఉందన్నారు. వైసీపీ ప్రభుత్వం మూడు రాజధానుల ప్రతిపాదన తీసుకొచ్చినప్పుడు ప్రజల తరఫున ఉద్యమించిన పార్టీ జనసేనేనని అన్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం పార్టీ నిరంతరం పోరాడిందని, గత స్థానిక సంస్థల ఎన్నికల్లో క్లిష్ట పరిస్థితుల్లోనూ జనసైనికులు, వీర మహిళలు ధైర్యంగా పోటీ చేశారని కొనియాడారు. విజయవాడ కార్పొరేషన్‌లో 34 డివిజన్లలో పోటీ చేసి పార్టీ జెండాను ఎగురవేశారని గుర్తుచేశారు.

జనసేన ఎప్పుడూ స్వార్థ రాజకీయాలను ప్రోత్సహించలేదని, భవిష్యత్తులో కూడా ఆ దిశగా అడుగులు వేయదని నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కష్టపడి పనిచేసే కార్యకర్తలను గుర్తించి తగిన ప్రాధాన్యం కల్పిస్తామని హామీ ఇచ్చారు. నాయకులు కార్యకర్తల అభిప్రాయాలను గౌరవించాలని, ప్రతి నియోజకవర్గంలో తరచూ సమావేశాలు నిర్వహించి సమన్వయంతో ముందుకు సాగాలని సూచించారు. పార్టీలో విభేదాలకు తావివ్వకుండా ప్రతి ఒక్కరూ పవన్ కల్యాణ్ నాయకత్వంలో ఐక్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు.

కూటమి భాగస్వామ్య పక్షాలతో కలిసి పనిచేయడం ప్రస్తుత అవసరమని, అభిప్రాయ భేదాలు ఉంటే పరస్పర చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని మంత్రి సూచించారు. ‘జనవాణి’ కార్యక్రమం ద్వారా ప్రజల సమస్యలను పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నామని, ఈ కార్యక్రమాన్ని అన్ని నియోజకవర్గాలకు విస్తరించాలని అన్నారు. సోషల్ మీడియాలో జరుగుతున్న అసత్య ప్రచారాన్ని వాస్తవాలతో తిప్పికొట్టాలని, పార్టీకి ప్రత్యేక మీడియా సంస్థలు లేకపోయినా కార్యకర్తలే జనసేనకు అసలైన బలమని, వారే పార్టీ సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు.

పంచాయతీరాజ్ శాఖ పనితీరుతో దేశవ్యాప్తంగా గుర్తింపు లభించిందని నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. విజయవాడలోని 64 డివిజన్లలో జనసేనను మరింత బలోపేతం చేయాలని నాయకులకు సూచించారు. కేవలం బీఫాం తీసుకుని పోటీ చేయడం మాత్రమే కాకుండా కూటమి భాగస్వాములతో సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగాలని అన్నారు. ఏ స్థానాల్లో జనసేన పోటీ చేయాలనే తుది నిర్ణయం పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ తీసుకుంటారని స్పష్టం చేశారు. త్వరలోనే అన్ని ప్రాంతాల్లో పార్టీ కమిటీలను ప్రకటిస్తామని, గత ఎన్నికల ఫలితాలను విశ్లేషించి కొత్త కార్యాచరణతో ముందుకు సాగాలని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు.