Mahaa Daily Exclusive

  సుజ్లాన్ విండ్ ఎనర్జీ ప్రాజెక్టులకు లోకేష్ శంకుస్థాపన..! రూ.10 వేల కోట్ల పెట్టుబడితో 4 వేల మందికి పైగా ఉపాధి..

Share

  • రూ.10 వేల కోట్ల పెట్టుబడితో 4 వేల మందికి పైగా ఉపాధి
  • సుజ్లాన్ భాగస్వామ్యంతో 12 వేల మంది యువతకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ

రాయదుర్గం, మహా
పునరుత్పాదక ఇంధన రంగంలో ఆంధ్రప్రదేశ్‌ను దేశంలోనే అగ్రగామిగా నిలబెట్టడమే లక్ష్యమని, సుజ్లాన్ పవన విద్యుత్ ప్రాజెక్టులు ఈ ప్రయాణంలో ఒక నూతన అధ్యాయానికి నాంది పలుకుతున్నాయని రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ అన్నారు. మంగళవారం అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గం, కణేకల్లు మండలం హులికెర వద్ద సుజ్లాన్ విండ్ ఎనర్జీ ప్రాజెక్టులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో లోకేష్ మాట్లాడుతూ.. సుజ్లాన్‌తో ఏపీకి ఉన్న రెండు దశాబ్దాల బంధం పునరుద్ధరణ కావడం సంతోషంగా ఉందన్నారు. స్వచ్ఛ ఇంధనం ప్రపంచ ప్రాధాన్యతగా మారకముందే దానిపై నమ్మకం ఉంచి, దేశ ఇంధన స్వావలంబనకు పునాదులు వేసిన దివంగత తులసి తంతిని ఈ సందర్భంగా స్మరించుకోవాలని లోకేశ్ అన్నారు. ఆయన దార్శనికతకు అనంతపురంలోనే బలమైన పునాది పడిందని గుర్తుచేశారు. భారత పవన విద్యుత్ రంగాన్ని ప్రపంచ పటంలో నిలిపిన సంస్థ సుజ్లాన్ అని కొనియాడారు. ఎన్నో క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొన్నప్పటికీ, నిబద్ధతతో కూడిన సంస్కృతితో సుజ్లాన్ సంస్థ నిలదొక్కుకుందని ప్రశంసించారు. గత ఐదేళ్లలో (2019-24) రాష్ట్రంలో పవన విద్యుత్ రంగం పూర్తిగా నిలిచిపోయిందని, కేవలం 6 మెగావాట్ల సామర్థ్యం మాత్రమే అదనంగా చేరిందని లోకేశ్ విమర్శించారు. నేడు ఒక్క అనంతపురంలోనే సుజ్లాన్ యూనిట్‌కు ఏటా 1,260 మెగావాట్ల తయారీ సామర్థ్యం ఉందని, ఇక్కడ ప్రత్యక్షంగా 1,200 మందికి ఉపాధి లభిస్తోందని, వారిలో 70 శాతానికి పైగా స్థానికులేనని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా సుజ్లాన్ ఇప్పటికే 2 వేలకు పైగా గ్రీన్ ఉద్యోగాలు సృష్టించిందని వివరించారు. ప్రస్తుతం శంకుస్థాపన చేసిన ప్రాజెక్టుల ద్వారా 1,325 మెగావాట్ల పునరుత్పాదక ఇంధన సామర్థ్యం అందుబాటులోకి వస్తుందని మంత్రి తెలిపారు. దీని కోసం సుమారు రూ.10 వేల కోట్ల పెట్టుబడి వస్తుండగా, ప్రత్యక్షంగా, పరోక్షంగా 4 వేలకు పైగా ఉద్యోగాలు లభిస్తాయని చెప్పారు.

Latest