హెచ్-1బీ ఉద్యోగులకు భారీ షాక్?
* 60 రోజుల గ్రేస్ పీరియడ్‌పై అమెరికా కీలక ప్రతిపాదన.
* ఉద్యోగం పోతే కొత్త ఉద్యోగం వెతుక్కునే గడువు తగ్గే అవకాశం.
* ఇంకా తుది నిర్ణయం తీసుకోని అమెరికా ప్రభుత్వం.
వాషింగ్టన్:మహా.
అమెరికాలో హెచ్-1బీ వీసాపై పనిచేస్తున్న విదేశీ నిపుణులకు కీలకమైన 60 రోజుల గ్రేస్ పీరియడ్‌ను తొలగించే ప్రతిపాదనపై అమెరికా హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ విభాగం పరిశీలన జరుపుతున్నట్లు సమాచారం. ఉద్యోగం కోల్పోయిన తర్వాత కొత్త ఉద్యోగం వెతుక్కోవడానికి లేదా మరో ఇమ్మిగ్రేషన్ మార్గాన్ని ఎంచుకోవడానికి ప్రస్తుతం లభిస్తున్న గరిష్ఠంగా 60 రోజుల వ్యవధిని రద్దు చేసే అంశం ఆఫీస్ ఆఫ్ మేనేజ్‌మెంట్ అండ్ బడ్జెట్ సమీక్షలో ఉన్నట్లు వార్తలు వెలువడుతున్నాయి.
ప్రస్తుతం హెచ్-1బీ ఉద్యోగి ఉద్యోగాన్ని కోల్పోతే, నిబంధనలకు అనుగుణంగా గరిష్ఠంగా 60 రోజుల వరకు అమెరికాలో ఉండేందుకు అవకాశం ఉంది. ఈ వ్యవధిలో కొత్త సంస్థను వెతుక్కోవడంతో పాటు, కొత్త యజమాని ద్వారా హెచ్-1బీ పిటిషన్ దాఖలు చేయించుకోవచ్చు. కొన్ని సందర్భాల్లో మరో నాన్‌ఇమ్మిగ్రెంట్ స్టేటస్‌కు మారేందుకు కూడా ఈ సమయం ఉపయోగపడుతుంది. ఈ 60 రోజుల గ్రేస్ పీరియడ్ నిబంధన 8 CFR 214.1(l)(2)లో ఉంది.
ఈ గ్రేస్ పీరియడ్‌ను తొలగించే ప్రతిపాదన అమల్లోకి వస్తే ఉద్యోగం కోల్పోయిన విదేశీ నిపుణులపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. ముఖ్యంగా కొత్త ఉద్యోగం వెతుక్కోవడం, కొత్త యజమాని ద్వారా పిటిషన్ దాఖలు చేయించడం వంటి ప్రక్రియలకు అందుబాటులో ఉండే సమయం గణనీయంగా తగ్గవచ్చు. హెచ్-1బీతో పాటు ఎల్-1, ఓ-1, ఈ-1, ఈ-2, ఈ-3, హెచ్-1బీ1, టీఎన్ వంటి ఇతర ఉద్యోగ ఆధారిత నాన్‌ఇమ్మిగ్రెంట్ వీసా వర్గాలపైనా మార్పు ప్రభావం చూపే అవకాశం ఉందని సమాచారం.
భారతీయ నిపుణులపై ప్రభావం
అమెరికా హెచ్-1బీ వీసా కార్యక్రమంలో భారతీయులు అతిపెద్ద వాటా కలిగిన వర్గాల్లో ఒకరు. దీంతో గ్రేస్ పీరియడ్‌పై ఏదైనా మార్పు వస్తే భారతీయ టెక్ నిపుణులు, ఇతర వృత్తి నిపుణులపై ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఉద్యోగం కోల్పోయినవారు తక్కువ వ్యవధిలోనే కొత్త స్పాన్సర్‌ను కనుగొనడం లేదా తమ ఇమ్మిగ్రేషన్ స్టేటస్‌కు ప్రత్యామ్నాయ మార్గాన్ని ఎంచుకోవాల్సి రావచ్చు.
అయితే 60 రోజుల గ్రేస్ పీరియడ్ ప్రస్తుతం రద్దు కాలేదు. ఇది ఇప్పటికీ అమల్లో ఉన్న నిబంధనే. అమెరికా ప్రభుత్వం కొత్త నిబంధన తీసుకురావాలంటే సాధారణంగా అధికారిక రూల్‌మేకింగ్ ప్రక్రియను అనుసరించాల్సి ఉంటుంది. USCIS గతంలో కూడా ఈ 60 రోజుల వ్యవధి నియంత్రణ నిబంధనల్లోనే ఉన్నందున మార్పు చేయాలంటే ప్రత్యేక రెగ్యులేటరీ ప్రక్రియ అవసరమని స్పష్టం చేసింది.
ప్రతిపాదన అధికారికంగా ముందుకు వెళితే ఫెడరల్ రిజిస్టర్‌లో నోటీసు ప్రచురణ, ప్రజల నుంచి అభిప్రాయాల స్వీకరణ తదితర దశలు ఉంటాయి. ఆ ప్రక్రియ పూర్తయి తుది నిబంధన వెలువడే వరకు ప్రస్తుత 60 రోజుల గ్రేస్ పీరియడ్ కొనసాగుతుంది. అందువల్ల ప్రస్తుతం హెచ్-1బీ ఉద్యోగులు 60 రోజుల గడువు తొలగిపోయిందని భావించాల్సిన అవసరం లేదు.







