Mahaa Daily Exclusive

  గిరిజన బడులకు పక్కా భవనాలు. ప్రభుత్వ పాఠశాలలకు పూర్వ వైభవం – నారా లోకేశ్.

Share

రంపచోడవరం, మహా.
రాష్ట్రంలోని గిరిజన ప్రాంతాల్లో సొంత భవనాలు లేని అన్ని ప్రభుత్వ పాఠశాలలకు వచ్చే ఏడాదిలోగా పక్కా భవనాలు నిర్మించి, శిథిలావస్థలో ఉన్న విద్యాసంస్థలను ఆధునికీకరిస్తామని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్ ప్రకటించారు. ప్రభుత్వ పాఠశాలలపై ప్రజల్లో విశ్వాసం పెరగడంతో ఈ విద్యా సంవత్సరంలోనే 1.10 లక్షల మంది విద్యార్థులు ప్రైవేట్ పాఠశాలల నుంచి ప్రభుత్వ బడుల్లో చేరారని తెలిపారు.

పోలవరం జిల్లా రంపచోడవరం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో కలిసి నిర్వహించిన మెగా పేరెంట్–టీచర్ సమావేశంలో మంత్రి లోకేశ్ మాట్లాడారు. గత రెండేళ్లుగా విద్యారంగంలో చేపట్టిన సంస్కరణల ఫలితంగానే ప్రభుత్వ పాఠశాలల ముందు ‘నో అడ్మిషన్’ బోర్డులు కనిపిస్తున్నాయని, ఇది ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థుల సమష్టి కృషికి నిదర్శనమని కొనియాడారు. ప్రభుత్వ పాఠశాలలకు వారే నిజమైన బ్రాండ్ అంబాసిడర్లని పేర్కొన్నారు.

విద్యాశాఖ బాధ్యతలు చేపట్టినప్పుడు ప్రభుత్వ పాఠశాలలకు పూర్వ వైభవం తీసుకొస్తానని ఇచ్చిన హామీని నిలబెట్టుకునే దిశగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని లోకేశ్ తెలిపారు. ‘తల్లికి వందనం’ పథకాన్ని గత ప్రభుత్వానికి భిన్నంగా ఇంట్లో చదువుతున్న ప్రతి విద్యార్థికి వర్తింపజేస్తున్నామని చెప్పారు. 2025లో 67.27 లక్షల మంది విద్యార్థులకు రూ.10,090 కోట్లు, 2026లో 67.47 లక్షల మందికి రూ.10,120 కోట్ల ఆర్థిక సాయం అందించినట్లు వివరించారు.

విద్యా ప్రమాణాల మెరుగుదలకు మెగా డీఎస్సీ ద్వారా 16 వేల ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసినట్లు మంత్రి తెలిపారు. పారదర్శక ఉపాధ్యాయ బదిలీల విధానాన్ని అమలు చేస్తున్నామని, డొక్కా సీతమ్మ పేరుతో ప్రాంతీయ రుచులకు అనుగుణంగా మధ్యాహ్న భోజన పథకాన్ని నిర్వహిస్తున్నామని చెప్పారు. త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా స్మార్ట్ కిచెన్లు ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ పేరుతో విద్యార్థులకు కిట్లు అందజేస్తున్నామని, సమగ్ర వికాసం కోసం ప్రతి శనివారం ‘నో బ్యాగ్ డే’ అమలు చేస్తున్నట్లు తెలిపారు. ఇంటర్ విద్యార్థులకు కూడా స్టూడెంట్ కిట్లు, మధ్యాహ్న భోజన పథకాన్ని విస్తరించినట్లు పేర్కొన్నారు.

విలువలతో కూడిన విద్యను అందించడమే ప్రభుత్వ లక్ష్యమని లోకేశ్ స్పష్టం చేశారు. ఈ క్రమంలో ప్రముఖ ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావును విద్యా సలహాదారుగా నియమించామని చెప్పారు. మహిళలను కించపరిచే చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని హెచ్చరించారు. ప్రతి గొప్ప వ్యక్తి వెనుక తల్లి, గురువు పాత్ర కీలకమని గుర్తుచేస్తూ, విద్యార్థులు సాధించే విజయాలే తన పనితీరుకు నిజమైన నివేదిక అని వ్యాఖ్యానించారు. ఈ ఏడాది పదో తరగతి, ఇంటర్ ఫలితాల్లో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు సాధించిన విజయాలు విద్యారంగ సంస్కరణలకు నిదర్శనమని పేర్కొంటూ, రాష్ట్ర భవిష్యత్తు కోసం అందరూ కలిసి ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.