Mahaa Daily Exclusive

  సీఎం రేవంత్ రెడ్డి నివాసానికి వెళ్లిన మంత్రి సురేఖ..!

Share

  • సీతక్కతో కలిసి రేవంత్‌కు రాఖీ కట్టిన కొండా సురేఖ
  • పండగ వేళ రాజకీయాల గురించి మాట్లాడనన్న మంత్రి

హైదరాబాద్, మహా : మంత్రి కొండా సురేఖ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసానికి వెళ్లారు. రాఖీ పండగ సందర్భంగా మంత్రి సురేఖ, మరో మంత్రి సీతక్కతో కలిసి సీఎం రేవంత్‌రెడ్డికి రాఖీ కట్టారు. అనంతరం ఏమీ మాట్లాడకుండానే రేవంత్ నివాసం నుంచి వెళ్లిపోయారు కొండా సురేఖ. తన కుమార్తె సుస్మిత వ్యాఖ్యలు, పరకాల వివాదం తర్వాత తొలిసారి సీఎం నివాసానికి వెళ్లడంతో చర్చనీయాంశమైంది. మంత్రి సురేఖ ముఖ్యమంత్రి నివాసం నుంచి వచ్చిన తర్వాత మీడియాతో మాట్లాడారు. ప్రతి ఏడాది మాదిరే ఈసారి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి రాఖీ కట్టానని తెలిపారు. సీఎం కోసం ప్రత్యేకంగా చేయించిన బంగారు రాఖీ కట్టానని.. సీఎం అల్లుడు, మనవడికి కూడా రాఖీ కట్టినట్లు తెలిపారు. అయితే తన కుమార్తె వ్యాఖ్యలు, పరకాల అంశంపై కొండా సురేఖ స్పందించలేదు.. పండగ రోజు రాజకీయ పరిణామాలపై మాట్లాడను అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆశీస్సులు మహిళలందరికి ఉండాలన్నారు. తాను అందరికి ఆడపడుచునని.. తనను వేరుగా చూడొద్దన్నారు మంత్రి కొండా సురేఖ.

సీఎం పరకాల పర్యటన తర్వాత కొండా సురేఖ కుమార్తె సుస్మిత నేరుగా ముఖ్యమంత్రిపై విమర్శలు, ఆరోపణలు చేయడం చర్చనీయాంశమైంది.. కాంగ్రెస్‌ అధిష్ఠానం ఈ అంశాన్ని సీరియస్‌గా తీసుకుంది. అనంతరం సుస్మిత వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని పీసీసీ క్రమశిక్షణా కమిటీ మంత్రి కొండా సురేఖకు నోటీసు ఇచ్చింది. మంత్రి కూడా తన కుమార్తె చేసిన ఆరోపణలకు తానెలా బాధ్యురాలినంటూ ఆ నోటీసుకు సమాధానం ఇచ్చారు. అయితే ఈ అంశంపై క్రమశిక్షణా కమిటీ రిపోర్ట్‌ ఇవ్వగా మంత్రి సురేఖపై చర్యలు తీసుకునే అవకాశం ఉందంటూ చర్చ జరుగుతోంది. ఈ పరిణామాల మధ్య సీఎం రేవంత్ రెడ్డి నివాసానికి మంత్రి కొండా సురేఖ వెళ్లడం ఆసక్తికరంగా మారింది.

Latest