Mahaa Daily Exclusive

  కేసీఆర్ పాలనకు, రేవంత్ పాలనకు తేడా లేదు..! సన్న బియ్యం కేంద్రం ఇస్తుంది..! ప్రధాని మోదీ ఫొటో ఎందుకు వేయడం లేదన్న ఎంపీ ఈటల

Share

  • కేసీఆర్ పాలనకు, రేవంత్ పాలనకు తేడా లేదు
  • సన్న బియ్యం కేంద్రం ఇస్తుంది
  • ప్రధాని మోదీ ఫొటో ఎందుకు వేయడం లేదన్న ఎంపీ ఈటల
  • కేంద్ర నిధుల వల్లే రాష్ట్రంలో రోడ్లు, రైల్వేలు అభివృద్ధి చెందుతున్నాయని వ్యాఖ్య

హైదరాబాద్, మహా : తెలంగాణలో గత కేసీఆర్ ప్రభుత్వ పాలనకు, ప్రస్తుత రేవంత్ రెడ్డి పాలనకు ఎలాంటి వ్యత్యాసం లేదని… ఈ పాలనతో రాష్ట్ర ప్రజలు పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డామని భావిస్తున్నారని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం ప్రజలకు ఐదు కిలోల సన్న బియ్యం ఉచితంగా ఇస్తున్నప్పటికీ ప్రధాని మోదీ ఫొటోను ఎక్కడా వేయడం లేదని… కానీ కాంగ్రెస్ నేతలు ఎవరి జాగీరని వారి ఫొటోలు వేసుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మల్కాజిగిరి లోక్ సభ పరిధిలోని పలు కాలనీల సమస్యలు, పెండింగ్ పనులపై సీఎస్ ను కలిసిన ఈటల మీడియాతో మాట్లాడారు. రాహుల్ గాంధీ విదేశాలకు వెళ్లి దేశంలో మత కల్లోలాలు జరుగుతున్నాయని ప్రచారం చేస్తున్నారని, గతంలో కాంగ్రెస్ హయాంలోనే లుంబిని పార్క్, గోకుల్ చాట్‌లలో బాంబు పేలుళ్లు జరిగాయని గుర్తు చేశారు. ఢిల్లీ వెళ్లినప్పుడు మోదీ ఆశీర్వాదం కావాలని కోరే సీఎం రేవంత్ ఇక్కడకు వచ్చాక మాత్రం విమర్శలు చేయడం ఆయన ద్వంద్వ విధానానికి నిదర్శనమన్నారు. కేంద్రం ఇచ్చే నిధుల వల్లే రాష్ట్రంలో రహదారులు, రైల్వేలు అభివృద్ధి చెందుతున్నాయని తెలిపారు.

ఇందిరమ్మ ఇండ్ల కమిటీలు వేసి, కాంగ్రెస్ నాయకులకు కేటాయించుకుంటున్నారని ఈటల మండిపడ్డారు. ‘ఇది మీ తాత జాగీరు కాదు’ అంటూ ఈటల మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం ఇళ్ల నిర్మాణాలు, మెట్రో ఫేజ్-1, ఫేజ్-2లకు తగిన సహాయం అందిస్తోందని స్పష్టం చేశారు. మల్కాజ్‌గిరి, మేడ్చల్ పరిధిలోని పలు రైల్వే గేట్ల వద్ద ఆర్‌వోబీ, ఆర్‌యూబీ నిర్మాణాల వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, ఈ అంశంపై సీఎస్‌ను కలిసి చర్చించానన్నారు. మేడ్చల్, మల్కాజ్‌గిరి స్టేషన్ల అభివృద్ధికి అమృత్ పథకం కింద కేంద్రం రూ.22 కోట్లు ఇస్తోందని ఈటల వెల్లడించారు.

మోదీ దేశానికి ప్రధాని కాబట్టే రాష్ట్రానికి ఇన్ని రహదారులు, రైల్వే అభివృద్ధికి నిధులు వచ్చాయని ఎంపీ ఈటల వివరించారు. రాష్ట్రాల అభివృద్ధిలోనే దేశాల అభివృద్ధి ఉందని మోదీ అంటారని గుర్తు చేశారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను కేంద్ర ప్రభుత్వం మాకెంటి ఇచ్చేదని అన్నారన్నారు. అలాగే ప్రధాని మోదీ ఏ ముఖం పెట్టుకుని వస్తున్నారని కేసీఆర్ ప్రశ్నించిన విషయాన్ని గుర్తు చేశారు. అసలు దేశ ప్రధాని మోదీని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కేర్ చేయలేదన్నారు. అలా చేయడం రాష్ట్రాలకు మంచిది కాదని.. అరిష్టమని ఆయన తెలిపారు. ఇందిరమ్మ ఇళ్లపై కేంద్రానికి ఎలాంటి వివక్షత లేదన్నారు. మూడు సంవత్సరాలలో రాష్ట్ర ప్రభుత్వం అడిగిన దాని కంటే రూ.100 కోట్లు అధికంగా కేంద్రం ఇచ్చిందన్నారు. మెట్రో ఫేజ్ -1, ఫేజ్ -2 కు కేంద్ర ప్రభుత్వం సహకారం అందిస్తుందని పేర్కొన్నారు. హైదరాబాద్ చుట్ట పక్కల గ్రామాలను కూడా కలిపారని చెప్పారు. కానీ వాటిని పట్టించుకోవట్లేదని విమర్శించారు.

Latest