Mahaa Daily Exclusive

  నాంపల్లిలో కొంత సేపు టెన్షన్… టెన్షన్..! అమిత్ షా రాజీనామా చేయాలన్న యూత్ కాంగ్రెస్ నేతలు..

Share

  • నాంపల్లిలో కొంత సేపు టెన్షన్… టెన్షన్
  • బీజేపీ ఆఫీసు ముట్టడికి యూత్ కాంగ్రెస్ యత్నం
  • పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత
  • అమిత్ షా రాజీనామా చేయాలన్న యూత్ కాంగ్రెస్ నేతలు

హైదరాబాద్‌, మహా : నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయాన్ని ముట్టడించేందుకు యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు యత్నించడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను అవమానించారని ఆరోపిస్తూ యూత్ కాంగ్రెస్ నేతలు తమ ఆందోళనలో భాగంగా ఒక్కసారిగా బీజేపీ ఆఫీసు ముట్టడికి యత్నించారు. నిరసనలో భాగంగా కార్యకర్తలు కాంగ్రెస్ జిందాబాద్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ బీజేపీ ఆఫీస్ వైపు దూసుకెళ్ళారు. కార్యాలయం ప్రధాన ద్వారం తోసుకుని లోనికి వెళ్ళేందుకు ప్రయత్నించగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఈ సందర్భంగా కొంత మంది కార్యకర్తలు బీజేపీ కార్యాలయ గేట్ కు నల్ల రంగును పూశారు.

కేంద్ర హోంమంత్రి అమిత్ షా వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని ఈ సందర్భంగా కాంగ్రెస్ కార్యకర్తలు, యూత్ కాంగ్రెస్ ఆందోళనకారులు డిమాండ్ చేశారు. నిరసన తెలుపుతూ అమిత్ షా దిష్టిబొమ్మను దగ్ధం చేసే ప్రయత్నం చేశారు. ఆపై బీజేపీ కార్యాలయంలోకి చొచ్చుకెళ్లేందుకు కాంగ్రెస్ శ్రేణులు యత్నించగా, అప్రమత్తమైన పోలీసులు వారిని వెంటనే అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య తీవ్ర వాగ్వాదం మొదలై, తోపులాట జరగడంతో అక్కడ కొద్దిసేపు హైటెన్షన్ వాతావరణం ఏర్పడింది. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు కొందరు ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను అవమానపరిచే విధంగా బీజేపీ వ్యవహరించిందంటూ గత కొద్ది రోజులుగా కాంగ్రెస్ ఆందోళనా కార్యక్రమాలను నిర్వహిస్తున్న నేపథ్యంలోనే యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు బీజేపీ కార్యాలయ ముట్టడికి ప్రయత్నించారు.

అటు గాంధీ భవన్, ఇటు బీజేపీ కార్యాలయాలను పోలీసులు పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకోవడంతో ప్రధాన రహదారిలో దాదాపు రెండు గంటల పాటు ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. గతంలోనూ బీజేపీ కాంగ్రెస్ పార్టీల కార్యకర్తలు పరస్పరం దాడులకు దిగిన ఘటనలను దృష్టిలో పెట్టుకుని పోలీసులు ముందస్తు పటిష్టమైన చర్యలు తీసుకున్నారు. దీంతో ఆ ప్రాంతంలో దాదాపు రెండు గంటల పాటు ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.

Latest