Mahaa Daily Exclusive

  క్యూర్‌ పరిధిలో అత్యంత పారదర్శకంగా ఇందిరమ్మ టవర్స్‌ లక్కీడ్రా..! రెవెన్యూ, హౌసింగ్‌, స‌మాచార పౌర‌సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి..

Share

16 నియోజకవర్గాల్లో సుమారు 8 వేల ఫ్లాట్లకు లక్కీడ్రా

రోజుకు నాలుగు నియోజకవర్గాల చొప్పున ప్రక్రియ

పేదలకు రూపాయి ఖర్చు లేకుండా ఉచిత రిజిస్ట్రేషన్

రెవెన్యూ, హౌసింగ్‌, స‌మాచార పౌర‌సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి

హైదరాబాద్‌, మహా : హైదరాబాద్ మహానగరంలో నిరుపేదల సొంతింటి కలను నిజం చేస్తూ, వారి ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచే ఇందిరమ్మ టవర్స్ నిర్మాణానికి పారదర్శకంగా ల‌బ్దిదారుల ఎంపిక చేపడుతున్నట్లు రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. అర్హతే ప్రామాణికంగా, కులమతాలు , రాజకీయాలకు అతీతంగా లబ్ధిదారుల ఎంపిక జరుగుతోందని స్పష్టం చేశారు. క్యూర్ ప్రాంతంలో తొలి విడతగా చేపడుతున్న ఇందిరమ్మ టవర్స్‌లో ఫ్లాట్ల కేటాయింపునకు అత్యంత పారదర్శకంగా లక్కీడ్రా నిర్వహిస్తున్నామని తెలిపారు. మీడియా, అర్హులైన లబ్ధిదారుల సమక్షంలో లక్కీడ్రా నిర్వహిస్తూ, మొత్తం ప్రక్రియను అన్ని సామాజిక మాధ్యమాల ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నామని చెప్పారు. శుక్రవారం నాంపల్లి, కుత్బుల్లాపూర్‌, సికింద్రాబాద్‌, రాజేంద్రనగర్‌ అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఇందిరమ్మ టవర్స్‌ ఫ్లాట్ల కోసం లక్కీడ్రా నిర్వహించారు. నాంపల్లి నియోజకవర్గంలోని రెడ్‌హిల్స్‌లో నిర్మించనున్న ఇందిరమ్మ టవర్స్‌ ఫ్లాట్ల కేటాయింపునకు వెట్‌ గార్డెన్స్‌లో, రాజేంద్రనగర్‌ నియోజకవర్గంలోని మైలార్‌దేవుపల్లి పరిధికి సంబంధించి లక్ష్మీగూడలో నిర్వహించిన లక్కీడ్రా కార్యక్రమాల్లో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాల్గొని డ్రా తీశారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. నేటి నుంచి ఈ నెల 31వ తేదీ వరకు 16 అసెంబ్లీ నియోజకవర్గాల్లో సుమారు 8 వేల ఫ్లాట్లకు లక్కీడ్రా నిర్వహిస్తున్నామని తెలిపారు. రోజుకు నాలుగు నియోజకవర్గాల చొప్పున లక్కీడ్రా ప్రక్రియ కొనసాగుతుందని చెప్పారు. ప్రతి నియోజకవర్గంలో 480 ఫ్లాట్లకు 600 మంది లబ్ధిదారులను లక్కీడ్రా ద్వారా ఎంపిక చేస్తామని మంత్రి వివరించారు. అనంతరం అధికారులు క్షేత్రస్థాయిలో తుది పరిశీలన నిర్వహిస్తారని, ఎంపికైన వారిలో ఎవరైనా అనర్హులుగా తేలితే మిగిలిన 120 మందిలోని అర్హులకు అవకాశం కల్పిస్తామని చెప్పారు. ఈ విధానం ద్వారా అర్హులైన పేదలకు న్యాయం జరిగేలా చూస్తామని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఈ నెల 13న కూకట్‌పల్లి కేపీహెచ్‌బీ కాలనీలో ఇందిరమ్మ టవర్స్‌కు శంకుస్థాపన చేశారని, అనంతరం రికార్డు సమయంలోనే 16 నియోజకవర్గాల్లో ఇందిరమ్మ టవర్స్‌ నిర్మాణానికి టెండర్లు పిలవడం, మరోవైపు లబ్ధిదారుల ఎంపిక కోసం లక్కీడ్రా నిర్వహించడం రాష్ట్ర ప్రభుత్వానికి గొప్ప విజయమన్నారు. క్యూర్‌ పరిధిలో తొలి విడతగా లక్ష ఇళ్ల నిర్మాణాన్ని లక్ష్యంగా పెట్టుకుని ప్రభుత్వం ముందుకు సాగుతోందని తెలిపారు. మరో నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాల్లో స్థలాల గుర్తింపు ప్రక్రియ పూర్తయిందని, ఆయా నియోజకవర్గాల్లో ఇందిరమ్మ ఇళ్ల కోసం సెప్టెంబర్‌ 3వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరిస్తామని మంత్రి వెల్లడించారు.

కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడిన తొలి సంవత్సరంలోనే రాష్ట్రవ్యాప్తంగా తొలి విడతలో 4.50 లక్షల ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసిందని మంత్రి తెలిపారు. ఇప్పటికే 2 లక్షలకు పైగా ఇళ్ల నిర్మాణాలు పూర్తయ్యాయని చెప్పారు. ప్రతి ఇంటికి రాష్ట్ర ప్రభుత్వం రూ.5 లక్షల ఆర్థిక సహాయాన్ని నాలుగు విడతల్లో అందిస్తోందని, చివరి విడత బిల్లుల చెల్లింపులు కూడా ప్రారంభమయ్యాయని వివరించారు. రెండో విడతలో మరో 2.50 లక్షల ఇళ్లను మంజూరు చేసి, లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను వేగవంతం చేస్తున్నామని తెలిపారు. మరో పది రోజుల్లో రెండో విడత లబ్ధిదారుల ఎంపిక కూడా పూర్తయ్యే అవకాశం ఉందని మంత్రి పేర్కొన్నారు. ప్రభుత్వానికి డబ్బు కూడబెట్టుకోవడం కంటే పేదవాడి ఆత్మగౌరవానికి ప్రతీకగా సొంత ఇంటిని అందించడం ముఖ్యమని అన్నారు. ఎకరం రూ.100 కోట్లు, రూ.200 కోట్లు, రూ.300 కోట్లు విలువ చేసే ప్రాంతాల్లోనూ పేద కుటుంబాలు గౌరవంగా జీవించాలని మంత్రి స్పష్టం చేశారు.

Latest