అమ్రోహా (ఉత్తరప్రదేశ్), మహా.
ఉత్తరప్రదేశ్‌లో ముగ్గురు అక్కాచెల్లెళ్లు ఒకే యువకుడిని వివాహం చేసుకున్న ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. చిన్నప్పటి నుంచి కలిసి పెరిగిన తాము విడివిడిగా జీవించలేమనే కారణంతో ముగ్గురూ ఒకే వ్యక్తిని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. వివాహానికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. అయితే, ఈ వివాహం చట్టబద్ధతపై న్యాయ నిపుణులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.
అమ్రోహా జిల్లా హసన్‌పూర్ మండలం ధతురియా గ్రామానికి చెందిన సరోజ్ (20), సావిత్రి రాణి (19), వారి బంధువు సంతోష్ ఖడక్‌వన్షీ (18) చిన్ననాటి నుంచి కలిసి పెరిగారు. కొంతకాలంగా ముగ్గురూ కలిసి సామాజిక మాధ్యమాల కోసం వీడియోలు రూపొందిస్తూ మంచి గుర్తింపు పొందారు. ఈ వీడియోలకు శ్యాంపురి గ్రామానికి చెందిన వికాస్ ఖడక్‌వంశీ అలియాస్ విక్కీ (20) గత ఆరు నెలలుగా కెమెరామెన్‌గా పనిచేస్తున్నాడు. పలువురు వీడియోల్లో అతడు భర్త పాత్రలో కూడా నటించాడు.
ఇటీవల ముగ్గురు యువతులకు విడివిడిగా వివాహాలు చేయాలని కుటుంబ సభ్యులు సంబంధాలు చూడడం ప్రారంభించారు. దీంతో చిన్నప్పటి నుంచి కలిసి ఉన్న తాము విడిపోవడం ఇష్టం లేక ముగ్గురూ కలిసి విక్కీని వివాహం చేసుకోవాలని నిర్ణయించారు. తమ నిర్ణయాన్ని యువకుడికి తెలియజేయగా అతడు కూడా అంగీకరించినట్లు సమాచారం. అనంతరం స్థానిక చాముండి మాత ఆలయంలో ముగ్గురూ విక్కీతో వివాహం చేసుకున్నారు. ఆ వివాహానికి సంబంధించిన వీడియోను సామాజిక మాధ్యమాల్లో పంచుకోవడంతో గంటల వ్యవధిలోనే వైరల్‌గా మారింది. అయితే, ఈ వివాహానికి ఇరు కుటుంబాల పెద్దలు హాజరుకాలేదని స్థానికంగా ప్రచారం జరుగుతోంది.
ఈ ఘటనపై న్యాయవాదులు స్పందిస్తూ, హిందూ వివాహ చట్టం ప్రకారం ఒకే సమయంలో ఒక వ్యక్తి ఒకరికి మించి భార్యలను కలిగి ఉండేందుకు చట్టబద్ధ అనుమతి లేదని పేర్కొన్నారు. అలాంటి వివాహాలకు చట్టపరమైన గుర్తింపు ఉండదని అలహాబాద్ హైకోర్టు న్యాయవాది అనురాగ్ పాండే అభిప్రాయపడ్డారు.
మరోవైపు, హసన్‌పూర్ సర్కిల్ అధికారి పంకజ్ త్యాగి మాట్లాడుతూ, ఈ ఘటన తమ దృష్టికి వచ్చిందని, ప్రాథమిక విచారణ నిర్వహించినట్లు తెలిపారు. ముగ్గురు యువతులు తాము మేజర్లమని, స్వచ్ఛందంగానే ఈ వివాహం చేసుకున్నామని చెప్పినట్లు వెల్లడించారు. ఇప్పటివరకు ఈ ఘటనపై ఎలాంటి అధికారిక ఫిర్యాదు అందలేదని, కుటుంబ సభ్యులు కూడా అభ్యంతరం వ్యక్తం చేయలేదని చెప్పారు. ఒకవేళ అధికారిక ఫిర్యాదు అందితే చట్టప్రకారం తదుపరి చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.








