Mahaa Daily Exclusive

  వైజాగ్‌లో అదానీకి రూ.8,500 కోట్ల ప్రాజెక్టు. గ్రీన్ హైడ్రోజన్‌కు విద్యుత్ మౌలిక సదుపాయాలు.

Share

విశాఖపట్నం, మహా.
ఆంధ్రప్రదేశ్‌లో పారిశ్రామిక, హరిత ఇంధన రంగాల అభివృద్ధికి కీలకమైన మరో భారీ పెట్టుబడి దక్కింది. అదానీ ఎనర్జీ సొల్యూషన్స్ లిమిటెడ్ (ఏఈఎస్ఎల్‌) రాష్ట్రంలో రూ.8,500 కోట్ల విలువైన అంతర్‌రాష్ట్ర విద్యుత్ ప్రసార (ఇంటర్-స్టేట్ ట్రాన్స్‌మిషన్) ప్రాజెక్టును కైవసం చేసుకుంది. విశాఖపట్నం ప్రాంతంలో ప్రతిపాదిత గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ అమ్మోనియా ప్రాజెక్టులతో పాటు డేటా సెంటర్లు, డిజిటల్ మౌలిక సదుపాయాలకు అవసరమైన విద్యుత్ సరఫరా బలోపేతానికి ఈ ప్రాజెక్టు దోహదం చేయనుంది.

కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన టారిఫ్ ఆధారిత పోటీ బిడ్డింగ్ (టీబీసీబీ) ప్రక్రియలో అత్యల్ప ధరను కోట్ చేసిన అదానీ ఎనర్జీ ఈ ప్రాజెక్టును దక్కించుకుంది. ఒప్పందం ప్రకారం 30 నెలల్లోగా పనులను పూర్తి చేయాల్సి ఉంటుందని సంస్థ వెల్లడించింది. ‘వైజాగ్ పవర్ ట్రాన్స్‌మిషన్ లిమిటెడ్’ పేరుతో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రయోజన సంస్థ (ఎస్‌పీవీ) ద్వారా ఈ ప్రాజెక్టును అమలు చేయనున్నారు.

ఈ ప్రాజెక్టు ద్వారా విశాఖ ప్రాంతంలో అభివృద్ధి చెందుతున్న గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ అమ్మోనియా పరిశ్రమలకు అవసరమైన సుమారు 4,500 మెగావాట్ల విద్యుత్ డిమాండ్‌ను తీర్చే లక్ష్యంతో ప్రసార వ్యవస్థను అభివృద్ధి చేయనున్నారు. అలాగే పెందుర్తి–విశాఖపట్నం ప్రాంతంలో వేగంగా విస్తరిస్తున్న కృత్రిమ మేధస్సు (ఏఐ) ఆధారిత డేటా సెంటర్లు, హైపర్‌స్కేల్ డిజిటల్ మౌలిక సదుపాయాలు, సబ్‌సీ కనెక్టివిటీ, లాజిస్టిక్స్ రంగాలకు కూడా ఈ ప్రాజెక్టు కీలకంగా మారనుంది.

ప్రాజెక్టుపై స్పందించిన అదానీ ఎనర్జీ సొల్యూషన్స్ సీఈఓ కందర్ప్ పటేల్, దేశ పారిశ్రామికాభివృద్ధికి అవసరమైన విద్యుత్ మౌలిక సదుపాయాల విస్తరణలో ఇది కీలక ముందడుగని పేర్కొన్నారు. ఏపీలో హరిత ఇంధన పరిశ్రమల విస్తరణకు మద్దతు ఇవ్వడంతో పాటు డిజిటల్ ఆర్థిక వ్యవస్థకు అవసరమైన విద్యుత్ గ్రిడ్ సామర్థ్యాన్ని ఈ ప్రాజెక్టు మరింత బలోపేతం చేస్తుందని తెలిపారు.

ఈ ప్రాజెక్టు పూర్తయితే అదానీ ఎనర్జీ నెట్‌వర్క్‌కు అదనంగా 1,582 సర్క్యూట్ కిలోమీటర్ల ట్రాన్స్‌మిషన్ లైన్లు, 10,500 ఎంవీఏ ట్రాన్స్‌ఫర్మేషన్ సామర్థ్యం జతకానుంది. దీంతో సంస్థ మొత్తం ట్రాన్స్‌మిషన్ నెట్‌వర్క్ 29,531 సర్క్యూట్ కిలోమీటర్లకు, ట్రాన్స్‌ఫర్మేషన్ సామర్థ్యం 1,33,675 ఎంవీఏకు పెరుగుతుందని కంపెనీ వెల్లడించింది. ప్రస్తుతం దేశంలోనే అతిపెద్ద ప్రైవేట్ విద్యుత్ ప్రసార సంస్థగా అదానీ ఎనర్జీ సొల్యూషన్స్ కొనసాగుతోంది.