- ట్రాఫిక్ ఉల్లంఘనులకు పోలీసుల షాక్
- చలాన్లు కట్టకపోతే ఫాస్టాగ్ నుంచి డబ్బులు కట్
- హైదరాబాద్ పోలీసుల బిగ్ ప్లాన్!
హైదరాబాద్, మహా : రోడ్లపై ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించి ప్రయాణించే వాహనదారులకు భారీ షా్ ఇచ్చే దిశగా ట్రాఫిక్ పోలీసులు కీలక అడుగులు వేస్తున్నారు. వాహనాలపై పదుల సంఖ్యలో చలాన్లు, వేల రూపాయల పెండింగ్ ట్రాఫిక్ జరిమానాలు ఉన్నప్పటికీ కొంత మంది యథేచ్ఛగా ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడుతూనే ఉన్నారు. వాహనదారులను ట్రాఫిక్ రూల్స్ పాటించేలా చేసేందుకు చలాన్ ఫైన్లను భారీగా పెంచినప్పటికీ.. భారీగా బకాయిలు పెరిగిపోతున్నాయి తప్ప వాహనదారులు ట్రాఫిక్ ఉల్లంఘనల తీరు మాత్రం మారడం లేదు. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ నగర పరిధిలో ట్రాఫిక్ నిబంధనలను పాటించని.. ట్రాఫిక్ చలాన్లు చెల్లించని వారి జేబులకు చిల్లు వేసేందుకు ట్రాఫిక్ పోలీసులు రెడీ అయ్యారు. ఒక వాహనంపై ఉన్న ట్రాఫిక్ చలాన్ల మొత్తాన్ని ఆ వాహనం ఫాస్టాగ్ అకౌంట్ నుంచి కట్ చేసే ప్రతిపాదనలను పరిశీలిస్తున్నారు.
ప్రస్తుతం పెండింగ్‌లో ఉన్న ఈ-చలాన్ల వసూళ్లను సులభతరం చేయడంతో పాటు.. ట్రాఫిక్ ఉల్లంఘనలను తగ్గించేందుకు ఫాస్టాగ్‌తో చలాన్ల వ్యవస్థను అనుసంధానం చేయాలని అధికారులు భావిస్తున్నారు. ఈ విధానం అమల్లోకి వస్తే ట్రాఫిక్ ఉల్లంఘనలకు విధించే జరిమానాను సంబంధిత వాహనదారుడి ఫాస్టాగ్ ఖాతా నుంచి ఆటోమేటిక్‌గా మినహాయించే అవకాశం ఉంటుంది. దీనివల్ల వాహనదారులు మరింత జాగ్రత్తగా ట్రాఫిక్ రూల్స్ పాటిస్తారని పోలీసులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ (ఎస్‌సీఎస్‌సీ) వార్షికోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న సైబరాబాద్ ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ సన్‌ప్రీత్ సింగ్.. ఈ ప్రతిపాదనకు సంబంధించిన వివరాలను వెల్లడించారు.
ఫాస్టాగ్ ద్వారా ట్రాఫిక్ చలాన్ల వసూలు చేసే అంశంపై హెచ్‌ఎండీఏ అధికారులతో చర్చలు జరుపుతున్నట్లు సన్‌ప్రీత్ సింగ్ తెలిపారు. అయితే ఈ విధానం అమలుకు సంబంధించిన తుది నిర్ణయం, నిబంధనలు, సాంకేతిక అనుసంధానంపై ఇంకా అధికారిక స్పష్టత రావాల్సి ఉంది. ప్రస్తుతం హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఉల్లంఘనలను కెమెరాలు, ఇతర టెక్నాలజీ వ్యవస్థల ద్వారా గుర్తించి వాహనాలకు ఈ-చలాన్లను జారీ చేస్తున్నారు. అయితే చాలామంది వాహనదారులు జరిమానాలను చెల్లించకుండా ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉంచుతున్నారని పోలీసులు గుర్తించారు. దీంతో చలాన్ల వసూళ్ల కోసం ప్రత్యేక చర్యలు చేపట్టాల్సి వస్తోంది.
ఈ నేపథ్యంలో ఫాస్టాగ్ వ్యవస్థతో ట్రాఫిక్ ఈ-చలాన్లను అనుసంధానం చేస్తే జరిమానా విధించిన తర్వాత నిర్దేశిత నిబంధనల ప్రకారం మొత్తాన్ని ఆటోమేటిక్‌గా వసూలు చేసే అవకాశం ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. దీనివల్ల పెండింగ్ చలాన్ల సంఖ్య తగ్గడంతో పాటు, ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించే ముందు వాహనదారులు మరింత అప్రమత్తంగా వ్యవహరించే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఫాస్టాగ్ అనేది ప్రధానంగా ఫోర్ వీల్స్, ఆపైన భారీ వాహనాలకు మాత్రమే ఉంటుంది. కానీ బైక్‌లు, ఆటోలు వంటి వాహనాలకు ఫాస్టాగ్ ఉండదు. ఈ నేపథ్యంలోనే ఆ వాహనాలకు ఈ విధానం ఎలా వర్తిస్తుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అలాగే ట్రాఫిక్ చలాన్ మొత్తాన్ని ఎప్పుడు కట్ చేస్తారు.. వాహనదారులకు ముందుగా సమాచారం ఇస్తారా తప్పుగా విధించిన చలాన్లపై అప్పీల్ చేసే అవకాశం ఉంటుందా వంటి అంశాలపై స్పష్టమైన మార్గదర్శకాలు రావాల్సి ఉంది. హైదరాబాద్‌లో పెరుగుతున్న వాహనాల సంఖ్య, ట్రాఫిక్ రద్దీ, అక్రమ పార్కింగ్, రోడ్డు ప్రమాదాలను దృష్టిలో ఉంచుకుని సాంకేతిక పరిజ్ఞానాన్ని మరింత విస్తృతంగా వినియోగించాలని అధికారులు భావిస్తున్నారు. ప్రజా రవాణాను బలోపేతం చేయడం, లాస్ట్‌మైల్ కనెక్టివిటీని మెరుగుపరచడం, ప్రధాన ప్రాంతాల్లో మల్టీ లెవల్ పార్కింగ్ సదుపాయాలను పెంచడం వంటి చర్యలు కూడా అవసరమని సన్‌ప్రీత్ సింగ్ సూచించారు.








