- డిజిటల్ ప్లాట్ ఫాంలలో పోస్ట్ చేయడంపై ఆంక్షలు
- విచారణ వీడియోలను ఎడిట్ చేసి పోస్ట్ చేయడంపై అభ్యంతరం
- కేంద్రం, సోషల్ మీడియా సంస్థలకు నోటీసులు
న్యూఢిల్లీ, మహా : ముందస్తు అనుమతి లేకుండా కోర్టు విచారణలకు సంబంధించిన ఆడియో, వీడియో రికార్డింగ్‌లను సోషల్ మీడియాలో లేదా డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలో పోస్ట్ చేయడంపై సుప్రీంకోర్టు శుక్రవారం ఆంక్షలు విధించింది. అయితే ఈ ఉత్తర్వులు వార్తా సేకరణపై ఎలాంటి ప్రభావం చూపవని ధర్మాసనం స్పష్టం చేసింది. కోర్టు విచారణల వీడియోలను క్లిప్ చేసి, ఎడిట్ చేస్తూ సోషల్ మీడియా వేదికగా వినోదం కోసం ఉపయోగించడం, వాటి ద్వారా ఆదాయం పొందడం పై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ముందస్తు అనుమతి లేకుండా న్యాయస్థానాల ఆడియో, వీడియో రికార్డింగ్‌లను సోషల్ మీడియా లేదా డిజిటల్ ఫ్లాట్‌ఫామ్‌లలో అప్‌లోడ్ చేయడం, రీ-పోస్ట్ చేయడం లేదా ప్రచారం చేయడాన్ని నిషేధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్య కాంత్, జస్టిస్ జోయ్‌మాల్య బాగ్చీ, జస్టిస్ వి. మోహనలతో కూడిన ధర్మాసనం ఈ మేరకు కీలక ఆదేశాలు ఇచ్చింది. “సంబంధిత హైకోర్టుల రిజిస్ట్రార్ జనరల్ లేదా సుప్రీంకోర్టు సెక్రటరీ జనరల్ ముందస్తు అనుమతి లేకుండా న్యాయపరమైన విచారణల ఆడియో/వీడియో రికార్డింగ్‌లను ఎలాంటి డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలోనూ ఎక్స్‌ట్రాక్ట్ చేయడం, సవరించడం, పోస్ట్ చేయడం, అప్‌లోడ్ చేయడం లేదా వాటి ద్వారా ఆదాయం పొందే ప్రయత్నం చేయడం నిషేధించడమైనది” అని ధర్మాసనం స్పష్టం చేసింది. అయితే, ఈ నిషేధ ఉత్తర్వులు జర్నలిస్టులు జరిపే సాధారణ వార్తా సేకరణకు వర్తించవని కోర్టు స్పష్టం చేసింది.
కోర్టులు వినోద ఛానెళ్లు కావు: సుప్రీంకోర్టు
జర్నలిస్ట్ హర్షితా గ్రోవర్ దాఖలు చేసిన ప్రజాప్రయోజన పిటిషన్ విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ఈ ఉత్తర్వులు జారీ చేసింది. పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది వికాస్ సింగ్ వాదనలు వినిపిస్తూ, కోర్టు విచారణల్లోని కొన్ని భాగాలను మాత్రమే కట్ చేసి వైరల్ చేయడం ద్వారా న్యాయవ్యవస్థను ప్రజల ముందు నవ్వులపాలు చేస్తున్నారని తెలిపారు.
ఈ వాదనతో సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ఏకీభవించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ ఉపయోగించి న్యాయమూర్తులు, న్యాయవాదుల స్వరాలను, పెదవుల కదలికలను మార్చివేసే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. విచారణ సందర్భంగా జస్టిస్ జోయ్‌మాల్య బాగ్చీ కీలక వ్యాఖ్యలు చేశారు. “డిజిటల్ ప్రపంచంలో డేటాను నియంత్రించడం అతిపెద్ద సవాలుగా మారింది. లైవ్ స్ట్రీమింగ్‌ను పరిమితం చేయాలి. న్యాయస్థానాలు 24 గంటలూ ప్రసారమయ్యే వినోద ఛానెళ్లు కావు” అని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వంతో పాటు అన్ని హైకోర్టులకు, మెటా, ఎక్స్ వంటి ప్రముఖ సోషల్ మీడియా సంస్థలకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ పిటిషన్ పరిపరిష్కారానికి సంబంధించి ఏ నోడల్ మంత్రిత్వ శాఖలు పనిచేయాలో వివరిస్తూ ఒక ప్రతిపాదనను కోర్టు ముందుంచాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. అలాగే ప్రత్యక్ష ప్రసారాల నిబంధనల అమలు, వాటి వల్ల కలుగుతున్న ప్రభావంపై నివేదికలు ఇవ్వాలని హైకోర్టులను ఆదేశించింది.








