ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి కేసులో కీలక మలుపు.
• రెండు రోజుల పోలీసు కస్టడీకి కోర్టు అనుమతి.
• ఉమెన్ సేఫ్టీ వింగ్ విచారణ.
హైదరాబాద్, మహా.
హైదరాబాద్‌లోని అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన ట్రైనీ ఐపీఎస్ అధికారి ఉదయ్ కృష్ణారెడ్డి కేసు దర్యాప్తు కీలక దశకు చేరుకుంది. నిందితుడిని రెండు రోజుల పాటు పోలీసు కస్టడీకి ఇవ్వాలంటూ అత్తాపూర్ పోలీసులు దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు ఆమోదించింది. దీంతో గురు, శుక్రవారాల్లో ఉదయ్ కృష్ణారెడ్డిని పోలీసులు కస్టడీలోకి తీసుకుని విస్తృతంగా విచారించనున్నారు. ఈ విచారణలో ఉమెన్ సేఫ్టీ వింగ్ అధికారులు కూడా పాల్గొని కీలక ఆధారాలు సేకరించనున్నట్లు సమాచారం. కస్టడీ విచారణ పూర్తయిన అనంతరం నిందితుడిని తిరిగి కోర్టులో హాజరుపరచనున్నారు.
ఈ కేసు హైదరాబాద్‌లోని నేషనల్ పోలీస్ అకాడమీలో శిక్షణ పొందుతున్న ఓ మహిళా ట్రైనీ ఐపీఎస్ అధికారిణి ఫిర్యాదు ఆధారంగా నమోదైంది. తనను లైంగికంగా వేధించడంతో పాటు అసభ్యకరమైన సందేశాలు పంపారని, మొబైల్ ఫోన్ లాక్కొని పాస్‌వర్డ్ చెప్పాలని బెదిరించారని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఫిర్యాదు మేరకు అత్తాపూర్ పోలీసులు ఉదయ్ కృష్ణారెడ్డిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
అయితే తనపై వచ్చిన ఆరోపణలను ఉదయ్ కృష్ణారెడ్డి పూర్తిగా ఖండించారు. అవన్నీ నిరాధార ఆరోపణలేనని, చట్టం, న్యాయవ్యవస్థపై తనకు పూర్తి విశ్వాసం ఉందని సామాజిక మాధ్యమం ద్వారా వెల్లడించారు. ఈ పరిణామాల అనంతరం మోతీనగర్‌లోని బంధువుల ఇంట్లో అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చేరిన ఆయన చికిత్స అనంతరం డిశ్చార్జ్ అయ్యారు.
కేసు దర్యాప్తులో భాగంగా నోటీసులు అందించేందుకు పోలీసులు ప్రయత్నించినప్పటికీ, ఆయన అందుబాటులోకి రాకపోవడంతో పాటు మొబైల్ ఫోన్ కూడా స్విచ్ఛాఫ్‌లో ఉండటంతో నాలుగు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చేపట్టారు. అనంతరం ఉదయ్ కృష్ణారెడ్డిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచగా, న్యాయస్థానం ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించింది.
తాజాగా లభించిన రెండు రోజుల పోలీసు కస్టడీతో కేసులో మరిన్ని కీలక అంశాలు వెలుగులోకి వచ్చే అవకాశముందని దర్యాప్తు అధికారులు భావిస్తున్నారు. విచారణలో లభించే ఆధారాల ఆధారంగా తదుపరి చర్యలు తీసుకునే అవకాశం ఉంది.








