Mahaa Daily Exclusive

  పుట్టినరోజైనా నిజాలు మాట్లాడాలి. కేటీఆర్‌పై మహేష్ కుమార్ గౌడ్ విమర్శలు.

Share

హైదరాబాద్, మహా.
బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ శుభాకాంక్షలు తెలుపుతూనే తీవ్ర విమర్శలు గుప్పించారు. పుట్టినరోజు సందర్భంగా అయినా ప్రజలకు నిజాలు చెప్పాలని సూచించిన ఆయన, నల్ల చొక్కాలు ధరించి నిరసనలు చేపట్టినంత మాత్రాన ప్రజలు నమ్మరని వ్యాఖ్యానించారు.

శుక్రవారం మీడియాతో మాట్లాడిన మహేష్ కుమార్ గౌడ్, కపట ప్రేమలు, నల్లచొక్కా రాజకీయాలు ఎక్కువకాలం సాగవని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనను రాజకీయంగా విమర్శించడం సమంజసం కాదని పేర్కొన్నారు. కొడంగల్‌లో నిర్వహించిన నిరసనలను ప్రస్తావిస్తూ బీఆర్‌ఎస్ తీరుపై విమర్శలు చేశారు.

విద్యార్థుల ఉద్యమాల విషయంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటివరకు ఒక్క ప్రకటన కూడా చేయలేదని ఆయన ఆరోపించారు. గతంలో ధర్నా చౌక్‌ను ఎత్తివేసిన కేసీఆర్ ప్రభుత్వంలో కీలకంగా ఉన్న కేటీఆర్ ఇప్పుడు అదే ధర్నా చౌక్‌లో నిరసనలు చేపట్టడం విరుద్ధ వైఖరికి నిదర్శనమని వ్యాఖ్యానించారు. ముందుగా ప్రజలకు క్షమాపణ చెప్పిన తర్వాతే ధర్నాలు చేస్తే బాగుంటుందని సూచించారు.

బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన మరణాలకు బాధ్యత వహిస్తూ, ఆ కాలంలో ప్రాణాలు కోల్పోయిన ప్రతి కుటుంబానికి బీఆర్‌ఎస్ పార్టీ ఖాతా నుంచి రూ.2 కోట్ల చొప్పున పరిహారం ఇవ్వాలని మహేష్ కుమార్ గౌడ్ డిమాండ్ చేశారు. 27 మంది విద్యార్థుల మరణాలకు గ్లోబరీనా సంస్థ కారణమని ఆరోపిస్తూ, 2011లో జరిగిన ఘటనకు సంబంధించిన నివేదికను ఎందుకు వెల్లడించలేదని ప్రశ్నించారు. గ్లోబరీనా వ్యవహారంపై కేటీఆర్ స్వయంగా విచారణ కోరాలని, ప్రభుత్వం విచారణ చేపడితే కక్షసాధింపు అని ఆరోపించడం సరికాదన్నారు.

బీఆర్‌ఎస్ పాలనలో ప్రశ్నపత్రాల లీకేజీ ఘటనలు చోటుచేసుకున్న విషయం అందరికీ తెలిసిందేనని ఆయన వ్యాఖ్యానించారు. ఇసుక వ్యాపారంలో జరిగిన అవకతవకల వల్ల అనేక మంది ప్రాణాలు కోల్పోయారని, దానికి కేటీఆర్ నైతిక బాధ్యత వహించాలని ఆరోపించారు. బీజేపీ, బీఆర్‌ఎస్ వేర్వేరు పార్టీలు కావని, రెండు పార్టీల మధ్య సన్నిహిత సంబంధాలు ఉన్నాయని చెప్పడానికి అనేక కారణాలు ఉన్నాయని మహేష్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు.