Mahaa Daily Exclusive

  గోరక్షణకు చట్టాలు పటిష్ఠంగా అమలు చేయాలి….

Share

గోరక్షణకు చట్టాలు పటిష్ఠంగా అమలు చేయాలి.
• గోమాత హైందవ ధర్మానికి ప్రాతిపదిక.
• బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్‌రావు

హైదరాబాద్, మహా.
హైందవ ధర్మంలో గోమాతకు అత్యున్నత స్థానం ఉందని, గోరక్షణకు సంబంధించిన చట్టాలను రాష్ట్ర ప్రభుత్వం కఠినంగా అమలు చేయాలని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్‌రావు కోరారు. ఎల్‌బీనగర్‌లోని బైరమల్‌గూడ శ్రీ హనుమాన్ గోశాలను శుక్రవారం సందర్శించిన ఆయన, గోవధ నిరోధక చట్టాన్ని పటిష్ఠంగా అమలు చేయాల్సిన అవసరం ఉందన్నారు.

ఈ సందర్భంగా రాంచందర్‌రావు మాట్లాడుతూ, భారతీయ సంస్కృతి, హైందవ ధర్మంలో గోమాతకు విశిష్టమైన స్థానం ఉందన్నారు. పాలు, పాడి ఉత్పత్తులు, సహజ సిద్ధమైన ఎరువుల ద్వారా గోమాత మానవాళి సంక్షేమానికి నిరంతరం సేవలందిస్తోందని, అందువల్ల గోమాతను సంరక్షించడం, గౌరవించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు.

పాశ్చాత్య సంస్కృతి ప్రభావంతో కొందరు గోవులను అవమానించేలా, గోహత్యలను ప్రోత్సహించేలా వ్యవహరిస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గోవులను రక్షించడం ద్వారా సమాజానికి మేలు జరుగుతుందనే అవగాహన ప్రతి ఒక్కరిలో పెరగాలని పిలుపునిచ్చారు.

రాష్ట్రంలో గోవధ నిరోధక చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేసి గోహత్యలను పూర్తిగా అరికట్టేందుకు ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని రాంచందర్‌రావు కోరారు. గోరక్షణలో ప్రభుత్వం మాత్రమే కాకుండా సమాజంలోని ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆయన విజ్ఞప్తి చేశారు.