Mahaa Daily Exclusive

  భారతదేశంలో డాక్టర్ల కంటే ఎన్జీవోలే ఎక్కువ..! వైరల్ అవుతున్న ఈ విషయం లో నిజమెంత?

Share

భారతదేశంలో డాక్టర్ల కంటే ఎన్జీవోలే ఎక్కువ..! వైరల్ అవుతున్న ఈ విషయం లో నిజమెంత?
భారతదేశంలో ప్రజల ప్రాణాలు కాపాడే వైద్యుల కంటే, స్వచ్ఛంద సంస్థల సంఖ్యే ఎక్కువగా ఉందని ఈమధ్య సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ అవుతున్న విషయం, ఒక ఆసక్తికరమైన వాదన తెరపైకి వచ్చింది. ఈ వాదన నిజమా కాదా అనే విశ్లేషణ ఇది.

ప్రతి 10 లక్షల జనాభాకు డాక్టర్లు 931 ఉండగా, ప్రతి 10 లక్షల జనాభాకు NGOలు‌ 2357 గా ఉన్నాయి. 2015లో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సుప్రీంకోర్టులో దాఖలు చేసిన ఒక అఫిడవిట్ ప్రకారం, భారతదేశంలోని 26 రాష్ట్రాల్లో సుమారు 31 లక్షలకు పైగా అంటే 3.1 మిలియన్లు నమోదైన NGOలు ఉన్నాయి. ఆనాటి భారతదేశ జనాభా లెక్కల ప్రకారం చూస్తే, 31 లక్షల ఎన్జీవోలను జనాభాతో భాగిస్తే ప్రతి పది లక్షల మందికి 2,357 ఎన్జీవోలు ఉన్నట్లు స్పష్టమవుతుంది.

డిసెంబర్ 2013 నాటి రికార్డుల ప్రకారం, దేశంలోని వివిధ స్టేట్ మెడికల్ కౌన్సిల్స్‌లో నమోదైన అల్లోపతి అంటే ఎంబిబిఎస్ వైద్యుల సంఖ్య 9,18,303. దీని ప్రకారం చూస్తే ప్రతి మిలియన్ జనాభాకు దాదాపు 931 డాక్టర్లు ఉన్నారన్నది కచ్చితమైన అంచనా.

వైద్యులు మరియు ఎన్జీవోలకు సంబంధించిన పరిస్థితులు, ప్రభుత్వ నిబంధనలలో కాలక్రమేణా అనేక మార్పులు వచ్చాయి. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో, నీతి ఆయోగ్ లు వెల్లడించిన తాజా సమాచారం జూలై 2026 నాటికి ఈ విధంగా ఉంది.. కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం, ఇండియన్ మెడికల్ రిజిస్టర్ లో ప్రస్తుతం మొత్తం 15 లక్షల 35 వేల 155 మంది అల్లోపతి డాక్టర్లు నమోదై ఉన్నారు. వీరితో పాటు ఆయుష్ అంటే – ఆయుర్వేద, యోగా, యునానీ, సిద్ధ, హోమియోపతి విధానంలో 7 లక్షల 51 వేల 768 మంది రిజిస్టర్డ్ ప్రాక్టీషనర్లు కూడా ఉన్నారు. నమోదైన వైద్యులలో 80% మంది ప్రజలకు అందుబాటులో ఉన్నారని పరిగణనలోకి తీసుకుంటే, దేశంలో డాక్టర్ మరియు జనాభా నిష్పత్తి 1:778 కి మెరుగుపడింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఒ) సూచించిన 1:1000 అంటే వెయ్యి మందికి ఒక డాక్టర్ నిష్పత్తి కంటే ప్రస్తుతం భారతదేశంలో డాక్టర్ల లభ్యత మరింత మెరుగ్గా ఉండటం గమనార్హం.

లక్షలాదిగా ఉన్న ఎన్జీవోల వ్యవహారాల్లో పారదర్శకత, జవాబుదారీతనం తీసుకురావడానికి భారత ప్రభుత్వం ‘నీతి ఆయోగ్’ ఆధ్వర్యంలో ఎన్జీవో దర్పణ్ అనే ప్రత్యేక పోర్టల్ ను ప్రారంభించింది. ప్రభుత్వ గ్రాంట్లు, కేంద్ర ప్రభుత్వ పథకాల నిధులు, లేదా మంత్రిత్వ శాఖల సహకారం పొందడానికి ఏ స్వచ్ఛంద సంస్థ అయినా ముందుగా ఎన్జీవో దర్పణ్ లో తప్పనిసరిగా నమోదు చేసుకుని తీరాలి. ఇలా నమోదు చేసుకోవడం ద్వారా కేంద్ర ప్రభుత్వం దేశంలోని యాక్టివ్ ఎన్జీవోల అధికారిక జాతీయ డేటాబేస్ ను నిర్వహిస్తోంది మరియు ప్రతి సంస్థకు ఒక ప్రత్యేకమైన గుర్తింపు సంఖ్య అంటే దర్పణ్ యూనిక్ ఐడి కేటాయించడం ద్వారా నిధుల దుర్వినియోగాన్ని అరికడుతోంది.

గత దశాబ్దపు డేటాను పరిశీలిస్తే, “భారతదేశంలో డాక్టర్ల కంటే ఎన్జీవోలే ఎక్కువ” అని ఆ విషయంలో పేర్కొన్న వాదన సీబీఐ రికార్డుల ప్రకారం కచ్చితమైన వాస్తవమే. అయితే, ఇటీవలి కాలంలో మెడికల్ సీట్ల పెంపుతో డాక్టర్ల సంఖ్య గణనీయంగా మెరుగుపడింది, అలాగే దేశంలో ఉన్న ఎన్జీవోల జవాబుదారీతనాన్ని పెంచేందుకు ప్రభుత్వ నియంత్రణ కూడా కఠినతరం చేయబడింది.

(శివకుమార్ గనివాడ, సీనియర్ సోషల్ అనలిస్ట్)

Latest