Mahaa Daily Exclusive

  పాత శివాలయ అభివృద్ధికి అండగా ఉంటా.:ఎంపీ కేశినేని శివనాథ్..

Share

• ఆటోనగర్‌ సమస్యలను ఐలానే పరిష్కరించాలి.
• ఎంపీ కేశినేని శివనాథ్

విజయవాడ, మహా .

విజయవాడలోని శ్రీ భ్రమరాంబ మల్లేశ్వర స్వామి వారి దేవస్థానం (పాత శివాలయం)కు ఎంతో చారిత్రక, ఆధ్యాత్మిక ప్రాధాన్యం ఉందని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) అన్నారు. ఆలయ అభివృద్ధికి తనవంతు సహాయ సహకారాలు అందిస్తానని హామీ ఇచ్చారు. బుధవారం పాత శివాలయం నూతన ధర్మకర్తల ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. టీడీపీ పశ్చిమ నియోజకవర్గ ఇన్‌చార్జి బుద్ధా వెంకన్న, నాగుల్‌మీరా, జనసేన నాయకుడు అమ్మిశెట్టి వాసు, ఎన్టీఆర్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

విజయవాడ నగర అభివృద్ధి క్రమంలో పాత శివాలయానికి ప్రత్యేక స్థానం ఉందని కేశినేని శివనాథ్ పేర్కొన్నారు. ఈ ఆలయం వెలసిన అనంతరం విజయవాడ అభివృద్ధి మరింత వేగం పుంజుకుందని గుర్తుచేశారు. దేశ, రాష్ట్రాల నుంచి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అవసరమైన మౌలిక వసతులు కల్పించడంపై నూతన ధర్మకర్తల మండలి ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ఆలయానికి వచ్చే భక్తులకు అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరారు. నూతన ధర్మకర్తల మండలి చైర్మన్, సభ్యులకు ఎంపీ శుభాకాంక్షలు తెలిపారు.

ఆటోనగర్‌ అభివృద్ధికి ఐలా కీలకం

అనంతరం విజయవాడ ఆటోనగర్‌ ఐలా నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవంలో ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, బుద్ధా వెంకన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ ఆటోనగర్‌ ఐలా నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరు కావడం ఆనందంగా ఉందన్నారు. సుమారు లక్ష మంది కార్మికులు నివసించే ఈ ప్రాంతంలో ఐలా కీలక పాత్ర పోషిస్తోందని తెలిపారు.

గత ఐలా కమిటీ ఆధ్వర్యంలో ఆటోనగర్‌లో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారని చెప్పారు. గత రెండేళ్లుగా ఐలా ఎన్నికలు నిర్వహించాలని కోరుతూ పోరాటం చేశామని, అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఎన్నికల నిర్వహణ కోసం నిరంతరం కృషి చేశామని వివరించారు. ఐలా ఎన్నికలు నిర్వహించాలంటే కలెక్షన్లు 60 శాతానికి పైగా ఉండాలని అధికారులు నిర్దేశించారని, అందరూ సమన్వయంతో పనిచేసి ఆ లక్ష్యాన్ని సాధించడంతో ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించుకోగలిగామని తెలిపారు.

ప్రశాంత వాతావరణంలో జరిగిన ఎన్నికల్లో విజయం సాధించిన నూతన కార్యవర్గ సభ్యులకు కేశినేని శివనాథ్ అభినందనలు తెలిపారు. అధ్యక్షుడిగా శివనాగేశ్వరరావు, వైస్‌చైర్మన్‌గా దుర్గాప్రసాద్, జనరల్‌ సెక్రటరీగా కలామ్‌తో పాటు కార్యవర్గ సభ్యులుగా ఎన్నికైన వారందరూ ఆటోనగర్‌ అభివృద్ధికి సమష్టిగా పనిచేయాలని సూచించారు.

ఆటోనగర్‌ సమస్యలు ఐలానే పరిష్కరించాలి

విజయవాడకు ఆటోనగర్‌ జీవనాడి వంటిదని ఎంపీ అన్నారు. ఈ ప్రాంతంలో రోడ్లు, డ్రైనేజీలు, తాగునీరు వంటి మౌలిక సమస్యలు ఉంటే వాటిని ఐలా ముందుండి పరిష్కరించేలా నూతన కార్యవర్గం పనిచేయాలని సూచించారు. ప్రజాప్రతినిధుల సహకారం అవసరమైన సందర్భాల్లో తమ దృష్టికి తీసుకొస్తే సమస్యల పరిష్కారానికి పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.

ఆటోనగర్‌లో మౌలిక వసతుల అభివృద్ధి కోసం సీఆర్‌డీఏలో పోరాడి మూడు రోడ్లకు టెండర్లు పూర్తి చేయించామని కేశినేని శివనాథ్ తెలిపారు. ఇప్పటికే ఆయా రోడ్ల పనులు కొనసాగుతున్నాయని చెప్పారు. నాలుగో రోడ్డును ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ఆధ్వర్యంలో ప్రారంభించారని, శక్తి కల్యాణ మండపం రోడ్డు కూడా సిద్ధమైందని వెల్లడించారు.

ఆటోనగర్‌కు 24 గంటలూ వాహనాల రాకపోకలు సులభంగా జరిగేలా, అదే సమయంలో విజయవాడ నగరంలో ట్రాఫిక్‌ సమస్యలు తలెత్తకుండా మౌలిక వసతులను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఇందుకోసం ప్రజాప్రతినిధులంతా సమన్వయంతో పనిచేస్తామని తెలిపారు. రాబోయే రోజుల్లో ఐలా మరింత విస్తృతంగా అభివృద్ధి చెందేలా కృషి చేస్తామని, సుమారు లక్ష మంది కార్మికులకు దిశానిర్దేశం చేసే శక్తివంతమైన సంస్థగా ఐలా ఎదగాలని ఎంపీ కేశినేని శివనాథ్ ఆకాంక్షించారు.

Latest