Mahaa Daily Exclusive

  మైనారిటీలను ఓటు బ్యాంకుగా చూసిన కాంగ్రెస్‌..: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌. రామచందర్‌రావు…

Share

• సంక్షేమంతో సాధికారత కల్పించిన మోదీ ప్రభుత్వం.
• బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌. రామచందర్‌రావు.

మహబూబ్‌నగర్‌, మహా.
మైనారిటీలను కాంగ్రెస్‌ పార్టీ కేవలం ఓటు బ్యాంకుగా ఉపయోగించుకుందని, ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం సంక్షేమ పథకాల ద్వారా వారికి సాధికారత కల్పిస్తోందని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌. రామచందర్‌రావు అన్నారు. భారతదేశం భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీక అని, కులాలు, మతాలు వేరైనా భారతీయులుగా ఐక్యంగా జీవించడమే దేశ గొప్పతనమని పేర్కొన్నారు. మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రంలో నిర్వహించిన బీజేపీ రాష్ట్ర మైనారిటీ మోర్చా కార్యవర్గ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.
స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుంచి కాంగ్రెస్‌ పార్టీ ముస్లింలు, క్రైస్తవులు, సిక్కులు, జైనులను ఓటు బ్యాంకుగా ఉపయోగించుకుంటూ విభజన రాజకీయాలు చేసిందని రామచందర్‌రావు విమర్శించారు. బీజేపీ మాత్రం మతం, కులం ఆధారంగా వివక్ష లేకుండా అందరికీ సంక్షేమ ఫలాలు అందించే విధానాన్ని అనుసరిస్తోందన్నారు. ‘సబ్‌కా సాథ్‌, సబ్‌కా వికాస్‌, సబ్‌కా విశ్వాస్‌, సబ్‌కా ప్రయాస్‌’ నినాదంతో కేంద్ర ప్రభుత్వం ముందుకు సాగుతోందని తెలిపారు.
కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాల లబ్ధిదారుల్లో మైనారిటీ వర్గాలకు చెందిన వారి సంఖ్య గణనీయంగా ఉందని రామచందర్‌రావు పేర్కొన్నారు. ముద్రా, జన్‌ధన్‌, ఉజ్వల, ఉడాన్‌ వంటి పథకాల ద్వారా మైనారిటీ వర్గాలకు ప్రయోజనం కలుగుతోందన్నారు. విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు అందించడంతోపాటు ముస్లిం యువత సివిల్‌ సర్వీసెస్‌ పరీక్షల్లో రాణించేందుకు కేంద్రం ప్రోత్సాహం అందిస్తోందని తెలిపారు. విద్య, ఉపాధి, స్వయం ఉపాధి రంగాల్లో అవకాశాలు కల్పించడం ద్వారా మైనారిటీలను ఆర్థికంగా బలోపేతం చేయడమే కేంద్ర ప్రభుత్వ లక్ష్యమన్నారు.
పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)పై కాంగ్రెస్‌ పార్టీ ప్రజల్లో అపోహలు సృష్టించిందని రామచందర్‌రావు ఆరోపించారు. పొరుగు దేశాల్లో మతపరమైన వేధింపులకు గురై భారత్‌కు వచ్చిన కొన్ని మైనారిటీ వర్గాలకు పౌరసత్వం కల్పించేందుకు ఉద్దేశించిన చట్టమే సీఏఏ అని ఆయన వివరించారు. ఈ చట్టంపై తప్పుడు ప్రచారం చేసి దేశంలో ఆందోళనలకు కారణమయ్యేలా కాంగ్రెస్‌ ప్రయత్నించిందని విమర్శించారు. అంతర్జాతీయంగా భారత్‌ ప్రతిష్ఠను దెబ్బతీసేందుకు కూడా ఈ అంశాన్ని రాజకీయంగా ఉపయోగించుకున్నారని ఆరోపించారు.
దేశ విభజన సమయంలో పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌, ఆఫ్ఘనిస్థాన్‌లలో మిగిలిపోయిన హిందువులు, సిక్కులు, క్రైస్తవులు, బౌద్ధులు, జైనులు, పార్సీలు మతపరమైన వేధింపులకు గురైన సందర్భాలను రామచందర్‌రావు ప్రస్తావించారు. పాకిస్థాన్‌ తొలి న్యాయశాఖ మంత్రి జోగేంద్రనాథ్‌ మండల్‌ అక్కడి పరిస్థితులను తట్టుకోలేక భారత్‌కు తిరిగి వచ్చిన విషయాన్ని గుర్తుచేశారు. అలాంటి పరిస్థితుల్లో పొరుగు దేశాల నుంచి భారత్‌కు వచ్చిన బాధితులకు పౌరసత్వం కల్పించడమే సీఏఏ ఉద్దేశమని తెలిపారు.
జాతీయ గేయం ‘వందేమాతరం’ అంశంపైనా రామచందర్‌రావు కాంగ్రెస్‌పై విమర్శలు చేశారు. వందేమాతరం ఏ మతానికీ వ్యతిరేకం కాదని, దేశభక్తికి ప్రతీకగా నిలిచే జాతీయ గేయమని పేర్కొన్నారు. హైదరాబాద్‌ సంస్థాన విముక్తి పోరాటంలో జర్నలిస్ట్‌ షోయబుల్లా ఖాన్‌ వంటి దేశభక్తులు వందేమాతరం నినదిస్తూ ప్రాణత్యాగం చేశారని గుర్తుచేశారు. ఓటు బ్యాంకు రాజకీయాల కోసం వందేమాతరాన్ని వివాదాస్పదం చేయడం సరికాదన్నారు.
రాష్ట్రంలోని కాంగ్రెస్‌, గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వాలు మైనారిటీల సంక్షేమాన్ని విస్మరించాయని రామచందర్‌రావు ఆరోపించారు. మైనారిటీ సంక్షేమ సంస్థలకు అవసరమైన నిధులు కేటాయించకుండా పదవులు, కార్యాలయాలకే పరిమితమయ్యారని విమర్శించారు. మైనారిటీ గురుకులాలు, హాస్టళ్లలో మౌలిక వసతుల కొరత ఉందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం మైనారిటీ యువతకు ఉపాధి, స్వయం ఉపాధి అవకాశాలు కల్పిస్తుంటే.. రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం మైనారిటీలను రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకుంటోందని ఆరోపించారు.
స్టార్టప్‌ ఇండియా, స్టాండప్‌ ఇండియా, మేక్‌ ఇన్‌ ఇండియా, నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాల ద్వారా యువతకు అవకాశాలు లభిస్తున్నాయని ఆయన అన్నారు. మైనారిటీ యువత కూడా ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా ఎదగాలని సూచించారు. సంక్షేమ పథకాల ప్రయోజనాలను క్షేత్రస్థాయిలో ప్రజలకు వివరించి, కేంద్ర ప్రభుత్వ విధానాలను ప్రతి కుటుంబానికి చేరువ చేయాలని మైనారిటీ మోర్చా నాయకులకు పిలుపునిచ్చారు.
మజ్లిస్‌ పార్టీపై కూడా రామచందర్‌రావు తీవ్ర విమర్శలు చేశారు. అధికారంలో ఎవరుంటే వారికి మద్దతు ఇస్తూ మజ్లిస్‌ రాజకీయంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. గతంలో బీఆర్‌ఎస్‌తో, ప్రస్తుతం కాంగ్రెస్‌తో ఆ పార్టీ రాజకీయ అవగాహనతో ముందుకు సాగుతోందని విమర్శించారు. పాతబస్తీ అభివృద్ధి విషయంలో కూడా మజ్లిస్‌ వైఖరిని ఆయన తప్పుబట్టారు. బీజేపీ పోరాటం కారణంగానే పాతబస్తీకి మెట్రో రైలు ప్రాజెక్టు మంజూరైందని పేర్కొన్నారు.
హైదరాబాద్‌ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలను ప్రస్తావిస్తూ.. బీజేపీ అభ్యర్థిని ఓడించేందుకు కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ పార్టీలు మజ్లిస్‌తో కలిసి పనిచేశాయని రామచందర్‌రావు ఆరోపించారు. మైనారిటీల సమస్యలపై నిజమైన పోరాటం చేయాల్సింది పోయి ఎన్నికల సమయంలో మాత్రమే వారి గురించి మాట్లాడుతున్నారని విమర్శించారు. మైనారిటీల సంక్షేమం, విద్య, ఉపాధి, ఆర్థిక అభివృద్ధి వంటి అంశాలపై బీజేపీ నిరంతరం పనిచేస్తోందని తెలిపారు.
ప్రధాని నరేంద్ర మోదీకి పలు ఇస్లామిక్‌ దేశాలు అత్యున్నత పౌర పురస్కారాలు అందించి గౌరవించిన విషయాన్ని రామచందర్‌రావు ప్రస్తావించారు. ముస్లిం దేశాలతో భారత్‌ సంబంధాలను బలోపేతం చేయడంలో మోదీ ప్రభుత్వం కీలక పాత్ర పోషిస్తోందన్నారు. అంతర్జాతీయ స్థాయిలో భారతదేశ ప్రతిష్ఠ పెరుగుతున్న సమయంలో దేశంలో మతాల మధ్య విభేదాలు సృష్టించే ప్రయత్నాలు చేయడం సరికాదని అన్నారు.
మైనారిటీ మోర్చా నాయకులు, కార్యకర్తలు కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలపై విస్తృత అవగాహన కల్పించాలని రామచందర్‌రావు సూచించారు. గ్రామాలు, మండలాల స్థాయిలో ప్రజలను కలుసుకుని పథకాల ప్రయోజనాలను వివరించాలని, అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు చేరేలా కృషి చేయాలని కోరారు. మైనారిటీ వర్గాల్లో బీజేపీ పట్ల నమ్మకాన్ని మరింత పెంచేలా క్షేత్రస్థాయిలో పనిచేయాలని పిలుపునిచ్చారు.
రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పార్టీ సంస్థాగతంగా మరింత బలోపేతం కావాలని ఆయన అన్నారు. మైనారిటీ వర్గాల్లోని యువత, మహిళలు, విద్యార్థులు, వ్యాపారులు, ఉద్యోగులతో విస్తృతంగా సంబంధాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. మోదీ ప్రభుత్వ విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతోపాటు కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ ప్రభుత్వాల పాలనలో మైనారిటీలకు జరిగిన అన్యాయాన్ని ప్రజలకు వివరించాలని అన్నారు.
తెలంగాణలో భవిష్యత్తులో బీజేపీ అధికారంలోకి వస్తుందని రామచందర్‌రావు ధీమా వ్యక్తం చేశారు. అందుకోసం ఇప్పటి నుంచే పార్టీ శ్రేణులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. మైనారిటీ మోర్చా పార్టీకి అనుబంధ విభాగంగా మాత్రమే కాకుండా.. మైనారిటీ వర్గాలతో నేరుగా అనుసంధానమయ్యే వేదికగా పనిచేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పార్లమెంట్‌ సభ్యురాలు డీకే అరుణతో పాటు పలువురు రాష్ట్ర, జిల్లా నాయకులు పాల్గొన్నారు.

Latest