Mahaa Daily Exclusive

  నకిలీ ఫైర్ ఎన్‌ఓసీల వ్యవహారంలో కొత్త మలుపు….

Share

నకిలీ ఫైర్ ఎన్‌ఓసీల వ్యవహారంలో కొత్త మలుపు.
• మరో 48 కాలేజీల జాబితా పోలీసులకు.
• 56 ఇంటర్ కళాశాలల్లో అక్రమాల గుర్తింపు.

హైదరాబాద్, మహా.

రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఇంటర్మీడియట్ కళాశాలల నకిలీ ఫైర్ ఎన్‌ఓసీల వ్యవహారంలో దర్యాప్తు మరింత వేగం పుంజుకుంది. హైడ్రా అధికారులు తాజాగా మరో 48 కళాశాలలకు సంబంధించిన వివరాలను పోలీసులకు అందజేశారు. ఇప్పటికే 56 ఇంటర్ కళాశాలలు నకిలీ ఫైర్ ఎన్‌ఓసీలు సమర్పించినట్లు అధికారులు గుర్తించగా, మరో 176 కళాశాలలకు సంబంధించిన పత్రాలను కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు.

దర్యాప్తులో ఒకే నమూనాలో నకిలీ ఫైర్ ఎన్‌ఓసీ ధ్రువపత్రాలు రూపొందించినట్లు అధికారులు గుర్తించారు. ఐదు అంతస్తులలోపు భవనాలకు హైడ్రా ఆఫ్‌లైన్ విధానంలో ఫైర్ ఎన్‌ఓసీలు జారీ చేస్తుండటాన్ని ఆసరాగా చేసుకుని కొందరు కళాశాలల యాజమాన్యాలు అక్రమాలకు పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

విచారణలో వెలుగులోకి వచ్చిన వివరాల ప్రకారం, హైడ్రాకు ఎలాంటి దరఖాస్తు చేయకుండానే నకిలీ ఫైర్ ఎన్‌ఓసీలు సృష్టించి వాటిని ఇంటర్మీడియట్ బోర్డుకు సమర్పించినట్లు గుర్తించారు. ఈ నకిలీ ధ్రువపత్రాల కోసం ఒక్కో కళాశాల యాజమాన్యం రూ.6 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు ఖర్చు చేసినట్లు ప్రాథమిక విచారణలో తేలినట్లు సమాచారం.

అంతేకాకుండా జీహెచ్‌ఎంసీ, హైడ్రా, అగ్నిమాపక శాఖ మాజీ డీజీల సంతకాలను ఫోర్జరీ చేసి నకిలీ ధ్రువపత్రాలు తయారు చేసినట్లు అధికారులు గుర్తించారు. ఈ అక్రమాల వెనుక ఒక వ్యవస్థీకృత నెట్‌వర్క్ పనిచేసినట్లు అనుమానిస్తున్న పోలీసులు, సంబంధిత కళాశాలల యాజమాన్యాలను విచారిస్తే మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు.

హైడ్రా సమర్పించిన నివేదిక, ఇప్పటివరకు సేకరించిన ఆధారాల ఆధారంగా నకిలీ ఫైర్ ఎన్‌ఓసీలు సమర్పించిన కళాశాలల యాజమాన్యాలపై క్రిమినల్ కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకునేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు. దర్యాప్తు కొనసాగుతున్న నేపథ్యంలో ఈ అక్రమాల పరిమాణం మరింత విస్తరించే అవకాశముందని అధికార వర్గాలు వెల్లడిస్తున్నాయి.