Mahaa Daily Exclusive

  సుస్మిత వ్యాఖ్యలతో మాకు సంబంధం లేదు..:కొండా మురళి..

Share

• కాంగ్రెస్‌లోనే కొనసాగుతా.
• భట్టి విక్రమార్కతో ఎలాంటి చర్చ జరగలేదు.
• కొండా మురళి

వరంగల్‌, మహా.

సుస్మితా పటేల్‌ చేసిన వ్యాఖ్యలతో తమకు ఎలాంటి సంబంధం లేదని కాంగ్రెస్‌ నేత కొండా మురళి స్పష్టం చేశారు. ఆమె తన అభిప్రాయాలను స్వతంత్రంగా వ్యక్తం చేసే హక్కు ఉందని, ఆమె వ్యాఖ్యలను ప్రశ్నించే హక్కు తమకు లేదని అన్నారు. సుస్మిత తనకు నచ్చిన విధంగా తన అభిప్రాయాలను వెల్లడించారని, ఎవరి అభిప్రాయాలు వారికి ఉంటాయని పేర్కొన్నారు. ఆమె చేసిన వ్యాఖ్యలు పూర్తిగా వ్యక్తిగతమైనవేనని స్పష్టం చేశారు.

సుస్మిత చేసిన వ్యాఖ్యలపై ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో తాను ఎలాంటి చర్చ జరపలేదని కొండా మురళి తెలిపారు. ‘‘మా బిడ్డ చేసిన వ్యాఖ్యలతో మాకేం సంబంధం?’’ అని వ్యాఖ్యానించారు. పార్టీ కమిటీకి చెప్పాల్సిన విషయాలన్నింటినీ ఇప్పటికే వివరించామని, ఈ విషయంలో తమ వైపు నుంచి చెప్పాల్సింది ఏమీ లేదని పేర్కొన్నారు. తాను కాంగ్రెస్‌ పార్టీలోనే కొనసాగుతానని ఆయన తేల్చిచెప్పారు.

పరకాలలో కొండా సురేఖ జన్మదిన వేడుకల సందర్భంగా సుస్మితా పటేల్‌ చేసిన వ్యాఖ్యలు తెలంగాణ కాంగ్రెస్‌లో రాజకీయ ప్రకంపనలు రేపుతున్న నేపథ్యంలో కొండా మురళి తాజా వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమయ్యారని సుస్మిత విమర్శించడంతో పాటు, పరకాల అసెంబ్లీ టికెట్‌ను రేవూరి ప్రకాశ్‌రెడ్డికి ఎలా ప్రకటిస్తారని ప్రశ్నించారు. తనకు టికెట్ ఇవ్వకపోతే స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తానని ప్రకటించడం పార్టీలో చర్చకు దారితీసింది.

సుస్మిత వ్యాఖ్యలను తెలంగాణ కాంగ్రెస్‌ క్రమశిక్షణ కమిటీ తీవ్రంగా పరిగణించింది. ఆమెపై చర్యలు తీసుకునే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు సంకేతాలు ఇచ్చింది. అంతేకాకుండా ఆమె వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని పీసీసీ కొండా సురేఖను కోరాలని నిర్ణయించింది. అయితే సుస్మిత వ్యాఖ్యలు ఆమె వ్యక్తిగత అభిప్రాయాలని కొండా సురేఖ ఇప్పటికే స్పష్టం చేశారు. తాజాగా కొండా మురళి కూడా అదే వైఖరిని వెల్లడించడంతో ఈ వ్యవహారంలో కొండా కుటుంబం పార్టీ అధిష్ఠానానికి తమ రాజకీయ వైఖరిని స్పష్టంగా తెలియజేసినట్లయింది.

సుస్మిత వ్యాఖ్యలపై పార్టీ అంతర్గతంగా చర్చ కొనసాగుతున్నప్పటికీ, తాను మాత్రం కాంగ్రెస్‌ను వీడే ప్రసక్తే లేదని కొండా మురళి స్పష్టం చేయడం రాజకీయంగా ఆసక్తికరంగా మారింది. పరకాల టికెట్‌ అంశం, సుస్మిత చేసిన వ్యాఖ్యలు, పార్టీ క్రమశిక్షణ కమిటీ స్పందన నేపథ్యంలో కాంగ్రెస్‌లో ఈ వ్యవహారం ఎలాంటి మలుపు తిరుగుతుందన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

Latest