Mahaa Daily Exclusive

  ప్రశాంతంగా నీట్‌ పీజీ పరీక్ష..! జైపూర్‌లో రెండు కేంద్రాల్లో విద్యుత్‌ అంతరాయం..

Share

• జైపూర్‌లో రెండు కేంద్రాల్లో విద్యుత్‌ అంతరాయం.
• సెప్టెంబర్‌ 5న రీటెస్ట్‌.

ఢిల్లీ, మహా.
దేశవ్యాప్తంగా వైద్య పీజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్‌ పీజీ–2026 పరీక్ష ఆదివారం ప్రశాంతంగా జరిగింది. దేశవ్యాప్తంగా సుమారు 2.73 లక్షల మందికి పైగా అభ్యర్థులు కంప్యూటర్‌ ఆధారిత పరీక్షకు హాజరయ్యారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పరీక్ష నిర్వహించారు. అయితే రాజస్థాన్‌లోని జైపూర్‌లో రెండు పరీక్ష కేంద్రాల్లో సాంకేతిక సమస్యలు, విద్యుత్‌ అంతరాయంతో పరీక్షకు ఆటంకం ఏర్పడింది.

జైపూర్‌లోని సీతాపుర ప్రాంతంలోని కేంద్రాల్లో కంప్యూటర్‌ వ్యవస్థలు సక్రమంగా పనిచేయకపోవడంతో పలువురు అభ్యర్థులు ఆందోళనకు దిగారు. కొన్ని కంప్యూటర్లు పనిచేస్తుండగా మరికొన్ని పదేపదే నిలిచిపోవడంతో పరీక్ష రాయలేకపోయామని అభ్యర్థులు తెలిపారు. పరీక్ష ప్రారంభానికి ముందే సిస్టమ్‌లు ఆగిపోవడం, కొద్దిసేపు పనిచేసి మళ్లీ నిలిచిపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నామని చెప్పారు.

పరీక్ష నిర్వహణ సంస్థ నేషనల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్స్‌ ఇన్‌ మెడికల్‌ సైన్సెస్‌ (ఎన్‌బీఈఎంఎస్‌) ఈ రెండు కేంద్రాల్లో పరీక్షను వాయిదా వేసింది. ప్రభావితమైన సుమారు 300 మంది అభ్యర్థులకు సెప్టెంబర్‌ 5న మధ్యాహ్నం 3 గంటలకు రీటెస్ట్‌ నిర్వహించనున్నట్లు ప్రకటించింది. పరీక్ష కేంద్రం, సవరించిన అడ్మిట్‌ కార్డులకు సంబంధించిన వివరాలను ప్రత్యేకంగా తెలియజేస్తామని వెల్లడించింది.

సాంకేతిక సమస్యపై అభ్యర్థులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. దేశంలోని అత్యంత కీలకమైన వైద్య ప్రవేశ పరీక్షల్లో ఒకటైన నీట్‌ పీజీకి తగిన సాంకేతిక సదుపాయాలు కల్పించలేకపోవడంపై ప్రశ్నించారు. కేవలం రెండు కేంద్రాల్లోనే మళ్లీ పరీక్ష నిర్వహించడం కంటే దేశవ్యాప్తంగా పరీక్షను మరోసారి నిర్వహించాలని కొందరు డిమాండ్‌ చేశారు.

జైపూర్‌ పోలీసు అధికారి లలిత్‌ శర్మ మాట్లాడుతూ సర్వర్‌ సమస్య కారణంగానే పరీక్షకు అంతరాయం ఏర్పడినట్లు ప్రాథమికంగా తెలుస్తోందన్నారు. కొన్ని కంప్యూటర్లు పనిచేయగా, మరికొన్ని పనిచేయకపోవడంతో సమస్య తలెత్తిందని తెలిపారు. అభ్యర్థులతో అధికారులు చర్చిస్తూ పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేశారని చెప్పారు. పరీక్ష నిర్వహణ సంస్థతో ఉన్నతాధికారులు ఈ అంశంపై చర్చిస్తున్నట్లు వెల్లడించారు.

దేశవ్యాప్తంగా మిగిలిన కేంద్రాల్లో మాత్రం పరీక్ష సజావుగా సాగింది. వైద్య విద్యలో పీజీ కోర్సుల్లో ప్రవేశం కోసం నిర్వహించే ఈ పరీక్షకు లక్షలాది మంది అభ్యర్థులు హాజరయ్యారు. జైపూర్‌లో ఏర్పడిన సాంకేతిక అంతరాయం మినహా పెద్దగా సమస్యలు తలెత్తకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.

అయితే నీట్‌ యూజీ పరీక్షల చుట్టూ గతంలో చోటుచేసుకున్న వివాదాల నేపథ్యంలో నీట్‌ పీజీ పరీక్ష నిర్వహణలో జరిగిన ఈ ఘటన ప్రాధాన్యం సంతరించుకుంది. పరీక్షల నిర్వహణలో సాంకేతిక మౌలిక వసతులు, సర్వర్‌ సామర్థ్యం, విద్యుత్‌ బ్యాకప్‌ వంటి అంశాలపై మరింత కట్టుదిట్టమైన ఏర్పాట్లు అవసరమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభావిత అభ్యర్థులకు సెప్టెంబర్‌ 5న రీటెస్ట్‌ నిర్వహించడంతో ఈ సమస్యకు పరిష్కారం లభించనుంది.

Latest