- తెలంగాణలో మునిసిపల్ బరిలో ఒంటరిగానే పోటీ
- తేల్చేసిన జనసేన
- హైదరాబాద్, మల్కాజిగిరి, శేరిలింగంపల్లి కార్పొరేషన్లలో పోటీ చేస్తామని ప్రకటన
- జన సైనికులు సిద్దం కావాలని పిలుపు
హైదరాబాద్, మహా : ఏపీలో ఎన్డీఏ కూటమిలో కీలకంగా ఉన్న జనసేన తెలంగాణలో ఎన్నికల బరిలోకి ఒంటరిగానే దిగాలని డిసైడ్ అయింది. వచ్చే ప్రధాన మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో తాము బరిలోకి దిగుతున్నామని జనసేన కీలక ప్రకటన చేసింది. పార్టీ పోటీ చేసే కార్పోరేషన్ల జాబితానూ ప్రకటించింది. తాము ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్నప్పటికీ ఈ పోటీ నిర్ణయంలో మార్పు ఉండదని స్పష్టం చేసింది. ఈ ఎన్నికల్లో తమ సత్తా చాటుతామని వెల్లడించింది. జనసేన నిర్ణయంతో కార్పోరేషన్ ఎన్నికల వేళ కొత్త రాజకీయ సమీకరణాలు తెర మీదకు వస్తున్నాయి. అందులో భాగంగా గ్రేటర్ పరిధిలో జరిగే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో బరిలోకి దిగుతున్నామని జనసేన అధికార ప్రతినిధి తళ్లూరి రామ్ వెల్లడించారు. గ్రేటర్ హైదరాబాద్, మల్కాజిగిరి, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో తమ పార్టీ బలంగా పోటీ చేస్తుందని వెల్లడించారు. కొద్ది నెలల క్రితం తెలంగాణలో పోటీపైన జనసేనాని పవన్ కీలక ప్రకటన చేసారు. అందులో భాగంగా మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలను లక్ష్యంగా పెట్టుకుంది. వచ్చే గ్రేటర్ హైదరాబాద్, మల్కాజిగిరి, సైబరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో తమ పార్టీ బలంగా పోటీ చేస్తుందని ప్రధాన కార్యదర్శి తాళ్లూరి రామ్ స్పష్టం చేశారు. గ్రేటర్ జనసేన విస్తృత స్థాయి సమావేశంలో పార్టీ శ్రేణులు ఎన్నికలకు సిద్ధం కావాలని సూచించారు.
తెలంగాణలో ఒంటరి పోరుకు సిద్దం జనసేన పార్టీ చేపడుతున్న కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పార్టీ శఅరేణులకు తళ్లూరి రామ్ నిర్దేశించారు. ఇదే సమయంలో పార్టీ ఆవిర్భావం నుంచి జనసేన బలోపేతం కోసం పనిచేసిన ప్రతి ఒక్కరికి సముచిత స్థానం దక్కుతుందని తెలిపారు. పోటీ చేసే అభ్యర్థులు క్షేత్ర స్థాయిలో ప్రజలతో మమేకమై పనిచేయాలని ఆయన సూచించారు. తెలంగాణ రాష్ట్ర రాజకీయ భవితవ్యానికి ఈ ఎన్నికలే దిక్సూచి కానున్నాయని ప్రచార కార్యదర్శి సాగర్ ఆర్‌కే నాయుడు పేర్కొన్నారు. ఇక్కడ వచ్చిన ఫలితాలే రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయిస్తాయని ఆయన అన్నారు. అయితే.. ఇప్పటికే వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా మాజీ హెల్త్ డైరెక్టర్ డాక్టర్ గడల శ్రీనివాసరావు పేరును జనసేన ప్రకటించింది. ఇప్పుడు గ్రేటర్ ఎన్నికల బరిలోకి దిగుతున్నట్లు ప్రకటించడంతో తెలంగాణలో పార్టీని బలోపేతం చేయడంపై జనసేన అధిష్ఠానం సీరియస్‌గా దృష్టి సారించినట్లు స్పష్టమవుతోంది.








