Mahaa Daily Exclusive

  ఎయిరిండియాకు కొత్త సారథి….

Share

ఎయిరిండియాకు కొత్త సారథి.
* సీఈవోగా టెవోల్డే గెబ్రెమరియమ్.
* భారీ నష్టాల వేళ కీలక నిర్ణయం.
* వృద్ధి, లాభాలే లక్ష్యంగా టాటా గ్రూప్ అడుగు.

ఢిల్లీ, మహా.

టాటా గ్రూప్‌కు చెందిన ఎయిరిండియాలో కీలక నాయకత్వ మార్పు చోటుచేసుకుంది. సంస్థ కొత్త చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈవో), మేనేజింగ్ డైరెక్టర్‌గా ఇథియోపియన్ ఎయిర్‌లైన్స్ మాజీ సీఈవో టెవోల్డే గెబ్రెమరియమ్‌ను నియమిస్తున్నట్లు సంస్థ ప్రకటించింది. ప్రస్తుతం సీఈవోగా ఉన్న క్యాంప్‌బెల్ విల్సన్ స్థానంలో ఆయన బాధ్యతలు స్వీకరించనున్నారు. భారీ ఆర్థిక నష్టాలు, విమాన కార్యకలాపాలపై ప్రభావం చూపిన అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో ఈ నియామకం ప్రాధాన్యం సంతరించుకుంది.

గత కొంతకాలంగా ఎయిరిండియా పునర్వ్యవస్థీకరణ ప్రక్రియలో పలు సవాళ్లను ఎదుర్కొంటోంది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో సంస్థ 2.8 బిలియన్ డాలర్లు (సుమారు రూ.23 వేల కోట్లు) నష్టాన్ని నమోదు చేసింది. పాకిస్థాన్ గగనతలం మూసివేత, మధ్యప్రాచ్య ఉద్రిక్తతల కారణంగా అంతర్జాతీయ విమాన సర్వీసులపై ప్రతికూల ప్రభావం పడగా, పలు విమానాలను రద్దు చేయాల్సి వచ్చింది. దీంతో సంస్థ పునరుద్ధరణ ప్రణాళికలు కూడా మందగించాయి.

టెవోల్డే గెబ్రెమరియమ్‌కు అంతర్జాతీయ విమానయాన రంగంలో విశేష అనుభవం ఉంది. ఆయన ఇథియోపియన్ ఎయిర్‌లైన్స్‌కు దశాబ్దానికి పైగా సీఈవోగా సేవలందిస్తూ, ఆ సంస్థను ఆఫ్రికాలోనే అతిపెద్ద, అత్యంత లాభదాయక విమానయాన సంస్థగా తీర్చిదిద్దారు. ఆయన నాయకత్వంలో సంస్థ ఆదాయం నాలుగు రెట్లు పెరగడంతో పాటు విమానాల సంఖ్య మూడు రెట్లు పెరిగింది. అంతర్జాతీయ హబ్‌ల అభివృద్ధి, నిర్వహణ, మరమ్మతుల మౌలిక వసతుల విస్తరణ, కార్యకలాపాల సమర్థ నిర్వహణలో ఆయనకు ఉన్న నైపుణ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఎయిరిండియా బోర్డు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.

టాటా సన్స్, ఎయిరిండియా ఛైర్మన్ ఎన్. చంద్రశేఖరన్ మాట్లాడుతూ, సంస్థలో స్థిరీకరణ, విలీన ప్రక్రియలు పూర్తయ్యాయని, ఇప్పుడు వృద్ధి, విస్తరణ దశలోకి అడుగుపెడుతోందన్నారు. ఈ దశలో గెబ్రెమరియమ్ అనుభవం ఎయిరిండియాను ప్రపంచ స్థాయి విమానయాన సంస్థగా తీర్చిదిద్దడంలో కీలక పాత్ర పోషిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు.

2022లో టాటా గ్రూప్ ఎయిరిండియాను స్వాధీనం చేసుకున్న అనంతరం సింగపూర్ ఎయిర్‌లైన్స్ మాజీ అధికారి క్యాంప్‌బెల్ విల్సన్‌ను సీఈవోగా నియమించింది. విలీన ప్రక్రియలను విజయవంతంగా పూర్తి చేయడం, భారీ విమానాల కొనుగోలు ఒప్పందాలను ముందుకు తీసుకెళ్లడంలో ఆయన అందించిన సేవలను బోర్డు ప్రశంసించింది. ఇకపై గెబ్రెమరియమ్ నాయకత్వంలో ఎయిరిండియా పునరుద్ధరణతో పాటు లాభదాయకత, అంతర్జాతీయ విస్తరణపై మరింత దృష్టి సారించనుంది.