*కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి*
*నీట్ పేపర్ లీకేజీని నిరసిస్తూ జిల్లాలో కాంగ్రెస్ ధర్నా*
*మోదీ కూడా బాధ్యత వహించాలన్న అయూబ్*
వరంగల్, మహా ;
నీట్ పరీక్ష ప్రశ్నా పత్రాల లీకేజీని నిరసిస్తూ, దానికి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, ప్రధాని నరేంద్ర మోదీ కూడా వెంటనే రాజీనామా చేయాలని వరంగల్ జిల్లా డిసిసి అధ్యక్షుడు మహమ్మద్ అయూబ్ డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు వరంగల్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు మహమ్మద్ అయూబ్ ఆధ్వర్యంలో జిల్లాలోని పర్వతగిరి మండల కేంద్రంలోని అంబేద్కర్ సెంటర్ వద్ద భారీ ధర్నా నిర్వహించి ప్రధాని నరేంద్ర మోడీ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ నిరసనలో వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే, విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా అయూబ్ కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. “లక్షలాది విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడిన కేంద్రం తక్షణమే సమాధానం చెప్పాలని, అంతేకాకుండా పేపర్ లీకేజీకి బాధ్యత వహిస్తూ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి” అని మహమ్మద్ అయూబ్ డిమాండ్ చేశారు.
నీట్ పరీక్షలో జరిగిన అవకతవకల పై సీబీఐ విచారణ జరిపి దోషులను కఠినంగా శిక్షించాలని, లక్షల మంది విద్యార్థులకు తిరిగి పరీక్ష నిర్వహించాలని కోరారు.








